అందరూ ఇళ్లలోనే!

ABN , First Publish Date - 2020-03-23T09:11:32+05:30 IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో సిక్కోలు వాసులు సంపూర్ణంగా భాగస్వామ్యమయ్యారు. ఆదివారం జిల్లాలో జాతీయ రహదారులు, రాష్ట్ర

అందరూ ఇళ్లలోనే!

కరోనాపై సామూహిక యుద్ధం

సిక్కోలులో జనతా కర్ఫ్యూ విజయవంతం

స్తంభించిన జనజీవనం

కదలని వాహనాలు.. నిర్మానుష్యమైన రహదారులు

ముందు నుంచే ప్రజలు సిద్ధం... ఇబ్బందులకు దూరం

నిశ్శబ్దం...అంతటా నిశ్శబ్దం. రణగొణ ధ్వనులు లేవు. 

వాహనాల హారన్ల శబ్దాలు లేవు. ఎక్కడి వారు అక్కడే. 


ఎక్కడా... ఎవరూ ఇల్లు కదల్లేదు. సాయంత్రం 5 గంటల వరకూ బయటి ప్రపంచాన్ని చూడలేదు. పల్లె నుంచి పట్టణం  వరకూ... వీధి రోడ్ల నుంచి జాతీయ రహదారుల వరకూ అంతటా నిర్మానుష్యం. ఎవరికి వారు విధించుకున్న నిర్బంధం. ఇచ్ఛాపురం నుంచి పైడిభీమవరం వరకు... వీరఘట్టం నుంచి కళింగపట్నం వరకూ రహదారులన్నీ బోసిపోయాయి. పట్టణాల్లో ఎన్నడూ లేనంత నిశ్శబ్ద వాతావరణం కనిపించింది. బస్సులు... రైళ్లు... ఆటోలు ఇలా ఏ వాహనమూ కదల్లేదు. .. ఒక్క షాపూ తెరచుకోలేదు.  ఆఖరికి పాల ప్యాకెట్లు కూడా జనానికి అందలేదు. ఆలయాలూ మూతపడ్డాయి. 


ఇదీ జనతా కర్ఫ్యూ ప్రభావం. 

కరోనా వైరస్‌పై యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుమేరకు ఆదివారం తలపెట్టిన జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా దీనిలో భాగమయ్యారు. నాయకులు... అధికారులు... సాధారణ ప్రజానీకం అందరూ పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు.


అత్యవసర సేవలు అందించిన వారికి కృతజ్ఞతగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చప్పట్లు కొట్టి...ధన్యవాదాలు చెప్పడానికి ఆబాలగోపాలం ముందుకొచ్చారు. అంతవరకూ నిశ్శబ్దం రాజ్యమేలింది. రాత్రి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. కర్ఫ్యూ నేపథ్యంలో అనాథలు, అభాగ్యులు ఇబ్బందులు పడకుండా కొందరు యువకులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు  ఆహార పొట్లాలు అందించి.. మానవత్వాన్ని చాటుకున్నారు.


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/రామలక్ష్మణ జంక్షన్‌)

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో సిక్కోలు వాసులు సంపూర్ణంగా భాగస్వామ్యమయ్యారు. ఆదివారం జిల్లాలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, నగరాలు, పట్ట ణాల్లో ప్రధాన జంక్షన్లు నిర్మానుష్యమయ్యాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇసుకవేస్తే రద్దీగా ఉండే జంక్షన్లు సైతం... జనసంచారంలేక వెలవెలబోయాయి. చిరుదుకాణాలు నుంచి షాపింగ్‌ మాల్స్‌, షోరూమ్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, కిరాణా దుకాణాలు హోటళ్లు, లాడ్జీలు.. ఇలా ప్రతి ఒక్కటీ మూతప డ్డాయి. జిల్లా అంతటా కంపెనీలు, సంస్థలు మూతప డ్డాయి. ఆర్టీసీ బస్సులు, ఇటు ప్రైవేటు వాహనాలు, ఆటోలు సైతం రోడ్డెక్కలేదు. అత్యధికమంది జనతా కర్ఫ్యూకి సిద్ధమై ముందుగానే ఇంటివద్దనే అన్ని ఏర్పాట్లు సిద్ధంచేసుకున్నారు. 


బోసిపోయిన జాతీయరహదారి.. 

జిల్లాలో 190 కిలోమీటర్లపైబడి ఉన్న జాతీయ రహదారి ఆదివారం బోసిపోయింది. వేలాది వాహనాల రాకపోకలతో.. నిరంతరం రయ్‌రయ్‌మని శబ్దాలు వినిపించే ఈ రహదారిపై అలజడి కనీసం లేదు. ఇతర జిల్లాల నుంచి, అటు ఒడిశా, పశ్చిమబంగ రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో జాతీయ రహదారి నిర్మానుష్యమైంది. కేవలం అక్కడక్కడా పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లు మాత్రమే దర్శనమి చ్చాయి. చెక్‌పోస్టులు, టోల్‌గేట్లు సైతం మూగ బోయాయి. ఉన్న సిబ్బంది కూడా మాస్క్‌లను ధరించి భద్రత పాటించారు. 


జనసంచారం లేని శ్రీకాకుళం... 

పగలేకాదు.. అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు జనసంచారంతో కళకళలాడే శ్రీకాకుళంలో  జనతాకర్ఫ్యూ నేపథ్యంలో జనసంచారం లేదు. డేఅండ్‌నైట్‌ జంక్షన్‌, పొట్టి శ్రీరాముల జంక్షన్‌, కలెక్టరేట్‌, పాతబస్టాండ్‌, అరసవల్లి కూడలి(మిల్లు జంక్షన్‌), సర్వజన ఆసుపత్రి ప్రాంగణం, రామలక్ష్మణ జంక్షన్‌, సూర్యమహల్‌ సెంటర్‌, పాలకొండ రోడ్డు, కృష్ణాపార్క్‌ ఏరియా, నాగావళి పాతవంతెన, కొత్త వంతెన ప్రాంతాలు మూగబోయాయి. ప్రజలు స్వచ్ఛం దంగా కర్ఫ్యూని పాటించి ఇళ్లకే పరిమితమైపోయారు.  జిల్లా అంతటా పెట్రోల్‌ బంకులు, మందుల దుకాణాలు మాత్రమే తెరుచుకున్నాయి. వేలాది రోగులతో కిటకిట లాడే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కూడా వెలవెలబోయింది. శ్రీకాకుళం చేపలమార్కెట్‌లో చేపలను విక్రయించేందుకు ప్రయత్నించినవారిని పోలీసులు వారించారు. వారిని యుద్ధప్రాతిపదికన అక్కడ నుంచి పంపించేశారు.

 

కొందరికి తప్పని ఇబ్బందులు

దూరప్రాంతాల నుంచి తిరిగివచ్చిన వారు జనతా కర్ఫ్యూ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అత్యధిక మంది ఆదివారం వేకువ జామునుంచే శ్రీకాకుళం ప్రాంతానికి చేరుకున్నారు. ప్రైవేటు వాహనాల్లో జిల్లాకేంద్రానికి వచ్చేసి.. ఏడు గంటల్లోగా స్వగ్రామాలకు వెళ్లిపోదామనుకున్నవారికి ఇబ్బందులే ఎదురయ్యాయి. ఎక్కడా ఆటోలు కూడా లేకపోవడం.. గంటలపాటు నిరీక్షించారు. కొంతమంది తమకుతెలిసిన వారితో ఫోన్‌లో మాట్లాడి వారినుంచి ద్విచక్రవాహ నాలను తీసుకుని.. స్వగ్రామాలకు పయనమయ్యారు. 


పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలు మూసివేత.. 

జిల్లాలో పర్యాటక ప్రాంతాలన్నీ మూతపడ్డాయి. ఇటు కళింగపట్టణం, శాలిహుండం, అటు బారువ వంటి ప్రాంతాల్లో పర్యాటకప్రాంతాలు సైతం మూసివేశారు. అరసవల్లి, శ్రీముఖలింగం, శ్రీకూర్మంతో పాటు వివిధ ఆలయాల్లో దర్శనాలు నిలిపివేశారు.  

Updated Date - 2020-03-23T09:11:32+05:30 IST