కమిటీల.. ముసుగు!

ABN , First Publish Date - 2020-07-28T10:19:47+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘నాడు-నేడు..’ పథకంలో ..

కమిటీల.. ముసుగు!

నాడు-నేడు పనుల్లో అడ్డగోలు దోపిడీ

మౌలిక వసతుల మాటున మాయ

తెరవెనుక అధికార పార్టీ పెద్దల అండ

నిద్రావస్థలో విద్యా, ఇంజినీరింగ్‌ సిబ్బంది

కరోనా విధుల నెపంతో తనిఖీలకు డుమ్మా


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/ఇచ్ఛాపురం): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘నాడు-నేడు..’ పథకంలో అవినీతి చోటుచేసుకుంటోంది. పనుల నిర్వహణ పేరిట కొందరు అక్రమార్కులు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారులంతా ‘కొవిడ్‌-19’ విధుల్లో నిమగ్నమవగా.. ఇదే అదనుగా కొందరు చోటా నాయకులు కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. అధికార పార్టీలో పెద్దలకు కమీషన్లు ఇస్తూ.. అక్రమాలకు తెరతీస్తున్నారు.  తనిఖీలు చేయాల్సిన విద్యాశాఖ అధికారులు కరోనా సాకుతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో రూ.కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులు పక్కదారి పడుతున్నాయి. పాఠశాల కమిటీల పేరుతో గుట్టుగా అక్రమాలు సాగిపోతున్నాయి. 


ప్రభుత్వం ఉదాత్త ఆశయంతో పాఠశాలల్లో చేపడుతున్న ‘నాడు-నేడు.. మనబడి’ నిర్మాణ పనుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 3 నాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యం విధించింది. పాఠశాల కమిటీలు, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో సాగాల్సిన ఈ పనులను కొంతమంది అధికార పార్టీ నాయకులు తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి అక్రమాలకు పాల్పడుతున్నారు. కరోనా నివారణ చర్యల్లో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరించడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. పాఠశాల కమిటీల ముసుగేసుకుని.. పనుల నిర్వహణ పేరిట దోచుకుంటున్నారు. చెక్కులు బలవంతంగా రాయించుకుంటున్నారు.


రికార్డుల్లో మాత్రం అంతా పారదర్శకంగా కమిటీల పేరుతో పనులు జరుగుతున్నట్లు విద్యాశాఖ అధికారులు నమోదు చేస్తూ తమవంతు సహకారం అందిస్తున్నారు. జిల్లాకు చెందిన ఒక ముఖ్య నాయకుడు.. కమీషన్‌లకు ఆశపడి దిగువస్థాయి నాయకులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘నాడు-నేడు’ పనుల్లో అక్రమాలపై సంబంధింత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 


జిల్లాలో ‘నాడు-నేడు’ కింద  మంజూరైన పాఠశాలలు ఇవీ.. 

ఆమదాలవలస - 34, భామిని - 30, బూర్జ - 28, ఎచ్చెర్ల - 37, జి.సిగడాం -25, గార -28, హిరమండలం -21, ఇచ్ఛాపురం - 38, జలుమూరు -37, కంచిలి -33, కవిటి -28, కోటబొమ్మాళి -37, కొత్తూరు- 37, లావేరు- 31, ఎల్‌.ఎన్‌.పేట -16, మందస -45, మెళియాపుట్టి-36, నందిగాం-35, నరసన్నపేట-32, పాలకొండ-34, పలాస -23, పాతపట్నం -37, పోలాకి -32, పొందూరు -28, రేగిడి ఆమదాలవలస -42, రాజాం-25, రణస్థలం-35, సంతబొమ్మాళి -33, సంతకవిటి - 33), సారవకోట -31, సరుబుజ్జిలి -12, సీతంపేట -38, సోంపేట -28, శ్రీకాకుళం -52, టెక్కలి -28, వజ్రపుకొత్తూరు -39, వంగర -29, వీరఘట్టం -31 మండలాలలో నాడు నేడు పనులు చేపడుతున్నారు. 


ఇష్టారాజ్యంగా పనులు

జిల్లాలో చాలా పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా పనులు చేపడుతూ.. అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. కొన్నిచోట్ల పాఠశాలల కమిటీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయుల మధ్య సమన్వయం కొరవడుతోంది. దీంతో కాంట్రాక్టర్లు మెటిరీయల్‌ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడుతూ.. నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. చాలా పాఠశాలల్లో ప్రహరీలు బాగున్నా.. కూల్చేసి మళ్లీ నిర్మిస్తున్నారు. మరికొన్ని చోట్ల అవసరం ఉన్నా.. పనులు చేపట్టడం లేదు. నూతన తరగతి గదులు నిర్మించడం లేదు. పాతవాటికే మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు. ఉదాహరణకు ఇచ్ఛాపురంలోని బ్రాహ్మణవీధిలోని పాఠశాలలో బాగున్న ప్రహరీని కూల్చేశారు. మళ్లీ కొత్తగా నిర్మాణ పనులు చేపడుతున్నారు. బాలికోన్నత పాఠశాలలో కూడా ఇదే విధంగా పనులు చేస్తున్నారు. కొన్నిచోట్ల శ్లాబులు వేయాల్సి ఉన్నా.. లప్పం అతికించి వదిలేస్తున్నారు. మరోవైపు విద్యుత్‌ సామగ్రి కొనుగోళ్లలో కూడా అక్రమాలకు పాల్పడుతూ.. బిల్లులు అధికంగా చూపుతున్నారు. తక్కువ మంది కూలీలు, మేస్ర్తీలతో పనులు చేయించి.. రికార్డుల్లో ఎక్కువ మందిగా పేర్లు నమోదు చేసి దోచుకుంటున్నారు.  


ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ఊసే లేదు...

సాధారణంగా ప్రభుత్వ ఇంజినీరింగ్‌ శాఖల్లో ఏదైనా నిర్మాణ పనులు చేపట్టాల్సి వస్తే, స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రకారం అంచనాలు రూపొందించాలి. కానీ జిల్లాలో ‘నాడు-నేడు’ పథకం కింద తొలిదశ 1218 పాఠశాలల్లో రూ.162 కోట్ల అంచనాలతో ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే సుమారు రూ.12 కోట్లతో చేపట్టిన తొలిదశ పనుల్లో ఎస్‌ఎస్‌ఆర్‌ను ఎక్కడా అమలు చేయడం లేదు. స్థానిక ఇంజినీర్లు, నాయకులు నిర్దేశించిన అంచనాలతో పనులు చేపడుతున్నారు. వాస్తవానికి నాడు-నేడు పనుల్లో భాగంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కింద, ప్రహరీలు, మరగుదొడ్ల నిర్మాణాలు, నీటి వసతి, శిథిలావస్థకు చేరిన భవనాలకు మరమ్మతులు చేపడుతున్నారు. నిర్మాణ పనులలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామని చెప్పుకొచ్చిన నేతలు పాఠశాల విద్యాకమిటీలు, ప్రధానోపాధ్యాయులకు చెక్‌ పవర్‌ ఇచ్చి పనులు చేస్తున్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. కమిటీల పేరుతో కొందరు చోటా నాయకులు బినామీలుగా అవతారమెత్తి పనులు చేపడుతున్నారు.


ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రకారం అంచనాలు రూపొందించకుండా నాయకుల సిఫారసులకే అధిక ప్రాధాన్యం ఇచ్చి పనులు చేస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఒక ముఖ్య నేత అనుచరులు పెద్ద సంఖ్యలో పనులు కానిచ్చేస్తున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఒక గ్రానైట్‌ సంస్థకు.. మరమ్మతు పనుల కోసం గ్రానైట్‌, మార్బుల్స్‌ పంపిణీ బాధ్యతలు అప్పగించారు. తెరవెనుక ముఖ్య నేత అండ ఉండడంతో జిల్లాలో మెజార్టీ పాఠశాలకు మార్బుల్స్‌, టైల్స్‌ సరఫరా టెండర్లను ఆయనే దక్కించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ నిర్ణయించిన ధర ప్రకారం నాడు-నేడు పనుల్లో చదరపు గజం మార్బుల్‌కు రూ.60 మించి చెల్లించే అవకాశం లేదు. కానీ నేత మేత కోసం చదరపు గజానికి అదనంగా రూ.5 వంతున గ్రానైట్స్‌ సంస్థ అధినేతకు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన ఒక్క ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోనే సుమారు రూ.30 లక్షలకు పైగా కమీషన్‌ ఆ నేతకు చేరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి ఇప్పటికే గ్రానైట్స్‌ సరఫరా సంస్థకు రూ.2కోట్ల వరకు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు బోగట్టా.  ఇదే విధంగా జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో స్థానిక అధికార పార్టీ నేతల సిఫారసులతో చోటా నాయకులు పనులు చేజిక్కించుకొని అదనంగా బిల్లులు కాజేస్తున్నారు. కోటబొమ్మాళి, టెక్కలి ప్రాంతాల్లో కూడా గ్రానైట్‌ కంపెనీలు ఉన్నాయి. ఆ ప్రాంతానికి కూడా నేత చెప్పిన సంస్థకే సరఫరా బాధ్యతలు అప్పగించడం గమనార్హం. కొన్నిచోట్ల అవసరం ఉన్నా, లేకపోయినా నేతల సిఫారసుల మేరకు పనులను సృష్టిస్తున్నారు. ఆమదాలవలస మండలంలో మహాత్మాగాంధీ కస్తూర్బా పాఠశాలలో మరుగుదొడ్లు బాగానే ఉన్నా, ఒకరికి పని కల్పించి, సొమ్ము చేసేందుకు వీలుగా మరమ్మతులు చేపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.


అడ్వాన్సుల రూపంలో డీడీలు తీసుకుంటున్నట్లు తెలిసింది. అంచనా వ్యయం మీద కనీసం 20 శాతం అదనంగా ఇంజినీర్లతో మెజర్‌మెంట్‌ పుస్తకాల్లో నమోదు చేయించుకొని జేబుల్లో వేసుకోవడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఒకవైపు కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండడంతో పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అయోమయం నెలకొంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ అక్రమార్కులు నాడు-నేడు పనుల్లో కాసుల వేటలో పడడం విమర్శలకు తావిస్తోంది. 


పర్యవేక్షణ కరువు

కరోనా నివారణలో అధికారులంతా నిమగ్నమయ్యారు. దీంతో జిల్లాలో ‘నాడు-నేడు’ పనుల పర్యవేక్షణ చూడాల్సిన విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు.  కరోనా విస్తరిస్తున్న తరుణంలో పనులు చేయడమే గొప్ప విషయమంటూ విద్యాశాఖ అధికారులు సాకులు చెబుతుండడం గమనార్హం. ఈ పనుల్లో అడ్డగోలు వ్యవహారాలపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కమిటీలు, స్థానిక నాయకులు ఏకమవడంతో తనిఖీ అధికారులు కూడా నోరు మెదపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే.. పెద్దఎత్తున నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉంది.  

Updated Date - 2020-07-28T10:19:47+05:30 IST