-
-
Home » Andhra Pradesh » Srikakulam » Hill is the top of the phone
-
హిల్‘టాప్’ మాయ!
ABN , First Publish Date - 2020-06-23T10:00:42+05:30 IST
సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో కొందరు ఇంజినీర్ల అక్రమాలు హద్దు మీరుతున్నాయి. పర్యాటక అభివృద్ధి పనుల పేరిట ..

పర్యాటక ముసుగు.. అక్రమాల లొసుగు!
‘ఉపాధి’ నిధులు హాంఫట్
యంత్రాలతో పనులు
అడ్డగోలుగా అడ్వాన్సుల చెల్లింపు
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో కొందరు ఇంజినీర్ల అక్రమాలు హద్దు మీరుతున్నాయి. పర్యాటక అభివృద్ధి పనుల పేరిట కొండలను పిండిచేసి అందినంత దోచేశారు. పర్యాటక శాఖ నుంచి నిధులు విడుదల కాకుండానే అడ్డగోలుగా రోడ్డు నిర్మాణం పేరిట ఉపాధి నిధులు ఖర్చు చేసేశారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలతో చేపట్టాల్సిన పనులను యంత్రాలతో పూర్తిచేసి.. రూ.లక్షలాది రూపాయలు పక్కదారి పట్టించారు.
పర్యాటకాభివృద్ధి ముసుగులో కొంతమంది ఇంజినీర్లు అవినీతికి పాల్పడుతున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని శంభాం పంచాయతీ ఆడలి హిల్‌టాప్ రిసార్ట్స్ అభివృద్ధి చేయాలని గత పీవో సాయికాంత్ వర్మ ప్రతిపాదించారు. సుమారు రూ.కోటి వ్యయంతో ఈ కొండ శిఖరంపై పర్యాటకుల కోసం విడిది గదులు నిర్మించ తలపెట్టారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ప్రతిపాదన మరుగున పడింది. ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్లు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా పర్యాటక శాఖకు సంబంధించిన ‘ఆడలి రిసార్ట్స్’ నిర్మాణ పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పర్యాటక శాఖ నిధులు వచ్చేస్తాయంటూ పీవోకు తప్పుడు నివేదికలు సమర్పించారు.
పథకం ప్రకారం.. రాయిమానుగూడ ప్రధాన రహదారి నుంచి శంభాం గ్రామం మీదుగా ఆడలి కొండపైకి కొత్తగా రోడ్డు ఫార్మేషన్ పనులకు ప్రతిపాదించారు. రూ.కోటి వ్యయంతో కొండపైకి రహదారి వేసేందుకు అంచనాలు రూపొందించారు. నిబంధనలు ఉల్లంఘించి కూలీలతో కాకుండా యంత్రాలతో పనులు చేపట్టారు. సుమారు 600 మీటర్ల పొడవైన మట్టి రోడ్డు పనుల పేరుతో పచ్చని కొండలను పిండి చేశారు. సిమెంట్, ఇతరత్రా నిర్మాణ పనులకు ముందుగా అనుమతి పొందిన తరువాత కన్వర్జెన్సీ కింద నిర్మాణాలు చేపట్టాలి. కానీ గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్లు దీనికి భిన్నంగా వ్యవహరించారు. ఉపాధిహామీ నిధులు దారి మళ్లించి.. అడ్డగోలుగా రోడ్డు ఫార్మేషన్ పనులు పూర్తిచేశారు.
అడ్వాన్సుల దందా....
ఉపాధి హామీ పనులు చేపడితే నిబంధనల ప్రకారం.. కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్‌లు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, ఆడలి రోడ్డు ఫార్మేషన్ పనులకు మాత్రం సుమారు రూ.36.50 లక్షలు అడ్వాన్సులు చెల్లించారు. ‘ఉపాధి’ పనులు స్థానిక కూలీలతో చేపట్టాల్సి ఉండగా, పొక్లెయినర్లు వినియోగించారు. బండరాళ్లను బాంబులతో పేల్చారు. సుమారు 600 మీటర్ల రోడ్డు ఫార్మేషన్ మట్టి పనులతో పాటు వంద మీటర్ల పొడవున స్టోన్ ప్యాకింగ్ పనులు చేపట్టారు. ఆడలి గ్రామంలో సుమారు 15 గిరిజన కుటుంబాలకు రహదారి పనుల్లో భాగస్వామ్యం కల్పించాలి. ఈ మేరకు అప్పటి పీవో సాయికాంత్ వర్మ హామీ ఇచ్చినా.. అమలుకు నోచుకోలేదు.
రిటైర్డ్ ఇంజినీరు... అంతా తానై..
ఆడలి రోడ్డు పనుల పర్యవేక్షణ బాధ్యతను గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్లు కాకుండా.. ఒక రిటైర్డ్ ఇంజినీర్‌కి అప్పగించారు. పనుల పర్యవేక్షణను డీఈఈ స్థాయి అధికారి చూసిన తరువాతే బిల్లులు చెల్లించాలి. కానీ రిటైర్డ్ ఇంజినీర్ అన్నీ తానై వ్యవహరించినట్లు తెలిసింది. లాక్‌డౌన్‌కు ముందే పదవీ విరమణ పొందిన ఆయన.. ఫార్మేషన్ పనుల కాంట్రాక్టు పొందినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్మాణ పనులు కాంట్రాక్టరు చేసినా, గ్రామస్థులు చేసినా ఇంజినీర్లు పనులను పరిశీలించిన తరువాత బిల్లుల చెల్లింపులకు మెజర్‌మెంట్ బుక్‌లో నమోదు చేయాలి. కానీ రిటైర్ట్ ఇంజినీరే.. ఐటీడీఏ డేటా ఎంట్రీ సెంటర్‌లో కూర్చొని ఎం-బుక్‌లో నమోదు చేసుకొని రూ. లక్షల్లో బిల్లులు దక్కించుకున్నట్లు తెలిసింది.
పర్యాటక ప్రాజెక్టులు లేకుండానే....
సీతంపేట ఐటీడీఏ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో పర్యాటకాభివృద్ధి కోసం ప్రతిపాదన చేశారు. అప్పట్లో జగతి కొండ, ఆడలి రిసార్ట్స్ నిర్మాణాలకు వేర్వేరుగా పర్యాటక శాఖకు ఐటీడీఏ పీవో లోతేటి శివశంకర్ ఆధ్వర్యంలో రూ.2కోట్ల అంచనాలతో డీపీఆర్ సిద్ధం చేసి పంపారు. జగతిపల్లి రిసార్ట్స్ పనులకు రూ.కోటి మంజూరవడంతో అప్పట్లో పనులు చేపట్టారు. ఈ నిర్మాణాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు రావడంతో పనులు నిలిపేశారు. ఇక ఆడలి కొండపై రిసార్ట్స్ నిర్మాణాల కోసం చేసిన ప్రతిపాదనకు పర్యాటక శాఖలో ఎటువంటి కదలిక లేదు.
కానీ ఐటీడీఏ అధికారులకు తప్పుడు నివేదికలు సమర్పించి, ఇంజినీర్లు ఆడలి రిసార్ట్స్‌కు నిధులు విడుదల కాకుండానే, ముందుగా లక్షల వ్యయంతో రోడ్డు ఫార్మేషన్ పనులు పూర్తి చేయడం వెనుక పెద్ద కథ నడిచిందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. కొందరికి పనులు కల్పించి, నిధులు కాజేయడానికే ఆడలి ఫార్మేషన్ పనులు చేపట్టారని కొందరు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాలి.
నిధులు లేక నిలిపేశాం...జామి శాంతేశ్వరరావు, ఈఈ, గిరిజన సంక్షేమ శాఖ, సీతంపేట
ఉపాధి హామీ నిధులు విడుదలైన మేరకు ఖర్చు చేశాం. ఆడలి రిసార్ట్ పనులకు నిధులు విడుదల కాలేదు. పనుల పర్యవేక్షణ రిటైర్డ్ ఇంజినీరు చూశారని అనడం సరికాదు. నేనే స్వయంగా పరిశీలించి బిల్లులు మంజూరు చేశాను. నిధులు విడుదల కాగానే పర్యాటక శాఖ రిసార్ట్స్ నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంది.