కలాసీలు రారు... బియ్యం దించరు
ABN , First Publish Date - 2020-04-26T10:06:41+05:30 IST
కరోనా వైరస్ భయంతో లారీల్లో ఉన్న బియ్యం దింపేందుకు కార్మికులు ముందుకు రావడం లేదు. దీంతో ఐదు రోజులుగా ..

వెంటాడుతున్న కరోనా వైరస్ భయం
ఐదురోజులుగా అన్‌లోడ్ కాక డ్రైవర్లు, క్లీనర్లకు పస్తులు
ఇదీ పద్మనాభపురం గోదాము వద్ద పరిస్థితి
పలాస, ఏప్రిల్ 25: కరోనా వైరస్ భయంతో లారీల్లో ఉన్న బియ్యం దింపేందుకు కార్మికులు ముందుకు రావడం లేదు. దీంతో ఐదు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతానికి చెందిన డ్రైవర్లు, క్లీనర్లు పస్తులుంటున్నారు. వారు తీసుకువచ్చిన నిత్యావసర సరుకులు పూర్తికావడంతో ఆందోళన చెందుతున్నారు. పలాస-కాశీబుగ్గలోని పద్మనాభపురం మార్కెట్ యార్డుకు 15 లారీలతో ప్రభుత్వం రేషన్‌డిపోలకు సరఫరా చేసే బియ్యం నిల్వలు ఐదురోజుల కిందట కాకినాడ నుంచి వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఇక్కడి కార్మికులు ఆ బియ్యం లోడు కిందకు దిం చేందుకు ముందుకురాలేదు. దీంతో 15 లారీలకు చెందిన డ్రైవర్లతో సహా 30మంది పస్తులు ఉండాల్సివస్తోంది.
ఒక్కరోజులోనే బియ్యం అన్‌లోడ్ జరిగితే మళ్లీ కొత్తగా సరుకు తీసుకురావాల్సి ఉంది. వాటిని దింపేందుకు ఎవరూ రాకపోవడంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు. తమతో తీసుకువచ్చిన బియ్యం, ఇతర సరుకులు శుక్రవారంతో నిండుకున్నాయని, ప్రస్తుతం తమకు తిండిపెట్టేవారు కూడా లేరని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూగోదాము సిబ్బందిని ప్రశ్నిస్తుంటే సమాధానం ఇవ్వడం లేదని వాపోతున్నారు. కనీసం తమకు తిండైనా పెట్టాలని వారంతా వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తేనే సరుకులు ఇక్కడకు తీసుకు వచ్చామని రామచంద్రపురానికి చెందిన గణపతి తెలిపాడు. వద్దంటే తమకు లేఖలు ఇస్తే తిరిగి వెళ్లిపోతామని ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పాడు.
అధికారులు స్పందించాలి... బి.శ్రీనివాసరావు, లారీడ్రైవర్, బలభద్రపురం తూర్పుగోదావరి జిల్లా
అత్యంత భద్రత మధ్య గ్రీన్‌జోన్ నుంచి బియ్యం తీసుకువచ్చినా ఇక్కడి కార్మికులు భయంతో అన్‌లోడ్ చేయడం లేదు. ఐదురోజులుగా మేము ఇక్కడే వండుకొని ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంత దారుణపరిస్థితి గతంలో ఎన్నడూ ఎదుర్కొనలేదు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.