జనతా కర్ఫ్యూ..పాటించాల్సిందే

ABN , First Publish Date - 2020-03-21T09:31:37+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖతోపాటు మత్స్యశాఖ, పంచాయతీ, నగరపాలక సంస్థ, మున్సిపల్‌ శాఖల అధికారులు కరోనా

జనతా కర్ఫ్యూ..పాటించాల్సిందే

జిల్లావాసులకు కలెక్టర్‌ నివాస్‌ పిలుపు

కరోనాపై సమరానికి సహకరించాలని విజ్ఞప్తి

విదేశాల నుంచి వచ్చినవారు యథేచ్ఛగా తిరగకూడదని హెచ్చరికలు


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖతోపాటు  మత్స్యశాఖ, పంచాయతీ, నగరపాలక సంస్థ, మున్సిపల్‌ శాఖల అధికారులు కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటా సర్వే చేపట్టి.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆదివారం జిల్లాలో జనతా కర్ఫ్యూ ప్రతి ఒక్కరూ పాటించాలని కలెక్టర్‌ నివాస్‌ పిలుపునిచ్చారు. శనివారం నుంచి అరసవల్లిలో భక్తుల ప్రవేశాన్ని నిషేధించామని తెలిపారు. ఈ ఆదివారం భక్తులు ఎవరూ ఆలయానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో కరోనా వైరస్‌ సోకకుండా సమరం సాగిస్తున్నామని, అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని వివరించారు.


కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం రైతు బజార్లు మూసివేస్తున్నామని.. వారం రోజులపాటు సినిమాహాళ్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. జనసంద్రంగా ఉండే అన్ని ప్రాంతాలు మూసివేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించామని, వీటిని సాధారణ సెలవులుగా తీసుకుని బయట తిరగరాదని కలెక్టర్‌ కోరారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం, శానిటైజర్లు వినియోగించడం, మంచి నీటిని తాగడం చేయాలని సూచించారు. ప్రయాణాలను తగ్గించుకోవాలని, ఇతరులతో మాట్లాడేటప్పుడు దూరం పాటించాలని పేర్కొన్నారు. 

 

విదేశీయులపై నిఘా

జిల్లాకు ఇతర దేశాల నుంచి వచ్చినవారిపై నిఘా పెడుతున్నారు. శుక్రవారం నాటికి 238 మంది స్వీయ గృహనిర్బంధంలో ఉన్నారని కలెక్టర్‌ నివాస్‌ స్పష్టం చేశారు.  తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రిల్లో 90 బెడ్లను ఐసోలేషన్‌ వార్డులలో ఏర్పాటు చేశామన్నారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చేవారు తమ వివరాలు కంట్రోల్‌ రూమ్‌కు (ఫోన్‌నెంబర్లు 9491222122, 08942 240699) తెలియజేయాలని కలెక్టర్‌ కోరారు.  కరోనా వైరస్‌ స్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు జిల్లా ఉపాధికల్పన అధికారి శ్రీనివాసరావును ప్రత్యేకాధికారిగా  నియమించామని చెప్పారు.


విదేశాల నుంచి వచ్చినవారు బయటకు తిరిగితే ఐపీసీ సెక్షన్‌ 188 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రత్యేక టాస్క్‌ ఫోర్సు ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చేవారి నిర్లక్ష్యం వల్ల జిల్లాలో 28లక్షల మంది జనాభాను ప్రమాదక పరిస్థితుల్లో పెట్టలేమని ఆయన స్పష్టం చేశారు. అలాగే మత్స్యకారులు కూడా కరోనాకు గురయ్యే అవకాశం ఉండటంతో..  మత్స్యశాఖ ద్వారా వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.


ఆసుపత్రి వ్యర్థాలను తీసేటప్పుడు విధిగా బ్లీచింగు, హైపోక్లోరైడ్‌ సొల్యూషన్‌ వినియోగించాలని సూచించారు. వీధుల్లో చెత్తను సైతం తొలగించేందుకు సురక్షిత చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆసుపత్రిల్లోకి ప్రవేశించే ముందుగా శానిటైజేషన్‌ చేసుకోవాలని, వ్యాధి లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.  

Updated Date - 2020-03-21T09:31:37+05:30 IST