-
-
Home » Andhra Pradesh » Srikakulam » Double
-
రెట్టింపు!
ABN , First Publish Date - 2020-05-18T10:40:56+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. ఇప్పటివరకు ఏడు పాజిటివ్ కేసులు ఉండగా

జిల్లాలో మరో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు
చెన్నై నుంచి వచ్చినవారిలో బయటపడిన వ్యాధి లక్షణాలు
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి, మే 17)
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. ఇప్పటివరకు ఏడు పాజిటివ్ కేసులు ఉండగా, ఆదివారం ఒక్కరోజే మరో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 14కి చేరింది. కొత్తగా నమోదైన ఏడు కేసులూ చెన్నై నుంచి వచ్చిన వలస మత్స్యకారులే. ఇచ్ఛాపురం, సోంపేట, శ్రీకాకుళం మండలాలకు చెందిన ఇద్దరేసితో పాటు కవిటి మండలానికి చెందిన ఒక వ్యక్తిలో కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. ఇప్పటికే వీరంతా క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. జిల్లాకు చెందిన వేలాది మంది బతుకుతెరువుకోసం చెన్నై వెళ్లి.. లాక్‌డౌన్ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్నారు. ప్రభుత్వ సహకారంతో శ్రామిక రైళ్లలో, ప్రత్యేక బస్సుల్లోను ఇటీవల జిల్లాకు వచ్చేశారు. స్వగ్రామాల్లోకి వెళ్లనీయకుండా అధికారులు నేరుగా వీరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో కొంతమందికి ప్రాథమికంగా నిర్వహించిన ట్రూనాట్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది.
దీంతో కరోనా నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్(రివర్స్ ట్రాన్స్‌క్రిఫ్టేజ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్) పరీక్ష చేశారు. ఇందులో ఏడుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అందరూ క్వారంటైన్ సెంటర్లలో ఉన్నవారికే ‘పాజిటివ్’ అని తేలడంతో ఇటు అధికారులు పెద్దగా ఆందోళన చెందలేదు. జిల్లా ప్రజలను కూడా ఆంక్షలులోకి నెట్టివేయలేదు. ఏడుగురి బాధితుల్లో ఐదుగురిని జిల్లా కొవిడ్ ఆసుపత్రి(జెమ్స్)లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. మిగిలిన ఇద్దరిని విశాఖపట్నంలోని రాష్ట్రస్థాయి కొవిడ్ ఆసుపత్రి.. విమ్స్‌కు తరలించారు.
పెరుగుతున్న కేసులు
జిల్లాలో ముందుగా పాతపట్నం మండలంలో నాలుగు, తర్వాత శ్రీకాకుళం పీఎన్ కాలనీలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో అధికారులు ఈ రెండు ప్రాంతాలను రెడ్‌జోన్, కంటైన్మెంట్ జోన్‌లుగా ఏర్పాటు చేశారు. ఆంక్షలు కఠినతరం చేశారు. బాధితులకు జిల్లా కొవిడ్ ఆసుపత్రి(జెమ్స్)లో చేర్పించి చికిత్స అందజేశారు. దీంతో నలుగురు పూర్తిగా కోలుకుని ఇళ్లకు కూడా వెళ్లిపోయారు. చికిత్స పొందుతున్న ఇంకో వ్యక్తి కూడా పూర్తిగా కోలుకున్నారు. ఆదివారం రాత్రి డిశ్చార్జ్ కానున్నారు. కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయని సిక్కోలు వాసులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో.. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు చేరుకుని.. క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న వారిలో ‘పాజిటివ్’ లక్షణాలు బయటపడడం జిల్లావాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 14న పాతపట్నం మండలానికి చెందిన ఓ మహిళతో పాటు చెన్నై నుంచి వచ్చిన వలస కార్మికుడిలో ‘పాజిటివ్’ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. వీరిద్దరితో కలిపి జిల్లాలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య ఏడుగా నమోదైంది. దీంతో పాటు ఆదివారం ఒక్కరోజే ఏడు పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో 14కి చేరింది. వీరిలో మొత్తంగా ఐదుగురు డిశ్చార్జి కాగా, మిగిలిన 9 మంది చికిత్స పొందుతున్నారు.
ఆందోళన వద్దు ..డాక్టర్ బి.జగన్నాథరావు, ఏడీఎంహెచ్‌వో
జిల్లాలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీనిపై ప్రజలు ఆందోళన చెందవద్దు. ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న వీరికి పాజిటివ్ లక్షణాలు బయటపడడంతో చికిత్స కోసం ఐదుగురిని జిల్లాకొవిడ్ ఆసుపత్రికి, ఇద్దరిని రాష్ట్రస్థాయి కొవిడ్ ఆసుపత్రికి తరలించాం. మత్స్యకారులు ఈనెల 11న చెన్నై నుంచి జిల్లాకు వచ్చారు. వీళ్లందరినీ కేంద్రాల్లోనే ఉంచేసి పర్యవేక్షించాం. ఇప్పటివరకు మొత్తం 14 పాజిటివ్ కేసులు రాగా.. ఇందులో ఐదుగురిని డిశ్చార్జి చేసేశాం. ఇంకా యాక్టివ్ కేసులు 9 మాత్రమే ఉంటాయి.