అన్ని పార్టీల్లోనూ రెబల్స్‌

ABN , First Publish Date - 2020-03-12T10:06:11+05:30 IST

‘స్థానిక’ సమరంలో తొలి ఘట్టం ముగిసింది. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ నామినేషన్లు పూర్తయ్యాయి

అన్ని పార్టీల్లోనూ రెబల్స్‌

అభ్యర్థులతో కిక్కిరిసిన జడ్పీ కార్యాలయం..

మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి

సాయంత్రం వరకూ కొనసాగిన ప్రక్రియ

38 జడ్పీటీసీ స్థానాలకు 275..

668 ఎంపీటీసీ స్థానాలకు 2 వేలకుపైగా నామినేషన్లు

అధికార పార్టీలో అధికం


కోలాహలం!

‘స్థానిక’ సమరంలో తొలి ఘట్టం ముగిసింది. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ నామినేషన్లు పూర్తయ్యాయి.  అంతటా  కోలాహలం. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాల వరకూ ప్రతిచోటా సందడే.  నామినేషన్లు వేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటెత్తారు. పార్టీల జెండాలు చేతపట్టి.. నినాదాలు చేసుకుంటూ బైక్‌లు, ఆటోలు.. ఇతర వాహనాల్లో నాయకులు.. కార్యకర్తలతో రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలకు చేరుకున్నారు. కొందరు ఊరేగింపుగా...మరికొందరు ఎటువంటి హడావుడి లేకుండా నామినేషన్ల దాఖలుకు వెళ్లారు. ప్రాదేశికాల నామినేషన్లకు బుధవారం చివరిరోజు కావడం...ఎక్కువ మంది ఇదే రోజు ముహూర్తం పెట్టుకోవడంతో అంతా ఒకేసారి ఇటు మండల కార్యాలయాలకు...అటు జిల్లా పరిషత్‌ వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. 


ఉదయం పదిన్నర గంటల నుంచి పొద్దుపోయే వరకూ అభ్యర్థులు..అనుచర గణంతో మండల కార్యాలయాలు.. జడ్పీ కార్యాలయ ప్రాంగణం జాతరను తలపించాయి. పార్టీలు ఎంపిక చేసిన వారితో పాటు కొన్నిచోట్ల రెబల్స్‌ కూడా నామినేషన్లు దాఖలు చేశారు.  


శ్రీకాకుళం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): 

ప్రాదేశిక పోరులో కీలక ఘట్టం ముగిసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల పర్వం బుధవారం సాయంత్రంతో ముగిసింది. తొలి రెండు రోజులు మందకొడిగా నామినేషన్‌లు అందగా.. చివరి రోజున భారీగా దాఖలయ్యాయి. జడ్పీ ప్రాంగణం అభ్యర్థులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉరుకులు, పరుగులతో వచ్చి రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలను సమర్పించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 38 జడ్పీటీసీ స్థానాలు ఉండగా బుధవారం నాటికి 275 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో 38 మండలాల్లో 668 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.


మండల కేంద్రాల్లో ...

ఎంపీటీసీ స్థానాలకు మండల పరిషత్‌ కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులతో పాటు కొందరు పార్టీల నుంచి బీ ఫారాలు లేనివారు, బీఫారాలు పొందిన వారు కూడా కొన్ని పార్టీల అభ్యర్థులుగా నామినేషన్‌లు వేశారు. అధికార వైసీపీ తరుఫున ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో ప్రాదేశికం నుంచి రెండు మూడు నామినేషన్లు వచ్చాయి. వీరిలో ఎవరు వైసీపీ అభ్యర్థి అనేది ఆసక్తికరంగా మారింది. జడ్పీలో రిటర్నింగ్‌ కార్యాలయం వద్ద 144 సెక్షన్‌ అమలు చేయడంతో కేంద్రాలకు వంద మీటర్ల దూరంలోనే  కార్యకర్తలు ఉండిపోవాల్సి వచ్చింది.


ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, పోలీసులు తగిన చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. అధికార పార్టీ నాయకులకు లైన్‌ లేకుండా లోపలికి పంపారనే విమర్శలు వినిపించాయి.  నామినేషన్ల స్వీకరణ విభాగాన్ని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.  జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి చక్రధరబాబు నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. 


నేడు పరిశీలన...

జిల్లాలో 38 జడ్పీటీసీ స్థానాలకు, 668 ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్‌లను గురువారం పరిశీలించనున్నారు. నిబంధనల మేరకు సరిగ్గా లేని వాటిని తిరస్కరిస్తారు. వాటిని నోటీసు బోర్డులో పెట్టి, తిరస్కరణకు గురైన అంశాలను వెల్లడించనున్నారు. అనంతరం వాటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 


తిరుగుబాటు గుబులు!

ప్రాదేశిక, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ గడువు ముగిసింది. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆశావహులు అధికం కావడం..కొందరికే పార్టీ బీ ఫారాలు అందించడంతో ఎక్కువ మంది స్వతంత్రులుగా బరిలో దిగే అవకాశముంది. అన్ని పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పేలా లేదు. ముఖ్యంగా అధికార వైసీపీని రెబల్స్‌ గుబులు పట్టిస్తున్నారు. జడ్పీటీసీ అభ్యర్థిత్వాలు తమకు ఖరారవుతాయని భావించిన నేతలకు నామినేషన్ల నాటికి అధిష్టానం మొండిచేయి చూపడంతో వారంతా తిరుగుబాటు అభ్యర్థులుగా ఉండేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


చాలా జడ్పీటీసీ , ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీకి చెందిన బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో తమకు అవకాశం దక్కకపోతే, పార్టీ బీఫారం ఇచ్చిన అభ్యర్థికి సహకరించడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్తులు ఎక్కువగా ఉన్నారు. టెక్కలి, నందిగాం వంటి మండలాల్లో వైసీపీ తరుఫున బలమైన అభ్యర్తులు జడ్పీటీసీ బరిలోకి దిగారు. గత పదేళ్లుగా ఎటువంటి అవకాశాలు రాకపోవడం, వైసీపీ కొత్తగా అధికారంలోకి రావడంతో ఈసారి ద్వితీయ శ్రేణి నాయకులు ఎవ్వరూ పదవులు వదులుకోడానికి ఇష్టపడడం లేదు.


పార్టీ తరుఫున బీఫారం వచ్చినా లేకపోయినా తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నామినేషన్‌లు దాఖలు చేసిన అభ్యర్థులు ఉపసంహరణ గడువు లోగా వెనక్కి తీసుకోకుండా పోటీలో ఉండిపోతే బీఫారాలు తీసుకున్న నాయకులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.  మరికొందరు ముందు నామినేషన్‌ వేద్దాం, తరువాత సంగతి ఆలోచిద్దామనే ధోరణిలో ఉండడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 


అధినేత ఆజ్ఞలు..  బేఖాతరు...

స్థానిక ఎన్నికల్లో వైసీపీ అధినేత ఆదేశాలను కొందరు స్థానిక నేతలు దిక్కరించారు. పార్టీ విధివిధానాల్లో భాగంగా స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల బంధువులు ఎవరూ పోటీకి దిగకూడదు అని ఆంక్షలు విధించారు. కానీ జిల్లాలో మాత్రం దీనికి పూర్తిగా వైసీపీ నాయకులు వ్యవహరించారు. స్వయాన మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కుమారుడు కృష్ణ ఛైతన్య పోలాకి జడ్పీటీసీ స్థానానికి నామినేషన్‌ వేశారు. టెక్కలి పార్లమెంటరీ నియోజక వర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్‌ సతీమని వాణి కూడా టెక్కలి జడ్పీటీసీ స్థానం నుంచి బరిలో నిలిచేందుకు నామినేషన్‌ సమర్పించారు.


స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు స్వయాన వదినను దూసి ఎంపీటీసీ స్థానానికి పోటీలో నిలిపారు.  పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు రెడ్డి శ్రావణ్‌, టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేడాడ తిలక్‌ సతీమణి భార్గవి కూడా నామినేషన్‌ దాఖలు చేశారు.  పలుచోట్ల వైసీపీ నాయకులే ఎంపీటీసీలుగా బంధువులకు పోటీలో నిలపడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి టీడీడీ నుంచి పెద్దగా పోటీ లేకపోయినా ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. దీంతో నేతల మధ్య ఏకాభిప్రాయం తెచ్చేందుకు నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

Updated Date - 2020-03-12T10:06:11+05:30 IST