సమస్యలు పరిష్కరించండి: డీఆర్‌ఎంకు ఎంపీ రామ్మోహన్‌నాయుడు వినతి

ABN , First Publish Date - 2020-12-11T05:23:55+05:30 IST

‘శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌లో నెలకొన్ని సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లా మీదుగా వెళ్తున్న వివిధ రైళ్లకు ఈ స్టేషన్‌లో హాల్ట్‌ సౌకర్యం కల్పించాలి’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరారు. ఈ మేరకు గురువారం విశాఖపట్నంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో రైల్వే డివిజన్‌ మేనేజర్‌ ఛాతన్‌కుమార్‌ శ్రీవత్సవను ఆయన కలిశారు. ఆమదాలవలస స్టేషన్‌లో సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.

సమస్యలు పరిష్కరించండి: డీఆర్‌ఎంకు ఎంపీ రామ్మోహన్‌నాయుడు వినతి
రైల్వే డీఆర్‌ఎంకు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు

ఫుట్‌వే బ్రిడ్జి పనులు ప్రారంభించాలి

మరిన్ని రైళ్లకు హాల్ట్‌ కల్పించాలి


ఆమదాలవలస, డిసెంబరు 10: ‘శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌లో నెలకొన్ని సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లా మీదుగా వెళ్తున్న వివిధ రైళ్లకు ఈ స్టేషన్‌లో హాల్ట్‌ సౌకర్యం కల్పించాలి’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరారు. ఈ మేరకు గురువారం విశాఖపట్నంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో రైల్వే డివిజన్‌ మేనేజర్‌  ఛాతన్‌కుమార్‌ శ్రీవత్సవను ఆయన కలిశారు. ఆమదాలవలస స్టేషన్‌లో సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ‘శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస)రైల్వేస్టేషన్‌ పరిధిలో ఫుట్‌వే బ్రిడ్జి పనులు ప్రారంభించాలి. ఆమదాలవలస రైల్వే బుకింగ్‌ కౌంటర్‌ సమీపంలో ఫుట్‌వే బ్రిడ్జి మూసేసి రెండేళ్లు పూర్తవుతున్నా పనులు ప్రారంభించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రూ.మూడు కోట్లు మంజూరైనా.. పనుల్లో జాప్యమవుతోంది. ఇప్పటికైనా పనుల ప్రారంభానికి చొరవచూపాలి’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరారు.


‘శ్రీకాకుళం రోడ్డులో హౌరా-యశ్వంత్‌పూర్‌, భువనేశ్వర్‌-రామేశ్వర్‌, హౌరా-కన్యాకుమారి, హౌరా-పాండిచ్చేరి, సంత్రాగచ్చి-తిరుపతి, భూవనేశ్వర్‌-పూణే, దిగా-విశాఖపట్నం, షాళిమార్‌-విశాఖపట్నం, హౌరా-సత్యసాయి ప్రశాంతినిలయం, సంత్రాగచ్చి-చెన్నె ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్‌ ఇవ్వాలి. వీటితోపాటు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ పొందూరు స్టేషన్‌లో, గుణుపూరు పాసింజర్‌కు దండుగోపాలపురం, తిలారు, ఉర్లాం, దూసిలో హాల్ట్‌ సౌకర్యం కల్పించాలి. ఉత్తరాంధ్ర ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం-వారణాశి మధ్య నేరుగా రైలు సర్వీసు నడపాలి.  విశాఖ-పలాస మధ్య నడుస్తున్న కొవిడ్‌-19 రైలు ఇచ్ఛాపురం వరకు పొడిగించాలి. తిరుపతి వెళ్లే యాత్రీకుల సౌకర్యార్థం తిరుపతి-విశాఖ రైలును శ్రీకాకుళం వరకు నడపాలి’ అని ఎంపీ విజ్ఞప్తి చేశారు. దీనిపై రైల్వే డీఆర్‌ఎం సానుకూలంగా స్పందిస్తూ.. త్వరలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


‘రైల్వేస్టేషన్‌ సముద్ర ప్రాంతానికి దగ్గరలో ఉండడంతో ఇనుముతో బ్రిడ్జి నిర్మిస్తే త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణుల కమిటీ సూచించింది. ఈ మేరకు స్టీల్‌తో నిర్మాణానికి ఉన్నతాధికారులకు నివేదించాం. అనుమతులు, నిధులు వచ్చిన వెంటనే పనులు చేపడతా’మని తెలిపారు. ఈ విషయంపై తాను కూడా  రైల్వే మంత్రితో మాట్లాడతానని, పనులు ప్రారంభించాలని ఎంపీ కోరారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి పనులు పూర్తి చేస్తామని డీఆర్‌ఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం.రమేష్‌, బోర గోవిందరావు, బీవీ రమణమూర్తి ఉన్నారు.

  

Updated Date - 2020-12-11T05:23:55+05:30 IST