మరింత కఠినం

ABN , First Publish Date - 2020-03-25T11:14:53+05:30 IST

జిల్లావ్యాప్తంగా రెండో రోజూ లాక్‌డౌన్‌ కొనసాగింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాలు

మరింత కఠినం

సరిహద్దులో వాహనాలు నిలిపివేత

జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో  మోహరించిన పోలీసులు

నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు 

వాహనాలు సీజ్‌

పర్యవేక్షించిన కలెక్టర్‌, ఎస్పీ


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా రెండో రోజూ లాక్‌డౌన్‌ కొనసాగింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాలు నిర్మానుష్యమయ్యాయి. అటు ఒడిశా, ఇటు జిల్లా సరిహద్దు ప్రాంతాలను మూసివేసి వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు ఎక్కడికక్కడే మోహరించి ప్రజలను నిలువరించారు. కానీ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై కొంతమంది యువకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాహనాలతో బయటకు వచ్చేసి పోలీసులతో వాదనలకు దిగారు. పోలీసులు ఓపికగా చెబుతున్నప్పటికీ వారు పెడచెవిన పెట్టారు. గుంపులుగా బయటకురాగా చేసేదేమీ లేక వాహనాలను సీజ్‌ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిలో 100 మందికి పైగా  కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం నగరంతో పాటు అన్ని పట్టణాల్లో వాహనాలను నియంత్రించే భాగంగా రహదారులకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.


రంగంలోకి కలెక్టర్‌, ఎస్పీ ...

జిల్లాలో లాక్‌డౌన్‌ పరిస్థితిపై ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కలెక్టర్‌ నివాస్‌ రంగంలోకి దిగారు. శ్రీకాకుళం నగరంతో పాటు పలుచోట్ల ఆరాతీశారు.  పోలీస్‌ అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి పలుచోట్ల పర్యటించారు.


రైతుబజార్లు కిటకిట.. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యవసరాలకు ఇబ్బందులు లేకుండా ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే.   ఇందులో భాగంగా రైతుబజార్లను తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం.  వేకువజామునుంచే ప్రజలు భారీ ఎత్తున రైతుబజార్లకు చేరుకున్నారు. పైగా ఒకేసారి గుంపులుగా పడిపోవడం.. నిబంధనలు అతిక్రమించడంతో శ్రీకాకుళం రైతుబజార్‌ వద్ద తోపులాట చోటుచేసుకుంది. బయట వాహనాల పార్కింగ్‌ అర కిలోమీటరు వరకూ చేరిపోయింది. చాలామంది నిబంధనలను అతిక్రమించి మాస్కులను ధరించకుండా... గుంపులుగా వచ్చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. ప్రతి దుకాణం వద్దకూడా జనాలు గుమిగూడారు. తర్వాత పోలీసులు చేరుకున్నారు. మైక్‌సెట్‌తో పోలీసులు, ప్రత్యేక పోలీసు బలగాలు చేరుకుని బజారు వద్ద నియంత్రణ చర్యలు ప్రారంభించారు. మాస్క్‌లు ధరించితేనే లోపలకు ప్రవేశం అంటూ స్పష్టంచేయడంతో ప్రతిఒక్కరూ రుమాలు, లేదా మాస్క్‌లను ధరించి లోపలికి వెళ్లారు.  రైతుబజారులో కొద్ది రకాల కూరగాయల అందుబాటులో ఉండడంతో ఉసూరుమంటూ కొనుగోలు చేయాల్సి వచ్చింది. 


నిర్బంధ గదులు సిద్ధం.. 

విదేశాల నుంచి వస్తున్నవారిని నేరుగా కుటుంబాలతో కలవకుండా,  జనజీవనంలోకి చొరబడకుండా ఉండేందుకుగాను ఐసోలేషన్‌ కోసం గదులను సిద్ధంచేశారు. ఇప్పటికే హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారిని ఇటు పోలీసులు, అటు వైద్యశాఖ సిబ్బంది గమనిస్తునే ఉన్నారు.  గత నెల నుంచి ఇప్పటివరకూ 1572 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చారు. ఇందులో 713 మందికి క్వారంటైన్‌ పూర్తిచేశారు. ప్రస్తుతం 859 మందిని పరిశీలనలో ఉంచారు. 


విదేశాల నుంచి శ్రీకాకుళం నగరానికి వచ్చిన ఓ వ్యక్తి గత నాలుగు రోజులుగా ఓ లాడ్జిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు సర్వే చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాలు పూర్తిస్థాయిలో ఆరాతీశారు. ఈ సందర్భంలో ఆ వ్యక్తి అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జిల్లాలో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న  వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఐదుగురి శాంపిళ్లను కాకినాడలోని ప్రత్యేక ఆస్పత్రికి పంపించారు. 

Updated Date - 2020-03-25T11:14:53+05:30 IST