ఆశలు.. ‘రివర్స్’!
ABN , First Publish Date - 2020-11-27T05:11:05+05:30 IST
నివర్ తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గురువారం మోస్తరుగా వర్షం కురిసింది. శ్రీకాకుళంతో పాటు ఆమదాలవలస, ఎచ్చెర్ల, రణస్థలం, పోలాకి, నరసన్నపేట, సోంపేట, ఇచ్ఛాపురం, పలాస, గార, హిరమండలం, పాలకొండ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో పొలాల్లో నీరు చేరింది. ఈనెల ఆరంభంలో అల్పపీడన ప్రభావంతో వర్షం కురవగా.. వారం రోజులకుపైగా వరి పంట నీటిలోనే నానిపోయింది. తాజాగా కురిసిన వర్షాలతో వరికుప్పలు తడిచిపోయాయి. ఈ నేపథ్యంలో పంట నష్టం వాటిల్లనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తుఫాన్ ప్రభావంతో ఏకధాటిగా చిరుజల్లులు
పొలాల్లో చేరిన నీరు
తడిచిన వరికుప్పలు
ఆందోళనలో రైతులు
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)
నివర్ తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గురువారం మోస్తరుగా వర్షం కురిసింది. శ్రీకాకుళంతో పాటు ఆమదాలవలస, ఎచ్చెర్ల, రణస్థలం, పోలాకి, నరసన్నపేట, సోంపేట, ఇచ్ఛాపురం, పలాస, గార, హిరమండలం, పాలకొండ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో పొలాల్లో నీరు చేరింది. ఈనెల ఆరంభంలో అల్పపీడన ప్రభావంతో వర్షం కురవగా.. వారం రోజులకుపైగా వరి పంట నీటిలోనే నానిపోయింది. తాజాగా కురిసిన వర్షాలతో వరికుప్పలు తడిచిపోయాయి. ఈ నేపథ్యంలో పంట నష్టం వాటిల్లనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ పంటపై తాము పెట్టుకున్న ఆశలన్నీ నివర్ తుఫాన్ కారణంగా అడియాశలయ్యాయని వాపోతున్నారు. తుఫాన్ ప్రభావం జిల్లాపై ఉండదనే ఉద్దేశంతో అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీచేయలేదు. అయినప్పటికీ మూడురోజులుగా వాతావరణంలో మబ్బులు కమ్ముకోవడంతో కొంతమంది రైతులు వరికుప్పలను భద్రపరిచారు. కొన్నిచోట్ల కూలీల కొరత కారణంగా కోతలు పూర్తికాలేదు. యంత్రాల ద్వారా నూర్పులు చేపట్టి.. ధాన్యం కుప్పలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వరికుప్పలను భద్రపరిచేందుకు కూడా కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడ్డారు.
జిల్లాకేంద్రంలో అవస్థలు...
జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ప్రజలు అవస్థలకు గురయ్యారు. ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ పనుల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి శ్రీకాకుళానికి వేలాదిమంది నిత్యం వస్తుంటారు. ఈ క్రమంలో గురువారం కురిసిన వర్షంతో వారంతా అవస్థలు పడ్డారు. తుఫాన్‌పై జిల్లా అధికార యంత్రాంగం ఎటువంటి ప్రకటన చేయలేదు. మత్స్యకారులకు చేపల వేటకు వెళ్లొద్దని కూడా ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. దీంతో చాలామంది యథావిధిగా రాకపోకలు సాగించగా.. వర్షంతో ఇబ్బందులు పడ్డారు. శ్రీకాకుళంలో రోడ్లపై, కాంప్లెక్స్ ప్రాంతాల్లో స్వల్పంగా నీరు చేరడంతో ప్రజలు అసౌకార్యానికి గురయ్యారు. ఉష్ణోగ్రత కనిష్ఠంగా 20 డిగ్రీలకు పడిపోయాయి. చలి తీవ్రతతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.