పెరుగుతున్న ‘పంచ్‌’యతీలు

ABN , First Publish Date - 2020-02-08T10:16:01+05:30 IST

జిల్లాలో పంచాయతీల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో ఐదు పంచాయతీలను పెంచుతూ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ

పెరుగుతున్న ‘పంచ్‌’యతీలు

కొత్తగా ఇంకో ఐదు పంచాయతీలు ఏర్పాటు


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పంచాయతీల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో ఐదు పంచాయతీలను పెంచుతూ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఉత్తర్వులను జారీచేశారు. ఇప్పటివరకు 1155 పంచాయతీలుండగా.. గురువారం కొత్తగా ఏడు పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం యు.వెంకంపేట, ఎం.వెంకటాపురం, కౌసల్యాపురం, కొమరవానిపేట, గురండి గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో జిల్లాలో మొత్తం పంచాయతీల సంఖ్య 1,169కు చేరుకుంది. ఇంకా మరికొన్ని పంచాయతీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 


కొత్త పంచాయతీలు ఇలా..

వీరఘట్టం మండలం చిదిమి పంచాయతీలో చిదిమి, యు.వెంకంపేట, సీతారామరాజుపేట గ్రామాలు ఉండేవి. ఇందులో యు.వెంకంపేట, సీతారామరాజుపేటను కలిపి 1021 మంది జనాభాతో యు.వెంకంపేటను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఇదే మండలం బిటివాడ పంచాయతీలో బిటివాడ, ఎం.వెంకటాపురం గ్రామాలుండేవి. ఇందులో 1,175 మంది జనాభాతో ఎం.వెంకటాపురం గ్రామాన్ని వేరు చేసి కొత్త పంచాయతీగా నెలకొల్పారు. 

కొత్తూరు మండలం బలద పంచాయతీలో బలద, కౌసల్యాపురం గ్రామాలు ఉండేవి. ఇందులో కౌసల్యాపురం గ్రామాన్ని వేరుచేసి 960 మంది జనాభాతో కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు.  

గార మండలం కొర్లాం పంచాయతీలో కొర్లాం, కొమరవానిపేట, కుమ్మరిపేట, సీపానపేట గ్రామాలున్నాయి. ఇందులో నుంచి 1,089 మంది జనాభాతో కొమరవానిపేట గ్రామాన్ని వేరుచేసి కొత్తపంచాయతీగా నెలకొల్పారు. 

భామిని మండలం నేరడి పంచాయతీలో నేరడి, గురండి, లొహరిజోల గ్రామాలుండేవి. ఇందులో నుంచి గురండి, లొహరిజోల గ్రామాలను వేరుచేసి 1,747 మంది జనాభాతో గురండి పంచాయతీని ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-02-08T10:16:01+05:30 IST