ఏనుగుల బీభత్సం

ABN , First Publish Date - 2020-12-28T05:36:01+05:30 IST

జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సంచరిస్తూ.. ప్రజలను గజగజ వణికిస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు.. ఏ రాత్రి వేళ.. ఏనుగులు విధ్వంసం సృష్టిస్తాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి ఇచ్ఛాపురం మండలం బాలకృష్ణాపురంలో పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఈ పొలాల నుంచి రైల్వే ట్రాక్‌ మీదుగా తుప్పల్లోకి తరలిపోయాయి. తాజాగా శనివారం రాత్రి ఇచ్ఛాపురం మండలంలోని బూర్జపాడు పొలాల్లో వరి కుప్పలను ధ్వంసం చేశాయి.

ఏనుగుల బీభత్సం

- ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సంచారం

- బూర్జపాడులో వరి కుప్పలు ధ్వంసం 

- భయాందోళన చెందుతున్న ప్రజలు

- ఒడిశా తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు

- అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు

ఇచ్ఛాపురం రూరల్‌, డిసెంబరు 27 : 

జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సంచరిస్తూ.. ప్రజలను గజగజ వణికిస్తున్నాయి.  పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు.. ఏ రాత్రి వేళ.. ఏనుగులు విధ్వంసం సృష్టిస్తాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి ఇచ్ఛాపురం మండలం బాలకృష్ణాపురంలో పంట పొలాలను  ధ్వంసం చేశాయి. ఈ పొలాల నుంచి రైల్వే ట్రాక్‌ మీదుగా తుప్పల్లోకి తరలిపోయాయి. తాజాగా శనివారం రాత్రి ఇచ్ఛాపురం మండలంలోని బూర్జపాడు పొలాల్లో వరి కుప్పలను ధ్వంసం చేశాయి. గ్రామానికి చెందిన ఇరోతు బాలరాజు, పులకల దానకరి ఆదివారం తమ పొలాలకు వెళ్లి చూడగా.. వరికుప్పలు ధ్వంసమై కనిపించాయి. పొలంలో అడుగులను బట్టి.. వరికుప్పలను ఏనుగులే ధ్వంసం చేశాయని గుర్తించారు. ఈమేరకు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో కాశీబుగ్గ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి పి.అమ్మన్నాయుడు ఆదివారం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగుల కోసం అన్వేషించారు. పొలాల చుట్టుప క్కలా సరుగుడు, జీడితోటల్లో ఏనుగులు సంచరించాయని గుర్తిం చారు. అనంతరం కేశుపురం, సన్యాసిపుట్టుగ ప్రాంతంలో నది ఒడ్డున జీడితోటల్లో ఏనుగులు ఉన్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు వెళ్లి పరిశీలించగా.. జీడితోటల్లో సుమా రు 20 ఏనుగులు కనిపించాయి. వాటిని ఒడిశాకు తరలించే ఏర్పాటు చేస్తామని కాశీబుగ్గ రేంజ్‌ అధికారి అమ్మన్నాయుడు తెలి పారు. కేశుపురం, సన్యాసిపుట్టుగతో పాటు డొంకూరు, బూర్జపాడు, కేశుపురం తదితర గ్రామాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. భయాందోళన చెందవద్దని, రాత్రుళ్లు గ్రామాల్లో మంటలు వేసుకుని మెళకువగా ఉండాలని తెలిపారు. అవి గ్రామాల్లో రాకుం డా చర్యలు తీసుకుంటామని అమ్మన్నాయుడు తెలిపారు. కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు. 


రైతుల్లో గుబులు


రెండేళ్లుగా పంటలు సరిగా పండక రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ఈ ఏడాది అరకొర వర్షాలతో ఇబ్బందులు పడుతూ వరినాట్లు వేశారు.  పంట చేతికి వచ్చే సమయంలో అడవి పందుల రూపంలో రైతన్నకు ఇబ్బందులు మొదలయ్యాయి. వాటి నుంచి రక్షించుకుని దక్కిన పంటను కోసి కుప్పలు వేశారు. తాజాగా ఏనుగులు పంట పొలాల్లో చేరి వరి కుప్పలను ధ్వంసం చేస్తున్నాయి. ఓ వైపు పంట నష్టంతో బాధపడుతుండగా.. మరోవైపు ఏనుగులు ఎప్పుడు ఏమిచేస్తాయోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తు న్నారు. పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు.  


పరిష్కార మార్గమేదీ?


జిల్లాతో పాటు విజయనగరం జిల్లావాసులను ఏళ్ల తరబడి ఏనుగుల సమస్య వెంటాడుతోంది. ప్రధానంగా ఏజెన్సీ మండలాలు.. సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను గజగజ వణికిస్తున్నా యి. కొన్నేళ్ల కిందట సీతంపేట, పాలకొండ, వీరఘట్టం, ఎల్‌. ఎన్‌.పేట, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి తదితర మండలాల్లో సంచరించాయి. వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం చేయడంతో పాటు మనుషుల ప్రాణాలను సైతం బలిగొన్నాయి. అధికారులు ‘ఆపరేషన్‌ గజ’ పేరుతో వాటిని తరలించే ఏర్పాట్లు చేశారు. కానీ.. మళ్లీ ఏనుగులు అలజడి సృష్టిస్తున్నాయి. శుక్రవారం విజయనగరం జిల్లా కొమరాడ మండలం ఆర్తాం సమీపంలో ఏనుగులు సంచరించాయి. రైల్వేట్రాక్‌పై కొద్దిసేపు సంచరించిన ఏనుగులు అటవీ ప్రాంతంవైపు వెళ్లడంతో స్థానికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సుమారు 20 ఏనుగులు సంచరిస్తుండడంతో జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు. ఎక్కడి నుంచి ఈ ఏనుగులు తరలివచ్చాయనేది చర్చనీయాంశమవుతోంది. పంట నష్టం వాటిల్లినప్పుడు, ప్రజల ప్రాణాలు తీసినప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శించి చేతులు దులుపు కుంటున్నారు. వీటిని తరలించేందుకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేసినా.. కార్యరూపం దాల్చలేదని జిల్లావాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఏనుగులను జిల్లా నుంచి శాశ్వతంగా అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.  


ప్రభుత్వమే ఆదుకోవాలి 

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని అధిక పెట్టుబడులతో సాగు చేశాం. రూ.55వేల బ్యాంకు రుణంతో పాటు, చేతిలో మరో రూ.10వేలు వరకు పెట్టుబడి పెట్టి.. 1.85 ఎకరాలు సాగు చేశాం. మధ్యలో భారీ వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిన్నాయి. ఉన్న పంటను అడవి పందుల నుంచి రక్షించుకుని కోతలు కోసి కుప్పలు వేశాం. ఇంతలో ఏనుగులు వరికుప్పలను ధ్వంసం చేశాయి. దీంతో పూర్తిగా నష్టపోయాం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. 

 - ఇరోతు.బాలరాజు, బాధిత రైతు, బూర్జపాడు



Updated Date - 2020-12-28T05:36:01+05:30 IST