15 నుంచి సంక్షేమ పథకాల కార్డుల పంపిణీ

ABN , First Publish Date - 2020-02-12T10:02:13+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కార్డులను ఈ నెల 15 నుంచి 21 వరకు పంపిణీ చేయాల్సిందిగా సీఎం జగన్‌

15 నుంచి సంక్షేమ పథకాల కార్డుల పంపిణీ

రామలక్ష్మణ జంక్షన్‌, ఫిబ్రవరి 11: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కార్డులను ఈ నెల 15 నుంచి 21 వరకు పంపిణీ చేయాల్సిందిగా సీఎం జగన్‌ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బియ్యం కార్డులు జారీచేసేముందు సమస్యలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో విచారించాలని సూచించారు. ఆగిన పింఛన్ల తనిఖీలు ఈ నెల 18వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులను మార్చి 31 వరకు పంపిణీ చేయాలని తెలిపారు. ఇవి పీవీసీ కార్డులు కావడం, క్యూఆర్‌ కోడ్‌ ఉండడంతో ముద్రణలో కొంత జాప్యం జరుగుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 1.41 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులను అందిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన అందరికీ పింఛన్లు అందించాలని ఆదేశించారు. ఈ నెల 17 నాటికి విచారణ చేపట్టి, 19 నాటికి సామాజిక తనిఖీ చేసి, 24 నాటికి తుది జాబితాను తయారు చేయాలని సూచించారు. రైతు భరోసా, అమ్మఒడి పథకాలకు అర్హులై పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణం పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని, పూరిగుడిసెలో విద్యుత్‌ ఉందని, ఫ్యాన్‌ ఉందని అనర్హుల జాబితాలో చేర్చొద్దన్నారు. ఏటా 6 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, ఇళ్ల లేఔట్లను ఈ నెల 24 నాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించారు. ఉగాది తర్వాత ఇంటి స్థలం లేని నిరుపేదలు ఉండరాదన్నారు. అవ్వా, తాతలకు కంటివెలుగు కార్యక్రమాన్ని ఈ నెల 18న ప్రారంభిస్తున్నట్లు వివరించారు. పాఠశాల విద్యార్థులకు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 1.50 లక్షల కళ్ల జోళ్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.


వేసవి సెలవుల్లో పిల్లలకు అవసరమైతే నేత్ర చికిత్సలు చేయిస్తామని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమాన్ని ఆస్పత్రులకు విస్తరిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 18న కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 434 ఆరోగ్య ఉప కేంద్రాలకు స్థలాలు గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. మార్చిలో రజకులు, దర్జీలు, నాయీబ్రాహ్మణులకు ఆర్థిక సాయం, కాపునేస్తం కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు వివరించారు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ఫోన్లు ఇస్తామన్నారు. సచివాలయాల్లో 541 సేవలు అందుతున్నాయా; లేదా; పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలను సచివాలయ దగ్గర ఏర్పాటు చేయాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని, వీటికి మార్చి 15 నాటికి భవనాలు సిద్ధం చేయాలని సూచించారు. మఽధ్యాహ్న భోజనం, మరుగుదొడ్ల నిర్వహణ పక్కాగా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించినట్లు చెప్పారు. పాఠశాల విద్యాశాఖ కమిటీ సభ్యులు కూడా ఈ రెండు కార్యక్రమాలను రోజూ పరిశీలించాలని, దాని కోసం ఒక యాప్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.


డీజీపీ గౌతం సవాంగ్‌ మాట్లాడుతూ దిశ పోలీసులు జాగరూకతతో వ్యవహరించాలని, మంగళవారం విశాఖ-విజయవాడ బస్సులో ఒక వ్యక్తిని వారు అరెస్టు చేశారని తెలిపారు. కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో 1235 ప్రదేశాల్లో ఇళ్ల లేఐట్లను సిద్ధం చేస్తున్నామని, ఇప్పటికే 735 పనులు పూర్తిచేశామని తెలిపారు. 39 ఆరోగ్య ఉప కేంద్రాలకు స్థలాలను ఎంపిక చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, ఎస్పీ అమ్మిరెడ్డి, డీఆర్వో దయానిధి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ రాజారావు, బీసీ సంక్షేమాధికారి కృత్తిక, డీపీవో రవికుమార్‌, వ్యవసాయ శాఖ జేడీ కె.శ్రీధర్‌, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌ గీతాదేవి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వి.ఆదిత్యలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణచక్రవర్తి, డీఎంహెచ్‌వో చెంచయ్య, వివిధ శాఖల ప్రతినిధులు రమణకుమార్‌, ఎస్‌.రమేష్‌, నగేష్‌, వెంకటకృష్ణయ్య, డీఈవో చంద్రకళ, జెడ్పీ సీఈవో చక్రధర్‌, ప్రజారోగ్య శాఖ ఈఈ సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-12T10:02:13+05:30 IST