ఉద్దానానికి వంశధార

ABN , First Publish Date - 2020-02-12T09:54:05+05:30 IST

వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. కొద్దిరోజుల్లో పనులు పూర్తికానున్నాయి. ఇప్పటికే తొలి విడతగా రిజర్వాయర్‌ నుంచి కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీరందించగలిగారు. చిన్నచిన్న లోపాలను గుర్తించి

ఉద్దానానికి  వంశధార

807 గ్రామాలకు రక్షిత తాగునీరు

ఫేజ్‌-2 రిజర్వాయర్‌ నుంచి 50 కిలోమీటర్ల మేర పైపులైన్లు

ప్రతిపాదించిన అధికారులు

ఆమోదముద్ర వేసి రూ.700 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

టెండర్ల సన్నాహాల్లో యంత్రాంగం


 (శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. కొద్దిరోజుల్లో పనులు పూర్తికానున్నాయి. ఇప్పటికే తొలి విడతగా రిజర్వాయర్‌ నుంచి కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీరందించగలిగారు. చిన్నచిన్న లోపాలను గుర్తించి పూర్తిచేసే పనిలో ఉన్నారు. గొట్టా బ్యారేజీ నుంచి ఎడమ, కుడి ప్రధాన కాలువ ద్వారా దాదాపు రెండు లక్షల 20 వేల ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీరందిస్తున్నారు. వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌  నిర్మాణంతో ఈ రెండు కాలువల ఆయకట్టు పెంచే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు ప్రాజెక్టును తాగునీటి అవసరాలకు కూడా వినియోగించడానికి నిర్ణయించారు. ముందుగా ఉద్దానం గ్రామాల గొంతు తడిపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి కిడ్నీ మహమ్మారికి తాగునీరు ఒక కారణంగా నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో వంశధార నీరు శ్రేయస్కరంగా భావిస్తున్నారు. ఇదో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా గుర్తించి అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం పరిపాలన అనుమతులతో పాటు రూ.700 కోట్లు కేటాయిస్తూ ఇటీవల  ఉత్తర్వులు జారీచేసింది.

ఆఫ్‌షోర్‌ కంటే వంశధారే మేలు

గతంలో ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని పైపులైన్ల ద్వారా ఉద్దానం గ్రామాలకు అందించాలని అధికారులు డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఆఫ్‌షోర్‌ కంటే హిరమండలం రిజర్వాయర్‌ నుంచే నీరు మళ్లించడం ఉత్తమమని అధికారులు భావించారు. సుమారు 50 కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేయడం ద్వారా సులభంగా తాగునీరు అందించవచ్చని నివేదించారు. వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ సామర్థ్యం 8 టీఎంసీలుకాగా.. కనిష్ట నీటి నిల్వను రెండు టీఎంసీలు కావడంతో పుష్కలంగా తాగునీరు అందించవచ్చన్నది అధికారుల ప్రతిపాదన. దీనికి ప్రభుత్వం ఆమోదించడంతో పాటు నిధుల కేటాయింపు జరగడంతో కొద్దిరోజుల్లో పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది. 

ఆ రెండు నియోజకవర్గాల్లో..

ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో కిడ్నీ వ్యాధి బాధితులు అధికం. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో కిడ్నీ మహమ్మారి ప్రభావం చూపుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో  807 గ్రామాలకు వంశధార నీటిని అందించనున్నారు. రిజర్వాయర్‌ నుంచి నేరుగా పైపులైన్ల ద్వారా నీటిని తరలిస్తారు. స్థానిక హెడ్‌ ట్యాంకుల నుంచి గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలకు అనుసంధానం చేయనున్నారు. అక్కడ నుంచి ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించనున్నారు. 

ఫ టెండర్లను పిలుస్తున్నాం 

ఉద్దానంలో 807 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు రూ.700 కోట్లు మంజూరయ్యాయి. వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ నుంచి 50 కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటుచేయనున్నాం. ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ అతి త్వరలో నిర్వహిస్తాం. వంశధార రిజర్వాయర్‌లో కనిష్ట నీటి నిల్వలు రెండు టీఎంసీలు కావడంతో తాగునీటి లభ్యత ఉంటుంది. అందుకే ఆఫ్‌షోర్‌ను కాదని..వంశధార రిజర్వాయర్‌ నుంచి నీటి తరలింపు శ్రేయస్కరమని భావించాం. అందుకు ప్రభుత్వం కూడా ఆమోదముద్ర వేసింది. 

- సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ

Updated Date - 2020-02-12T09:54:05+05:30 IST