-
-
Home » Andhra Pradesh » Srikakulam » For sale distance
-
అమ్మఒడికి.. వారికి లేనట్లేనా!
ABN , First Publish Date - 2020-12-20T04:02:31+05:30 IST
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈ ఏడాది అమ్మఒడి పథకానికి దూరం కానున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే.. అందరినీ ఉత్తీర్ణులను చేసింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో.. కొవిడ్ నిబంధనల నడుమ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఫలితంగా జూనియర్ ఇంటర్ విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటర్ ప్రవేశాలపై స్పష్టత కరువు
జిల్లాలో సుమారు 9 వేల మందికి దక్కని లబ్ధి
(మెళియాపుట్టి): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈ ఏడాది అమ్మఒడి పథకానికి దూరం కానున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే.. అందరినీ ఉత్తీర్ణులను చేసింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో.. కొవిడ్ నిబంధనల నడుమ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఫలితంగా జూనియర్ ఇంటర్ విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తింపుపై స్పష్టత కరువవుతోంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ అమ్మఒడి పథకాన్ని వర్తింపజేసింది. ఏటా రూ.15వేల చొప్పున విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో వేస్తామని ప్రకటించింది. గత ఏడాది నుంచి ఈ పథకం అమలవుతోంది. ఈ ఏడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు ఆలస్యంగా తెరిచారు. అయినప్పటికీ వచ్చే జనవరి 9న విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద నిధులు జమ చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని ఉపాధ్యాయులకు, పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశించింది. వివరాల నమోదుకు ఈ నెల 16తో గడువు ముగియగా.. మరో మూడు రోజులు పొడిగించింది. నేటితో విద్యార్థుల వివరాల నమోదు ప్రక్రియ ముగియనుంది. అయితే.. ఈ ఏడాది ఇంటర్‌లో చేరే విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తింపుపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. గత నెల 2 నుంచి ఇంటర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.
అంతకు నెలరోజుల ముందే ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. తొలుత ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియ చేపట్టగా.. వివిధ సమస్యలు తలెత్తాయి. ఆన్‌లైన్‌లో ప్రవేశాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. మరోవైపు ఒక్కో తరగతికి 40 సీట్లకు మించి ప్రవేశాలు నిర్వహించరాదని ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం రెగ్యులేటర్ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ, ఆ కమిటీ ఇంతవరకూ ఫీజులు నిర్ణయించలేదు. దీంతో జూనియర్ ఇంటర్ ప్రవేశాల వ్యవహారం కొలిక్కిరాలేదు. ఫలితంగా అమ్మఒడి పథకంపై స్పష్టత లేదు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో 205 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో సుమారు 9వేల మంది విద్యార్థులు చేరినట్టు సమాచారం. గత ఏడాది పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులు కావడంతో వారంతా ఇంటర్‌లో చేరారు. విద్యాశాఖ అధికారులు మాత్రం ఇంటర్ ప్రవేశాల వ్యవహారం కోర్టులో పెండింగ్ ఉండడంతో అధికారికంగా ప్రకటించడం లేదు. ఫీజులు, తరగతుల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో అమ్మఒడి పథకానికి సంబంధించి జూనియర్ ఇంటర్ విద్యార్థుల వివరాల సేకరణను నిలిపేశారు. దీంతో తామంతా అమ్మఒడి పథకానికి దూరమవుతున్నామని ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకూ ఈ పథకం వర్తించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఆదేశాలు రాలేదు
- రుక్మాంగధరావు, ఆర్‌ఐవో, శ్రీకాకుళం
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ‘అమ్మఒడి’ పథకం వర్తింపుపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల జాబితాను మాత్రమే సిద్ధం చేశాం.
వస్తాయో.. రావో?
- రేగల అఖిల, ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని
పదో తరగతిలో అమ్మఒడి పథకం కింద డబ్బులు వచ్చాయి. ఈ ఏడాది విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌లో చేరాను. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కళాశాలకు మమ్మల్ని రానీయడం లేదు. ఆన్‌లైన్ తరగతుల పేరుతో ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అమ్మఒడి పథకం డబ్బులు వస్తే.. మాకు కొంత ఆసరాగా ఉంటుంది. కానీ, అవి వస్తాయో.. రావో.. తెలియని పరిస్థితి నెలకొంది.