ఇళ్ల పట్టాల పంపిణీలో దోపిడీ

ABN , First Publish Date - 2020-12-29T05:09:51+05:30 IST

ఇళ్ల పట్టాల పంపిణీలో పేదలను నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు నిలువునా దోచుకుంటున్నారని శ్రీకాకుళం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ విమర్శించారు. సోమవారం ఆమదాలవలసలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ స్థలాల పంపిణీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

ఇళ్ల పట్టాల పంపిణీలో దోపిడీ
మాట్లాడుతున్న కూన రవికుమార్‌

వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థలాల కేటాయింపు తగదు

శ్రీకాకుళం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు రవికుమార్‌

ఆమదాలవలస రూరల్‌, డిసెంబరు 28: ఇళ్ల పట్టాల పంపిణీలో పేదలను నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు నిలువునా దోచుకుంటున్నారని శ్రీకాకుళం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ విమర్శించారు. సోమవారం ఆమదాలవలసలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ స్థలాల పంపిణీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మార్కెట్‌ కంటే ఎక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం అవినీతి భాగోతం చేస్తోందని విమర్శించారు. ‘పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఎకరా రూ.ఏడులక్షల విలువ చేసే భూములను ప్రభుత్వం రూ.14 లక్షలకు కొనుగోలు చేసింది. పొందూరు మండలంలో ఎకరా రూ.12లక్షలు ఉండగా.. రూ.24లక్షలకు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో  చూపుతున్నారు. వీటి మాటున అధికారులు వైసీపీ నాయకుల జేబుల్లో రూ.లక్షలు నింపే పనిలో పడ్డారు’ అని రవికుమార్‌ విమర్శించారు. ఆమదాలవలస మండలం తొగరాం నుంచి నారాయణపురం ఆయకట్టు వరకు వరద ప్రభావం అరికట్టేందుకు కేటాయించిన భూముల్లో స్థలాలు ఎలా కేటాయిస్తారని అధికారులను ప్రశ్నించారు. వంజంగిలో ఎస్సీలకు కేటాయించిన భూములను కొనుగోలు చేయడం దారుమణమన్నారు. స్పీకర్‌ తమ్మినేని ఇలాకాలో నాగావళి నదిలోనే పట్టాలు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఇళ్ల స్థలాల పరిహారం సొమ్ము కాజేసేందుకు స్పీకర్‌ అండ్‌ కో ప్రయత్నిస్తోందన్నారు. తమ్మినేని సీతారాం స్పీకర్‌ హోదాలో ఉండకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ. లక్షా 50వేలు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.30వేలు మాత్రమే అందిస్తోందని తెలిపారు. ఇళ్ల పంపిణీ అపహస్యం పాలైందని, ఈ పథకానికి ఇల్లు కొనుక్కునే పథకంగా పేరు మార్చితే బాగుంటుందని ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో మొదలవలస రమేష్‌, సనపల రామకృష్ణ, నూకరాజు, అన్నెపు భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:09:51+05:30 IST