మేము ఉండలేం.. మమ్మల్ని ఇంటికి పంపించేయండి
ABN , First Publish Date - 2020-04-05T10:24:34+05:30 IST
ఐసోలేషన్ కేంద్రాల్లో సౌకర్యాలు సక్రమంగా..

ట్రిపుల్ ఐటీ ఐసోలేషన్ కేంద్రం వద్ద ఆందోళన
పరిస్థితిని సమీక్షించిన అధికారులు
ఎచ్చెర్ల(శ్రీకాకుళం): ఐసోలేషన్ కేంద్రాల్లో సౌకర్యాలు సక్రమంగా లేవంటూ.. కొందరు ఆందోళన బాట పట్టారు. ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురంలోని ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రం నుంచి తమను ఇళ్లకు పంపించాలని డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్న భోజనం మానుకొని.. వరండాలో ఆందోళన చేపట్టారు. గత నెల 28న ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో ప్రస్తుతం 142 మంది ఉన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉపాధి పొందుతూ జిల్లాకు వచ్చిన, పలు ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడ ఉంచారు.
వీరందరికీ వేర్వేరు గదులను కేటాయించారు. అయితే కామన్ బాత్రూమ్లతో ఇబ్బంది పడుతున్నామని నాలుగు రోజుల కిందట ఆందోళన చేశారు. ఐసోలేషన్ కేంద్రంలో ఉండేందుకు ఇబ్బందిగా ఉందని... తమను ఇంటికి పంపించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ సోమశేఖర్, ఆర్డీవో ఎం.వి.రమణ, జేఆర్‌పురం సీఐ హెచ్.మల్లేశ్వరరావు, ఎచ్చెర్ల ఎస్ఐ జి.రాజేష్, తహసీల్దార్ ఎస్.సుధాసాగర్ ట్రిపుల్ ఐటీని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
సౌకర్యాలు కల్పించండి
రాజాం/రూరల్: ‘ఇక్కడ ఏమాత్రం సౌకర్యాలు లేవు.. రాత్రి వేళ తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్లిపోయారు.. ఆకలితో ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు..’ రాజాంలోని ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నవారి ఆందోళన ఇది. శ్రీకాకుళం రిమ్స్‌లో వైద్యపరీక్షలు నిర్వహించగా, నెగిటివ్ రిపోర్టులు వచ్చాయని.. అయితే శుక్రవారం రాత్రి తమను రాజాం తీసుకువచ్చారని వారు విలేకరులకు చెప్పారు. తమతోపాటు వచ్చిన ఓ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు బాధను కలిగించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు తాము వ్యతిరేకం కాదని.. మనుషుల్లా చూడకపోవడం సరికాదన్నారు. ఐసోలేషన్ కేంద్రంలో తమకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.