జిల్లాలో వడగళ్ల వాన

ABN , First Publish Date - 2020-03-19T10:16:03+05:30 IST

జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం ఉరుములు, గాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఉదయం ఎండ

జిల్లాలో వడగళ్ల వాన

జీడి, మామిడి పంటలకు నష్టం

మొక్కజొన్న, నువ్వులకు కూడా..

పిడుగుపాటుకు కొబ్బరి చెట్లు దగ్ధం

లబోదిబోమంటున్న రైతులు


(గుజరాతీపేట/జలుమూరు/ఎల్‌.ఎన్‌.పేట/ ఇచ్ఛాపురం/సోంపేట/సీతంపేట)

జిల్లాలోని పలు మండలాల్లో  బుధవారం సాయంత్రం ఉరుములు, గాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఉదయం ఎండ చుర్రుమనిపించి సాయంత్రానికి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం పడింది.  ఎల్‌ఎన్‌పేట, సీతంపేట, సరుబుజ్జిలి, జలుమూరు, శ్రీకాకుళం, గార, కవిటి, సోంపేట, తదితర మండలాల్లో సుమారు అరగంట పాటు ఏకధాటిగా వాన పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువల్లోని మురుగు  రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు అవస్థలకు గురయ్యారు. కాగా, గత మూడు రోజులుగా కురుస్తున్న ఈ అకాల వర్షాలు అన్నదాతకు నష్టాన్ని కలిగించాయి. మొక్క జొన్న, నువ్వు,  కూరగాయలు, అపరాలు, జీడి, మామిడి, చింతపండు పంటలకు నష్టం వాటిల్లింది.


ఇటుకలు తడిసిపోవడంతో సంబంధిత వ్యాపారులు కూడా నష్టాలను చవి చూశారు. వడగళ్లకు మామిడి, జీడి పిందెలు రాలిపోయాయని రైతులు వాపోతున్నారు.  కవిటి మండలం మాణిక్యపురంలో పలు కొబ్బరి చెట్లపై పిడుగులు పడ్డాయి. దీంతో చెట్లు కాలిపోయాయి. ఒకపక్క కరోనా వైరస్‌తో ప్రజలు వణికిపోతున్న తరుణంలో ఈ అకాల వర్షాలు కురవడంతో అంటు వ్యాధులు ప్రబలుతాయనే భయం వ్యక్తమవుతోంది. ఫ అకాల వర్షాలతో ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువని   జిల్లా వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్‌ తెలిపారు. మొక్కజొన్న, నువ్వు పంటల కోత సమయంలో వర్షాలు పడడంతో  దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు.  సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లో ఆలస్యంగా సాగు చేసిన నువ్వు పంటకు ఈ వర్షాలతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. 

Updated Date - 2020-03-19T10:16:03+05:30 IST