తప్పులకు.. మూల్యం చెల్లించాల్సిందే
ABN , First Publish Date - 2020-12-21T04:54:50+05:30 IST
‘ప్రశాంతతకు నిలయమైన పలాస నియోజకవర్గాన్ని వైసీపీ నాయకులు రావణకాష్టగా మార్చుతున్నారు. వారంతా అన్నానికి బదులు ఇసుక, మెటల్, కంకరను మేస్తున్నారు. వారు చేస్తున్న తప్పులకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే’నని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ హెచ్చరించారు.

శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్
పలాసలో వైసీపీ నేతల అక్రమాలపై ఆగ్రహం
పలాస, డిసెంబరు 20: ‘ప్రశాంతతకు నిలయమైన పలాస నియోజకవర్గాన్ని వైసీపీ నాయకులు రావణకాష్టగా మార్చుతున్నారు. వారంతా అన్నానికి బదులు ఇసుక, మెటల్, కంకరను మేస్తున్నారు. వారు చేస్తున్న తప్పులకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే’నని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ హెచ్చరించారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పలాసలో వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫ్యాక్షన్ భావజాలం కలిగిన సీఎం జగన్.. వారి నాయకుల్లో కూడా అదే భావజాలాన్ని నింపుతుండడం ఆందోళన కల్గిస్తోంది. ఇటీవల స్థానిక వైసీపీ నాయకురాలు భూకబ్జాలకు పాల్పడిన తీరే ఇందుకు ఉదాహరణ. మంత్రి సీదిరి అప్పలరాజు వినియోగించే భాష బాగోలేదు. రాజకీయాల్లో హుందాతనం కావాలి. స్వాతంత్రం కోసం పోరాడిన సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూల్చివేస్తాననడం ఆయన అనాలోచిత నిర్ణయానికి నిదర్శనం. చరిత్ర కలిగిన నాయకులను విమర్శించడం క్షమించరాని నేరం. మంత్రిగా హుందాతనాన్ని తక్కువ చేసుకోవద్దు’ అని హితవు పలికారు.
కబ్జాలపై మంత్రి తీరు ఆక్షేపణీయం
జిల్లాలో ఎక్కడా లేని విధంగా పలాసలో పెరుగుతున్న భూ కజ్జాలకు మంత్రి బాధ్యత వహించాలి. ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మంత్రిపై ఉంది. ఛాలెంజ్‌లు చేయడం కాదు. కబ్జాలు నిర్మూలించి చిత్తశుద్ధి ప్రదర్శించుకోవాలి. జిల్లా చరిత్రలో పచ్చని కొండను క్వారీకి ఇవ్వడం ఇదే ప్రఽథమం. దీనితోపాటు ఒక్కరోజులోనే అనుమతులన్నీ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సూదికొండను కంకర తవ్వకానికి అనుమతులు ఇవ్వడంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్నాం. ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఇసుక అమ్ముకుంటే, మిగిలిన ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు కంకరను సైతం దోచేస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో తాగునీటి పథకాన్ని పూర్తిచేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. కమిషన్ల కోసమే హిరమండలం నుంచి పైపులైన్లు ద్వారా నీరు రప్పిస్తున్నారు. వాస్తవానికి ఆఫ్‌షోర్ పూర్తిచేస్తే టెక్కలి డివిజన్ అంతటికీ నీరు లభించేది’ అని రవికుమార్ తెలిపారు. తితలీ బాధితులకు ఇచ్చిన హామీ మేరకు సంక్రాంతిలోగా రెట్టింపు పరిహారాన్ని చెల్లించాలి. లేకుంటే బాధితులతో కలిసి ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.
వైసీపీ నాయకులే.. ఆక్రమణదారులు:
పలాసలో భూ ఆక్రమణలకు పాల్పడింది మంత్రి అప్పలరాజు మనుషులేనని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆరోపించారు. మునిసిపల్ కార్యాలయంలో ఒక అధికారిని ప్రక్కన పెట్టుకొని మంత్రి అప్పలరాజు ఇష్టం వచ్చినట్లు సర్వేనెంబర్లు చెప్పి.. టీడీపీ నాయకులే భూ ఆక్రమణలకు పాల్పడ్డారని పేర్కొనడం అన్యాయమన్నారు. ఆ సర్వే నెంబర్లులో ఎవరి పేర్లు ఉన్నాయో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూల్చే.. ఆక్రమణలు తొలగిండం మొదలుపెడదామని మంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే.. తగురీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరావు యాదవ్, వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, దువ్వాడ సంతోష్‌నాయుడు, బడ్డ నాగరాజు పాల్గొన్నారు.
సోషల్‌మీడియాలో పోస్టింగులు ఆపాలి
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరీష
పలాస, డిసెంబరు 20: సోషల్ మీడియాలో కొంతమంది వైసీపీ నాయ కులు తమపై అసభ్యకరమైన పోస్టింగులు పెడుతున్నారని, 48 గంటల్లోగా వాటిని నిలువరించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పోలీ సులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం టీడీపీ నాయకులతో కలిసి ఆమె కాశీ బుగ్గ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఐతో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం నుంచి ఇప్పటి వరకు నాపై, నా తండి, తాతలపై కూడా వైసీపీ నాయకులు అసభ్యకరమైన పోస్టింగులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 48 గం టల్లో వారు పోస్టింగులు ఆపకపోతే.. తాము పెట్టే పోస్టులకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ పలాసలో ఇటువంటి సంఘటనలు చేసుకోవడం దురదృష్టకర మని, మంత్రి అప్పలరాజు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మరోసారి గౌతు కుటుంబంపై పోస్టింగులు పెడితే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.