‘చిత్రం’గా దోపిడీ
ABN , First Publish Date - 2020-02-08T10:05:19+05:30 IST
శ్రీకాకుళం నగరంలోని శ్రీకాంత్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఇటీవల విడుదలైన కొత్త సినిమా చూసేందుకు ఓ థియేటర్‌కు వెళ్లారు.

సినిమాకు వెళితే బాదుడే!
కొత్త సినిమాలకు అధిక ధరలు
ప్రభుత్వ ఉత్తర్వుల పేరుతో మాయాజాలం
థియేటర్ యాజమాన్యాల ఇష్టారాజ్యం
వాహనాల పార్కింగ్ ఉచితం.. అయినా అడ్డగోలుగా వసూళ్లు
హైకోర్టు ఆగ్రహించినా మారని తీరు
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)
శ్రీకాకుళం నగరంలోని శ్రీకాంత్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఇటీవల విడుదలైన కొత్త సినిమా చూసేందుకు ఓ థియేటర్‌కు వెళ్లారు. అక్కడ సాధారణ ధరల కంటే దాదాపు రూ.150 అధికంగా టిక్కెట్లు అమ్ముతున్నారు. ఇక తినుబండారాలు... కూల్‌డ్రింక్స్ ధరలైతే బయటి షాపుల కంటే రెండు రెట్లు అధికంగా ఉన్నాయి. పార్కింగ్ ఫీజు దీనికి అదనం. పైగా వాహనం ఎండలోనే నిలపాల్సిన దుస్థితి. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్టు ఎటువంటి రశీదు ఇవ్వలేదు. దీనిపై ప్రశ్నిస్తే సిబ్బంది మూకుమ్మడిగా దాడికి సిద్ధపడ్డారు. ఇది ఒక్క శ్రీకాంత్ పరిస్థితే కాదు. నిత్యం ఎంతో మంది ప్రేక్షకులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఓ సినిమా చూడాలంటే ఒక కుటుంబం సగటున రూ.వెయ్యి వంతున వదిలించుకోవాల్సి వస్తోంది. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నుంచీ చిట్టచివరనున్న కవిటి మండల కేంద్రం వరకూ ఇదే తీరు. అధిక శాతం థియేటర్లలో టిక్కెట్ ధరల పట్టికలే కనిపించకపోవడం గమనార్హం.
వినోదం కోసం సినిమాకు వెళ్తున్న ప్రేక్షకులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. కొత్త సినిమా వస్తే సామాన్యుడు థియేటర్‌లో అడుగు పెట్టలేని పరిస్థితి. టిక్కెట్ రేటు చూసి భయపడాల్సిన దుస్థితి. అదీ ఒకటీ రెండు రోజులు కాదు దాదాపు నాలుగు వారాలపాటు అధిక ధరలే. ‘ప్రభుత్వ ఉత్తర్వులు’ అనే సాకుతో యాజమాన్యాలు దోపిడీకి తెర తీస్తున్నాయి. ఆ ఉత్తర్వుల్లో ఎన్ని రోజుల వరకూ ధరలు పెంచుకోవచ్చనే విషయం ప్రస్తావించారనే ప్రశ్నకు సమాధానం ఉండదు. సీజన్‌తో సంబంధం లేకుండా కొత్త సినిమా వస్తే ధరల బాదుడే. ప్రేక్షకుడి బలహీనత వీరికి బలంగా మారుతోంది. దీనికితోడు పార్కింగ్ దోపిడీ అదనం. రెండున్నర గంటల పాటు వాహనాలు థియేటర్ ఆవరణలో పార్క్ చేసేందుకు సగటున రూ.20 వంతున వసూలు చేస్తున్నారు.
అలాగని ఎక్కడా పార్కింగ్ షెడ్డులు కనిపించవు. ప్రేక్షకుల వాహనాలు ఆరుబయట ఉంచాల్సిందే. ఎవరైనా దీనిపై ప్రశ్నిస్తే మూకుమ్మడిగా సిబ్బంది దాడి చేస్తారు. అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. థియేటర్లలో కొత్త సినిమా టిక్కెట్లను కొన్నిరోజుల పాటు అధిక ధరలకు విక్రయించుకోవచ్చని గతంలో కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే వారికి వరంగా మారింది. కోర్టు ఇచ్చిన పరిమితికి మించి థియేటర్ యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ పెంపుదల కూడా పెద్ద పట్టణాలకు, మున్సిపాలిటీలకే పరిమితం. కానీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న కవిటి, మందస, రణస్థలం, లాంటి చోట్ల కూడా ప్రేక్షకులను నిలువుగా దోచుకుంటున్నారు. కొన్ని థియేటర్లలో కింది తరగతుల టిక్కెట్లు విక్రయించరు.
అడుగడుగునా...
టిక్కెట్ల రూపంలోనే కాదు.. తినుబండారాల విక్రయాలు, వాహనాల పార్కింగ్ పేరిట ప్రేక్షకుల జేబులను థియేటర్ యాజమాన్యాలు ఖాళీ చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం 47 సినిమాహాళ్లు ఉన్నాయి. ఈ థియేటర్ల యాజమన్యాలకు టిక్కెట్ల విక్రయాలతో సమానంగా ఇతర మార్గాల ద్వారా ఆదాయం లభిస్తోంది. చిన్న చిన్న చిరుతిళ్ల వస్తువులను అఽధిక ధరలకు విక్రయించేస్తున్నారు. వాహనాల పార్కింగ్ పేరిట కూడా అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లపై అధికశాతం మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటారు. ఈ వాహనాల పార్కింగ్‌కు యాజమాన్యాలు ప్రత్యేక సౌకర్యం కల్పించాలి. కానీ నిర్వాహకులు సౌకర్యాలను విస్మరిసున్నారు. సైకిల్‌కు రూ.10, ద్విచక్ర వాహనానికి రూ.20, కారుకు రూ.50 చొప్పున గుంజుతున్నారు. వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయించినా, షెడ్డు కూడా ఉండదు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉండాల్సిందే.
తనిఖీలు ఏవీ?
నిబంధనల ప్రకారం వారానికి ఒకసారైనా థియేటర్లను తహసీల్దార్లు తనిఖీ చేయాలి. కానీ, జిల్లాలో ఎక్కడా ఈ పరిస్థితి లేదు. రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆర్డీవోలు కూడా తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. పెద్ద సినిమాలు విడుదలైన రెండు వారాలు మాత్రమే అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించేందుకు కోర్టు నుంచి పరిమితి లభిస్తుంది. అందులోనూ తరగతిల వారీగా టిక్కెట్ల ధరలు ఉంటాయి. కానీ, సినిమా విడుదలైన రెండు వారాలూ.. అన్ని టిక్కెట్లకు ఒకే ధర నిర్ణయించి విక్రయాలు సాగిపోతున్నాయి. సగటు ప్రేక్షకుల జేబులకు చిల్లు పెడుతున్నాయి.
అక్రమ పార్కింగ్ ఫీజులపై హైకోర్టు కన్నెర్ర...
షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై హైకోర్టు స్పందించింది. ముందడుగు ప్రజాపార్టీ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, రాజమహేంద్రవరంలో పార్కింగ్ ఫీజు పేరిట కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు... ఉన్నతాధికారులు కూడా కనీస చర్యలు తీసుకోవడం లేదంటూ వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై ఇటీవలే విచారణ జరిగింది. అసలు పార్కింగ్ ఫీజుల వసూలు అక్రమమని తేలితే.. తక్షణమే సినిమా థియేటర్ల యాజమాన్యాల నుంచే వసూలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో అంతటా విచారణ జరగనుంది. సినిమాహాళ్లలో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యానిదే. కానీ అదనంగా వసూలు చేయడంపై ఎప్పటి నుంచో విమర్శలున్నాయి. అధికారులు ఉదాసీనతే ఇందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పార్కింగ్ ఫీజులను వసూలు చేయకుండా థియేటర్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.
నోటీసులు ఇచ్చాం : శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్
సంక్రాంతి సందర్భంగా టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు వారం రోజుల వరకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే చాలాచోట్ల ఎనిమిది రోజులు, పది రోజుల వరకు ధరలను పెంచి విక్రయించినట్లు మాకు సమాచారం అందింది. అందుకే అన్ని థియేటర్లకు నోటీసులు ఇచ్చాం. టిక్కెట్ల ధరలు, విక్రయాలతోపాటు.. పార్కింగ్‌కు వసూలు చేస్తున్న మొత్తం వివరాలను అడిగాం. ఇప్పటికి పాలకొండ నుంచి మాత్రమే వివరాలు వచ్చాయి. అలాగే థియేటర్లలో ఆహార విక్రయాలపైనా ఆకస్మికంగా తనిఖీలు చేయాలని.. ఆహార కల్తీ నియంత్రణ అధికారులను ఆదేశించాం. పార్కింగ్ ఫీజు వసూళ్లపై చర్యలు తీసుకుంటాం.