గుంటూరుకు గుడ్‌న్యూస్.. రూ.150 కోట్లతో, 150 గదులతో..
ABN , First Publish Date - 2020-10-10T17:32:10+05:30 IST
గుంటూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో ఐటీసీ(ఇండియన్ టుబాకో కంపెనీ) ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణం...
గుంటూరు: గుంటూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో ఐటీసీ(ఇండియన్ టుబాకో కంపెనీ) ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణం పూర్తి చేసుకుంది. నాలుగేళ్ల కిందట దీని నిర్మాణం ప్రారంభించారు. వచ్చే ఏడాది దీనిని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. రూ.150 కోట్లతో 12 అంతస్తులు, 150 గదులతో అంతర్జాతీయ ఎగుమతి వ్యాపారులు, పర్యాటకుల కోసం దీనిని నిర్మించారు. నవ్యాంధ్ర రాజధానిగా గత ప్రభుత్వం అమరావతిని ఎంపిక చేసుకోవడంతో ఐటీసీ జాతీయ స్థాయిలో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతుల కోసం గుంటూరునే కేంద్రంగా చేసుకుంది. దీనికి అనుసంధానంగా రూ.100 కోట్లతో వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేసే ల్యాబ్‌ను స్థాపించారు. గతంలో ఐటీసీ కేవలం పొగాకు ఎగుమతులకే పరిమితమైంది. దశలవారీగా సుగంధ ద్రవ్యాలు, పసుపు, మిర్చి తదితర వ్యవసాయ అనుబంధ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించింది. గుంటూరులో ఏటా పత్తి, మిర్చి, పొగాకు, పసుపు తదితర వాణిజ్య పంటలు, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు రూ.లక్ష కోట్లకు పైగా ఉంటుంది. గుంటూరు-చిలకలూరిపేట రోడ్డులోని స్పైసెస్ పార్క్‌లో ఐటీసీ సుమారు పదెకరాల్లో సుగంద ద్రవ్యాల ఎగుమతి సంస్థను ఏర్పాటు చేసింది.
జాతీయ స్థాయిలో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులను గుంటూరు నుంచే పర్యవేక్షిస్తున్నారు. దీంతో.. నిత్యం వ్యాపార లావాదేవీల కోసం అంతర్జాతీయ వ్యాపారులు, ఎగుమతిదారులు గుంటూరు వస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని రింగురోడ్డులో గతంలో ఉన్న అతిథి గృహాన్ని తొలగించి ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారటం, ఇసుక సకాలంలో అందకపోవడంతో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణం పనులు నత్తనడకగా సాగాయి. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఫైవ్‌స్టార్ హోటల్ వలన సుమారు 1000 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే నిర్మాణ పనులు, పెయింటింగ్ పూర్తయింది. చుట్టూ సుందరీకరణ పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరులో తొలి ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మించడంపై అంతర్జాతీయ పొగాకు, వాణిజ్య పంటల ఎగుమతి వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ విజయవాడ హోటళ్లలో ఉండి గుంటూరులో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తూ వచ్చారు. వచ్చే సంవత్సరం నుంచి ఈ పరిస్థితి మారనుంది.