హడలెత్తించిన ఇరాన్‌ విద్యార్థినిలు

ABN , First Publish Date - 2020-03-28T06:47:06+05:30 IST

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన విద్యార్థినులు సంచరించడంతో ప్రజలతో పాటు జిల్లా అధికారులు హడలెత్తిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల

హడలెత్తించిన ఇరాన్‌ విద్యార్థినిలు

 శ్రీకాకుళం క్రైం, మార్చి 27 : శ్రీకాకుళం పాతబస్టాండ్‌ ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన విద్యార్థినులు సంచరించడంతో ప్రజలతో పాటు జిల్లా అధికారులు హడలెత్తిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇరాన్‌ దేశానికి చెందిన ఇద్దరు యువతులు పొట్టిశ్రీరాములు మార్కెట్‌లో నిత్యవసర సరుకులు కొనేందుకు వచ్చారు. దీంతో కొంతమంది వ్యాపారులు ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం సీఐ బి.లలితకుమారి హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆ యువతులను పిలిచి ఆరా తీశారు.


ఆ యువతులు ఇరాన్‌ దేశానికి చెందిన వారుగా సీఐ గుర్తించారు. అనంతరం ఆ విద్యార్థినులు సీఐతో మాట్లాడుతూ 2018 నుంచి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనే నివసిస్తున్నామని, గడిచిన రెండేళ్లుగా వెంకటేశ్వర కళాశాలలో బీపార్మసీ చదువుతున్నట్లు  తెలిపారు. తక్షణం సీఐ లలితకుమారి కళాశాల యాజమాన్యానికి ఫోన్‌ చేసి యువతుల వివరాల కోసం ఆరా తీశారు.  రెండేళ్లుగా వారిద్దరూ తమ కళాశాలలోనే చదువుతున్నట్టు కాలేజీ యాజమాన్యం అంగీకరించింది. అనంతరం యువతుల వద్ద ఉన్న బ్యాగులను పోలీసులు పరిశీలించారు.


అందులో  వెంకటేశ్వర కళాశాలలో చదువుతున్నట్లు ఐడీ కార్డులు లభించాయి. 2019 జనవరిలో ఈ యువతులిద్దరూ ఇరాన్‌కు వెళ్లి వచ్చారని పాస్‌పోర్టు ఆధారంగా సీఐ ధ్రువీకరించారు. జిల్లాలో 144 సెక్షన్‌ అమలవుతున్న సందర్భంగా విదేశీయులు నగరంలో సంచరించడం ప్రమాదకరమని సీఐ వారికి చెప్పి రెడ్‌క్రాస్‌ వాహనంపై కళాశాల వసతిగృహానికి తరలించారు.  

Updated Date - 2020-03-28T06:47:06+05:30 IST