రెండు వారాల క్రితం పెళ్లి.. భార్యను పుట్టింట్లో వదిలి.. ఇంటికెళ్తుండగా..

ABN , First Publish Date - 2020-08-16T18:44:23+05:30 IST

ఆ ఇంట పెళ్లిసందడి ఇంకా ముగియనే లేదు. పెళ్లి ముచ్చట తీరనేలేదు. ..

రెండు వారాల క్రితం పెళ్లి.. భార్యను పుట్టింట్లో వదిలి.. ఇంటికెళ్తుండగా..

పెళ్లిముచ్చట తీరకుండానే...

వివాహమైన రెండు వారాలకే వరుడు మృతి

రోడ్డు ప్రమాదం రూపంలో కబళించిన మృత్యువు

నవవధువుకు తీరని శోకం

కవిటి కొత్తూరులో విషాదం


కవిటి(శ్రీకాకుళం): ఆ ఇంట పెళ్లిసందడి ఇంకా ముగియనే లేదు. పెళ్లి ముచ్చట తీరనేలేదు. నూతన దంపతుల తిరుగు మరుగులు పూర్తికాలేదు. ఇంతలోనే మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదం రూపంలో నవ వరుడిని కబళించింది. లండారిపుట్టుగ సమీపంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఇరుకుటుంబాలతో పాటు గ్రామాల్లోనూ విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. 


కవిటి కొత్తూరు గ్రామానికి చెందిన సాలిన బాలకృష్ణ (27)కు గత నెల 29న లండారిపుట్టుగకు చెందిన యువతితో వివాహమైంది. కొవిడ్‌ నిబంధనలతో కొద్దిమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. ఈ నేపథ్యంలో నూతన దంపతులు ద్విచక్ర వాహనంపై శుక్రవారం లండారిపుట్టుగ వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపారు.  భార్యను కన్నవారింట వదిలి బాలకృష్ణ శనివారం ఉదయం మళ్లీ ద్విచక్ర వాహనంపై కవిటి కొత్తూరు బయలుదేరాడు.


లండారిపుట్టుగ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో బాలకృష్ణ రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్రగాయమై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. స్థానికులు సోంపేట సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌)కి రిఫర్‌ చేశారు. జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో బాలకృష్ణ మృతిచెందాడు. మృతుడికి తల్లిదండ్రులు వరలక్ష్మి, చలమయ్య ఉన్నారు. వారు సాధారణ వ్యవసాయ కూలీలు. బాలకృష్ణ స్థానికంగా ఎలక్ట్రికల్‌ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.


ఆయన అకాల మృతిని కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. వివాహమైన రెండు వారాలకే భర్త మృతి చెందడంతో నవ వధువు గుండెలవిసేలా రోదిస్తోంది. వధూవరుల గ్రామాలు కవిటి కొత్తూరు, లండారిపుట్టుగలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి సోదరి భారతి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.వాసునారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-08-16T18:44:23+05:30 IST