భూములు లాక్కోవద్దు

ABN , First Publish Date - 2020-05-19T07:25:50+05:30 IST

ఆమదాలవలస మండలం కొరపాం పంచాయతీ సేపేనపేటలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి భూ

భూములు లాక్కోవద్దు

సేపేనపేట గ్రామస్థుల అభ్యంతరం

పోలీసుల సహకారంతో స్వాధీనం చేసుకున్న అధికారులు

న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు


(ఆమదాలవలస/రూరల్‌ మే 18)

ఆమదాలవలస మండలం కొరపాం పంచాయతీ సేపేనపేటలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి భూ సేకరణ విషయమై అధికారులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం నెలకొంది. తమ భూములు లాక్కోవద్దని గ్రామస్థులు అభ్యంతరం చెప్పినా.. అధికారులు వెనక్కి తగ్గలేదు. సోమవారం తహసీల్దారు రాంబాబు, సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐలు కోటేశ్వరరావు, లావణ్య పోలీస్‌ బలగాలతో గ్రామానికి చేరుకున్నారు. సర్వే నెంబర్‌ 71-1లోని ఎకరా 30 సెంట్ల భూమిలో ఉన్న పశువుల శాలలను తొలగించే ప్రయత్నం చేయగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి పేదలమైన తమ భూములే కనిపించాయా అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.


దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. జీవో 187 ప్రకారం గ్రామకంఠం అనుభవదారులకే హక్కు ఉంటుందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులు ఉంచుకోవడానికి, పశువుల సంరక్షణకు వినియోగించుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కానీ అధికారులు యంత్రాలతో బలవంతంగా పశువుల శాలలను తొలగించారు. ఆ స్థలాన్ని చదును చేయించారు. కళ్లెదుటే పశువుల శాలలు, చెట్లు తొలగించడంతో గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.


భారీగా పోలీస్‌ బలగాలు రావడంతో ఏంచేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. పంచాయతీలో 38 మందికి ఇళ్లస్థలాలు అందించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామకంఠం భూమిని సేకరిస్తున్నట్టు తహసీల్దారు రాంబాబు తెలిపారు. స్థానికులు అభ్యంతరం చెప్పడంతో పోలీసుల సహకారంతో చదును చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.


ఆధారం పోగొట్టారు

మాకు గ్రామంలో సెంటు భూమి లేదు. పూర్వీకుల కాలం నుంచి ఐదు సెంట్ల స్థలంలో పశువుల శాలలు ఉన్నాయి రెండు ఆవుల చొప్పున పెంచుకుంటూ కుటుంబాలతో జీవిస్తున్నాం. ఇప్పుడు పేదల ఇళ్లస్థలాల కోసమంటూ పశువుల శాలలను తొలగించడం సమంజసమా? మా లాంటి పేదల భూములు తీసుకోవడం అన్యాయం. కలెక్టర్‌ స్పందించి న్యాయం చేయాలి.

- సేపేన మోహనరావు, గణపతిరావు, సేపేనపేట 

Updated Date - 2020-05-19T07:25:50+05:30 IST