డ్వాక్రా మహిళలకు.. ఆసరా!

ABN , First Publish Date - 2020-09-05T09:08:24+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం అమలు చేస్తున్న ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం ఈ నెల 11న ప్రారంభం కానుంది...

డ్వాక్రా మహిళలకు.. ఆసరా!

తొలివిడత రుణమాఫీకి సన్నాహాలు

11న పొదుపు ఖాతాల్లో నగదు జమ


(ఇచ్ఛాపురం రూరల్‌) 

రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం అమలు చేస్తున్న ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం ఈ నెల 11న ప్రారంభం కానుంది. పాదయాత్ర సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి  ఇచ్చిన హామీ మేరకు.. డ్వాక్రా మహిళల ఖాతాల్లో నాలుగు విడతలుగా నగదు వేయనుంది. గత ఏడాది ఏప్రిల్‌ 11 నాటికి ఒక గ్రూపునకు ఎంత రుణం ఉందో... అంత నగదును ‘ఆసరా’ పథకం కింద వారికి అందించబోతోంది. జిల్లాలో 46,913 సంఘాల్లో 5,85,803 మంది మహిళా సభ్యులకు రూ.1358.48కోట్లను నాలుగు దశల్లో విడుదల చేయనుంది. దీనిద్వారా డ్వాక్రా మహిళలకు మరింత ఆర్థిక భరోసా లభించనుంది. ఇప్పటికే మహిళలు తీసుకున్న రుణాలను బ్యాంకులకు తిరిగి చెల్లించిన నేపథ్యంలో ఖాతాలకు జమైన మొత్తాన్ని తమ ఆర్థిక ప్రగతి కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో బృందానికి అత్యధికంగా రూ. 10 లక్షల వరకు ఆసరా కింద నాలుగు దశల్లో విడుదల కానుంది. జిల్లాలో వెలుగు క్లస్టర్ల ద్వారా దీనికి సంబంధించిన కసరత్తు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. 


బయోమెట్రిక్‌ తప్పనిసరి 

వైఎస్సార్‌ ఆసరా పథకం కింద లబ్ధి పొందనున్న మహిళలకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ తప్పనిసరి చేసింది. వెలుగు సిబ్బంది గ్రూపుల వద్దకు వచ్చినప్పుడు మహిళలు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వేయాలి. దీని ద్వారా ఎంతమంది మహిళలు ఇతర ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు వలసలు వెళ్లారన్న సమాచారం తెలుస్తుంది. ఒకవేళ  ఆ మహిళ ఆ గ్రామంలో లేకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తే అక్కడ బయోమెట్రిక్‌ పొందే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రం లేదా ఇతర దేశంలో ఉంటే తప్పనిసరిగా రాష్ట్రానికి వచ్చి బయోమెట్రిక్‌ వేయాలి. బయోమెట్రిక్‌ పూర్తికాని మహిళలకు ఆసరా వర్తించదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అర్హుల జాబితాను సచివాలయల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించామని తెలిపారు. 


ఆర్థికాభివృద్ధి సాధించాలి

ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా కింద స్వయంశక్తి సంఘాలకు అందించే నగదు వారి గ్రూపు పొదుపు ఖాతాలకు జమ చేస్తుంది. ఈ డబ్బులను వారి ఆర్థికాభివృద్థికి వినియోగించుకోవాలి. ఈ డబ్బులకు సంబంధించి ఎటువంటి ఆంక్షలు లేవు.

- బి.నగేష్‌, పీడీ, డీఆర్‌డీఏ.

Updated Date - 2020-09-05T09:08:24+05:30 IST