కోడ్‌ కూసింది!

ABN , First Publish Date - 2020-03-08T10:00:28+05:30 IST

జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. ‘స్థానిక’ సంస్థల షెడ్యూల్‌ నేపథ్యంలో ఇక ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్‌

కోడ్‌ కూసింది!

ఎక్కడి పనులు అక్కడే!

పేదల ఇళ్ల పట్టాలు అందడం అనుమానమే


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. ‘స్థానిక’ సంస్థల షెడ్యూల్‌ నేపథ్యంలో ఇక ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంది. ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి కార్యక్రమాలను అమలు చేయరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం నుంచి ప్రారంభమైన ఎన్నికల కోడ్‌.. దాదాపు ఈ నెలాఖరు(ఫలితాలు వెల్లడి) వరకూ అమల్లో ఉండనుంది. దీంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. కోడ్‌ అమలులోకి వస్తుందని భావించి.. పాలకులు ఇటీవల ఆదరాబాదరాగా కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.


కొన్నిచోట్ల పనులు ప్రారంభించారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు ఆలస్యంగా నిధులు విడుదల చేయడంతో ఆశించిన మేర పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ కారణంగా ఈ పనులు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా పేదల కోసం తలపెట్టిన   ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది. ప్రభుత్వం ఇప్పటికే  ఇళ్ల పట్టాల పంపిణీకి లేఅవుట్లు సిద్ధం చేసింది. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. కోడ్‌ కారణంగా పట్టాల పంపిణీకి బ్రేక్‌ పడే అవకాశం కనిపిస్తోంది. 


ఉపాధి పనులకు బ్రేక్‌...

జిల్లాలో సుమారు రూ.525 కోట్ల ఉపాధి హామీ పనులు నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని సీసీ రహదారులు, కాలువలు, ఇతరత్రా పనులను ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామ సచివాలయాల నిర్మాణ పనులు మొదలుపెట్టింది. ప్రతి గ్రామంలోకూడా సిమెంట్‌ రహదారుల పనులు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుందనే ఉద్దేశంతో.. ముందస్తుగా అధికార పార్టీ నాయకులు ఉపాధి కన్వర్జెన్సీ పనులను ఆదరాబాదరాగా ప్రారంభించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు.


జిల్లాలో రూ.150 కోట్ల వరకు పనులు ఇంకా క్షేత్రస్థాయిలో ప్రారంభోత్సవం జరగకుండానే అధికారులపై ఒత్తిడి తెచ్చిమరీ పనులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు తెలిసింది. ఆయా పనులు ఎన్నికల వేళ చేపడితే.. విపక్ష నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

 

సచివాలయాల మాటేమిటి? 

జిల్లాలో గ్రామ సచివాలయాలకు అధికారపార్టీ నాయకులు వైసీపీ రంగులను వేయించారు.  కోర్టు వద్దన్నా, వెనుకడుగు వేయలేదు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో సచివాలయాలకు వేసిన ఈ రంగులను తొలగించాల్సి ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పంచాయతీ భవనాలకు పార్టీ జెండా రంగులు ఉండకూడదు.  మరి కోడ్‌ అమలు చేయడంలో అధికారులు ఏ మేరకు చిత్తశుద్ధితో వ్యవహరిస్తారో వేచిచూడాలి. 

Updated Date - 2020-03-08T10:00:28+05:30 IST