జిల్లాలో పెరిగిన క్రైం రేటు

ABN , First Publish Date - 2020-12-30T06:05:23+05:30 IST

జిల్లాలో నేరాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 12 శాతం పెరిగినట్టు ఎస్పీ అమిత్‌బర్దర్‌ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జిల్లాలో నమోదైన కేసులు... సాధించిన పురోగతి... నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమగ్రంగా వివరించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా వివిధ నేరాలకు సంబంధించి 9,020 కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో పెరిగిన క్రైం రేటు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌



గత ఏడాదితో పోలిస్తే 12 శాతం హెచ్చు

నేర నివేదికను వెల్లడించిన ఎస్పీ అమిత్‌ బర్దర్‌

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, డిసెంబరు 29 : జిల్లాలో నేరాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 12 శాతం పెరిగినట్టు ఎస్పీ అమిత్‌బర్దర్‌ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు.  ఈ ఏడాది జిల్లాలో నమోదైన కేసులు... సాధించిన పురోగతి... నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమగ్రంగా వివరించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా వివిధ నేరాలకు సంబంధించి 9,020 కేసులు నమోదయ్యాయి. ఇందులో రాత్రి చోరీలు 92, పగటి చోరీలు 16, సాధారణ దొంగతనాలు 106, హత్యలు 23, నేరపూరిత నరహత్యలు 12, అల్లర్లు 20, కిడ్నాపులు 15 ఉన్నాయి. అత్యాచారాలు 57,  గ్రీవెన్‌ హర్ట్‌ 77, సింపుల్‌హర్ట్‌ 854, మోసాలు 129, ట్రస్టుల్లో క్రిమినల్‌ ఉల్లంఘన 2, నకిలీ కరెన్సీ 3, హత్యా ప్రయత్నాలు 26, ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు 252, సాధారణ రోడ్డు ప్రమాదాలు 536, ఇతర ఐపీసీ ఘటనలు 3,293, ప్రత్యేక, స్థానిక చట్టాలకు సంబంధించి 1,494, సీఆర్పీసీ కేసులు 1,702, మిస్సింగ్‌ కేసులు 289, అగ్ని ప్రమాదాలు 22 సంభవించాయి. 2018లో 6,625 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన 36 శాతం అంటే.... 2,392 కేసులు అదనంగా పెరిగాయి. 12 శాతం కేసులు పెరిగాయని నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. 2019లో 19 అత్యాచార కేసులు, బాలలపై అత్యాచార కేసులు 33 నమోదయ్యాయి. ఈ ఏడాది 15 అత్యాచార కేసులు, బాలికలపై అత్యాచార కేసులు 42 నమోదయ్యాయి. నివేదిక ప్రకారం మహిళలపై అత్యాచారాలు తగ్గుముఖం పట్టగా.. చిన్నారులపై నేరాలు పెరిగాయి. పిల్లలపై నేరాల్లో 2019తో పోలిస్తే 8.47 శాతం పెరిగాయి. ఈ ఏడాదిలో జిల్లావ్యాప్తంగా దొంగతనం ఘటనల్లో రూ.2 కోట్ల 83 లక్షల 95 వేల 579 విలువగల సొత్తు చోరీకి గురైంది. ఇప్పటి వరకు రూ. 1కోటి 52లక్షల 99వేల 39లను రికవరీ చేశారు.  చోరీ కేసుల్లో 47 శాతం నేరస్థులను పట్టుకోగా.. 54 శాతం రికవరీ చేయగలిగారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 277 మంది దుర్మరణం పాలయ్యారు. 979 మంది గాయపడ్డారు. గత ఏడాదితో పోల్చితే 118 ప్రమాదాలు తగ్గాయి. అయితే మృతుల సంఖ్య 13కి పెరిగింది. మోటారు వాహన చట్టం నిబంధనలు అతిక్రమించినందుకుగాను 1,35,242 మందిపై కేసులు నమోదుచేసి వారి నుంచి రూ. 5,00,48,350  అపరాధ రుసుంగా వసూలు చేశారు. ఈ ఏడాదిలో గంజాయి రవాణా, విక్రయాలకు సంబంధించి 24 కేసులు నమోదయ్యాయి. 84 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 5,318 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విక్రయాలకు సంబంధించి 377 కేసులు నమోదు చేసి.. 672 మందిని అరెస్ట్‌ చేశారు. మద్యం రవాణా, విక్రయాలకు సంబంధించి 1,265 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,945 మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 17,735 బాటిళ్ల మద్యం... 12,312 లీటర్ల సారాను పట్టుకున్నారు. 305 బైక్‌లు, 22 ఆటోలు, 35 కార్లు, 17 వ్యాన్‌లు, ట్రక్కు 1, ఐదు లారీలను స్వాధీనం చేసుకున్నారు.


ఈ-బీట్‌కు గుర్తింపు

జిల్లా పోలీసులు స్వయంగా రూపొందించిన ఈ-బీట్‌ సిస్టమ్‌ యాప్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇందుకుగాను ఈ-గవర్నెన్స్‌ నౌ ఇండియా వర్చ్యువల్‌ సమ్మిట్‌-2020 అవార్డును జిల్లా పోలీసు శాఖ అందుకుంది. శాంతిభద్రతలు అదుపులో ఉంచేందుకు... ట్రాఫిక్‌ విభాగాన్ని చక్కదిద్దేందుకు విజిబుల్‌ పోలీసింగ్‌ అమలు చేస్తున్నాం. 611 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మహిళా మిత్ర, సైబర్‌ మిత్ర, ఆపరేషన్‌ ముస్కాన్‌, సేఫ్‌ స్ట్రీట్స్‌, గ్రామాల దత్తత కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం.

- ఎస్పీ అమిత్‌బర్దర్‌





Updated Date - 2020-12-30T06:05:23+05:30 IST