స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకు జగన్ సర్కార్..
ABN , First Publish Date - 2020-09-03T20:11:03+05:30 IST
స్వర్ణప్యాలెస్ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలన్న...

న్యూఢిల్లీ: స్వర్ణప్యాలెస్ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసిన జగన్ సర్కార్ సుప్రీంకు వెళ్లింది. రమేశ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ పి.రమేశ్‌బాబు, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీతారామమోహన్‌రావులపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాదు, స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం సంగతేమిటని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో నిలదీసింది. ఇదే హోటల్‌లో అంతకుముందు ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాన్ని నిర్వహించిన నేపథ్యంలో... ‘‘స్వర్ణ ప్యాలెస్ సురక్షితం కాదని తెలిసినప్పుడు అక్కడ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు సబ్ కలెక్టర్ ఎలా అనుమతిచ్చారు? స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ క్వారంటైన్ కేంద్రం నిర్వహించే ముందు సబ్ కలెక్టర్ అసలు విచారణ జరిపారా? హోటల్‌ను పరిశీలించారా?’’ అని ప్రశ్నించింది.
ఈ వ్యవహారానికి సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్‌వోలను నిందితులుగా ఎందుకు చేర్చలేదని నిలదీసింది. వారిని నిందితులుగా చేర్చేదాకా ఈ కేసులో ముందుకెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి.. రమేశ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ పి.రమేశ్‌బాబు, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీతారామమోహన్‌రావులపై నమోదుచేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.