ఆమె జ్ఞాపకాలతో నడుస్తూ..

ABN , First Publish Date - 2020-10-14T20:00:05+05:30 IST

భవిష్యత్తుపై ఎన్నో కలలుగ న్నారా నవ దంపతులు. తన భార్య త్వరలో బిడ్డకు జన్మనివ్వబో తోందని..

ఆమె జ్ఞాపకాలతో నడుస్తూ..

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

భార్య మృతిచెందిన 24 గంటల్లోనే దుర్ఘటన

వివాహమైన నాలుగు నెలలకే  ఘోరం

కొఠారి, బెల్లుపడ గ్రామాల్లో విషాదం


ఇచ్ఛాపురం: భవిష్యత్తుపై ఎన్నో కలలుగ న్నారా నవ దంపతులు. తన భార్య త్వరలో బిడ్డకు జన్మనివ్వబో తోందని తెలిసి ఎంతో పొంగిపోయాడా యువకుడు. ఈ శుభవార్త తెలిసి ఇరువైపుల కుటుంబ సభ్యులూ సంతోషంలో మునిగిపో యారు. నాలుగు నెలల కిందటే తన జీవితంలోకి వచ్చిన భార్యను కంటికి రెప్పలా చూసుకున్నాడా భర్త. వీరి అన్యోన్య దాంపత్యాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో... అనారోగ్యం రూపంలో భార్యను... రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను 24 గంటల వ్యవధిలో మృత్యు వు కాటేసింది. ఈ విషాద సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కొఠారి గ్రామానికి చెందిన బుడ్డేపు రాజేష్‌ (26)కు బెల్లుపడకు చెందిన జయ అనే యువతితో ఈ ఏడాది జూన్‌ 12న వివాహమైంది. ప్రస్తుతం జయ గర్భిణి. ఆదివారం రాత్రి ఆమె కడుపునొప్పితో బాధ పడడంతో కుటుంబ సభ్యులు ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తీసుకుళ్లారు.


పరిస్థితి విషమించడంతో ఒడి శాలోని బరంపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ సోమవారం జయ మృతిచెందింది. ఆమె కన్నవారి గ్రామమైన బెల్లుపడలో అంత్యక్రియలు పూర్తిచేశారు.  భార్యను కోల్పోయిన రాజేష్‌   మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే మంగళవా రం ఉదయం అత్తవారింటి నుంచి స్వగ్రామం కొఠారికి కాలినడకన బయలుదేరాడు. ఇంతలో జాతీయ రహదారిపై బెల్లుపడ జంక్షన్‌  వద్దకు వచ్చేసరికి లారీ ఢీకొట్టింది. దీంతో రాజేష్‌ ఘటనా స్థలం లోనే  ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, కొఠారి గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. గంటల వ్యవధిలో నవదంపతులు మృతిచెందడంతో కొఠారి, బెల్లుపడలో విషాదఛాయలు అలముకున్నాయి. రాజేష్‌ భవన నిర్మాణ కార్మికుడిగా చెన్నై, బెంగళూరులో పని చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో అతి కష్టమ్మీద స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆ సమయంలో జయతో వివాహం కుదిరింది. 


ఆమె వలంటీరుగా పని చేస్తోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉండడంతో ఇరు కుటుంబాల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభించిన వీరి అకాల మరణాన్ని ఇరు కుటుంబాలు జీర్ణించు కోలేకపోతున్నాయి. రాజేష్‌ తల్లిదండ్రులు రామారావు, పార్వతి  గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక సీహెచ్‌సీలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. 

Updated Date - 2020-10-14T20:00:05+05:30 IST