-
-
Home » Andhra Pradesh » Srikakulam » Let settle
-
తేల్చుకుందాం!
ABN , First Publish Date - 2020-11-26T05:25:35+05:30 IST
పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఆక్రమణలపై ప్రశ్నించిన అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఓ ఆక్రమణదారుడు ఏకంగా తహసీల్దార్‌నే పరుష పదజాలంతో బెదిరించాడు. ‘పలాసలో నువ్వయినా ఉండాలి.. లేదా నేనైనా ఉండాలి’... అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ ఆక్రమణదారుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

- నువ్వయినా ఉండాలి... నేనైనా ఉండాలి
- పలాస తహసీల్దార్‌కు ఆక్రమణదారుడి బెదిరింపు
- క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు
పలాస, నవంబరు 25: పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఆక్రమణలపై ప్రశ్నించిన అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఓ ఆక్రమణదారుడు ఏకంగా తహసీల్దార్‌నే పరుష పదజాలంతో బెదిరించాడు. ‘పలాసలో నువ్వయినా ఉండాలి.. లేదా నేనైనా ఉండాలి’... అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ ఆక్రమణదారుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... కాశీబు గ్గలోని సర్వే నంబరు 57/1లో 98 సెంట్ల పోరంబోకు భూమి ఉంది. వాస్తవానికి ఇక్కడ ఎకరా 80 సెంట్ల భూమి ఉండాల్సింది. కానీ... నిర్మాణాలతో సగం భూమి ఆక్రమణకు గురైంది. మిగతా భూమినైనా కాపాడుకుందామని అధికారులు ఆ ప్రాంతంపై నిఘా పెట్టారు. ఆక్రమణకు గురికాకుండా హెచ్చరిక బోర్డులు అమర్చారు. అయితే, పలాసలోని పురుషోత్తపురం కాలనీకి చెందిన డి.రమణ అనే వ్యక్తి ఈ భూమిపై కన్నేశాడు. ఇది తన తండ్రి ఆస్తి నుంచి సంక్రమించిందంటూ మొత్తం ఆ ప్రాంతంలో కంచె ఏర్పాటు చేసి మొక్కలు నాటాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ మధుసూధనరావు, ఆర్‌ఐ రవికుమార్, వీఆర్వో రాంబాబులు ఆ ప్రాంతానికి వెళ్లి మొక్కలు తొలగించి కంచెను ధ్వంసం చేశారు. దీంతో రమణ తన అనుచరులతో మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ అందరి ముందే తహసీల్దార్‌పై దూషణపర్వానికి దిగాడు. చివరకు నువ్వయినా ఉండాలి.. లేదా నేనైనా ఉండాలి అని అంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో మనస్థాపానికి గురైన తహసీల్దార్ మంగళవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వాస్తవాలు, సంబంధిత వీడియో క్లిప్పింగులు పరిశీలించిన సీఐ శంకరరావు.. ఆక్రమణదారుడు రమణపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఆక్రమణకు గురైన స్థలం పరిశీలన..
సర్వే నెంబరు 57/1లో ఆక్రమణకు గురైన స్థలాన్ని తహసీల్దార్ మధుసూధనరావు, సీఐ శంకరరావు, ఆర్‌ఐ రవికుమార్, సర్వేయర్ చలపతిరావు, వీఆర్వో రాంబాబులు బుధవారం పరిశీలించారు. మొత్తం ఎంతమేరకు ఆక్రమణకు గురైంది అనేది సీఐ అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా... సర్వే నెంబరు 57/1బిలో 12 సెంట్ల స్థలంతో పాటు మరో 40 సెంట్ల భూమి ఆక్రమణకు గురైనట్లు సర్వేయర్ అధికారులకు వివరించారు. మొత్తం ఈ ప్రాంతంలో ఎకరాకుపైగా కబ్జాకు గురైనట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని రెవెన్యూ శాఖ సీరియస్‌గా పరిగణిస్తుందని... ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పలాస-కాశీబుగ్గలో భూ ఆక్రమణలపై పత్రికల్లో వస్తున్న కథనాలను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై ఇప్పటికే రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఆక్రమణదారులపై కొరడా ఝుళిపించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.