పంచాయతీలకు ఆర్థిక కష్టాలు

ABN , First Publish Date - 2020-12-28T04:13:54+05:30 IST

జిల్లాలోని పంచాయతీల్లో పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ప్రధానంగా అధికారులు దృష్టి సారించకపోవడంతో పూర్తిస్థాయిలో వసూలు కావడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పంచాయతీలకు ఆర్థిక కష్టాలు
బూర్జపాడు పంచాయతీ

  పేరుకుపోయిన పన్ను బకాయిలు

  వసూళ్లపై దృష్టి పెట్టని అధికారులు

ఇచ్ఛాపురం రూరల్‌: జిల్లాలోని పంచాయతీల్లో పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ప్రధానంగా అధికారులు దృష్టి సారించకపోవడంతో పూర్తిస్థాయిలో వసూలు కావడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కరోనా నేపథ్యంలో గ్రాంట్లు కోతపడడంతో పంచాయతీలు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నాయి. కరోనా వల్ల అనేక రంగాలు కోలుకోని విధంగా దెబ్బతిన్నాయి. పంచాయతీల పన్నుల వసూళ్లపై ఆ ప్రభావం పండింది. కరోనా ప్రభావం, అధికారుల నిర్లక్ష్యంతో పన్నులు వసూలు కాకపోవడం, మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీలు సిబ్బందికి సైతం సక్రమంగా జీతాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి.


సిబ్బంది కొరత... పర్యవేక్షణ లేక

జిల్లాలో 564 క్లస్టర్ల పరిధిలో 1,190 పంచాయతీలు ఉన్నాయి. సిబ్బంది కొరత, పర్యవేక్షణలోపం వల్ల పలు పంచాయతీల్లో పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. 2020- 21ఆర్థిక సంవత్సరంలో రూ.27.19 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.ఆరు కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. జిల్లాలో వంద లాది చిన్న పంచాయతీలకు సరైన ఆదాయం వనరులులేవు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లపై ఆధారపడాల్సివస్తోంది. ఆర్థికసంఘం నిధులు విడుదలైనా వాటిని ప్రభుత్వం నిర్ధేశించిన కొన్ని పనులకు మాత్రమే వెచ్చించాల్సివస్తోంది.ఈ నేపథ్యంలో పన్ను బకాయిలు పేరుకు పోవడంతో గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై ప్రభావం చూపుతోందని అధికారులు వాపోతున్నారు.


లాక్‌డౌన్‌తో నిలిచిన వసూళ్లు

కరోనా వైరస్‌ వల్ల జిల్లాలో సుమారు మూడునెలల పాటు లాక్‌డౌన్‌ అమలులోఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపాధి లేక సిబ్బంది పన్ను వసూళ్లను నిలిపివేశారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో కార్యదర్శులు, సిబ్బందికి అధనపు బాధ్యతల వల్ల వసూళ్లలో కొంతమేర జాప్యం జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిగణలోకి తీసుకొని పన్నుల వసూళ్లలో పంచాయతీ, సచివాలయకార్యదర్శులతోపాటు వలంటీర్లను కూడా భాగస్వామ్యంచేశారు. ప్రస్తుతం గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు, మనం- మనపరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఎంపికచేసిన పంచాయతీల్లో ఇంటింటికీ చెత్తసేకరణ తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ పథకాలు కొనసాగించేందుకు తక్షణ మే నిధులు అవసరం. ఈ నేపథ్యం లో ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడంతో పంచాయతీ పాలన భారంగా మారడంతో కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు.

  

Updated Date - 2020-12-28T04:13:54+05:30 IST