‘ఇంటి’ పోరు ఇంతింత కాదయా!

ABN , First Publish Date - 2020-06-06T09:50:20+05:30 IST

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జూలై 8న రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది.

‘ఇంటి’ పోరు ఇంతింత కాదయా!

పేదలకు ఇళ్ల స్థలాల సేకరణలో వివాదాలు

అనువైన వాటిని గుర్తించాలని డిమాండ్‌


(పలాస/రూరల్‌)

 పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జూలై 8న రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఖాళీ స్థలాల గుర్తింపు.. లబ్ధిదారుల ఎంపికపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కానీ స్థలాల గుర్తింపు ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. ఉదాహరణకు పలాస మండలంలోని మూడు పంచాయతీల్లో పేదలకు కేటాయించిన స్థలాల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే ధారాదత్తం చేసిన స్థలాన్ని, ముంపునకు గురైన ప్రాంతాన్ని.. శ్మశానవాటికలను పేదలకు ఇచ్చేందుకు అధికారులు ఎంపిక చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలకు ఆమోదయోగ్యమైన స్థలాలను కేటాయించాలే తప్ప... వివాదాలు సృష్టిస్తున్న ఈ స్థలాలు ఎవరి లబ్ధి కోసమనేది అధికారులే సమాధానం చెప్పాల్సి ఉందనే వాదన వినిపిస్తోంది.


అలాగే ప్రైవేటు భూముల కొనుగోళ్ల విషయంలో భారీగా చెల్లింపులు.. స్థలాల చదును చేసేందుకు అధికంగా బిల్లులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్ల స్థలాల సేకరణ విషయంలో స్థానికులకు ఎదురవుతున్న ఇబ్బందులు.. వారి నుంచి అధికారులకు తలెత్తుతున్న అభ్యంతరాలపై ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనాత్మక కథనం.


పలాస మండలం కేశుపురంలోని సర్వే నెంబర్‌ 82/4లో 2.10 ఎకరాల స్థలాన్ని.. బంటుకొత్తూరు, నీలిభద్ర, కేశుపురం తదితర గ్రామాల్లో నిరుపేదలకు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ స్థలాన్ని గతంలో నీలిభద్రలో ఉన్న భూ స్వాములు కేశుపురం ప్రజలకు ధారాదత్తం చేశారు. ఎందుకంటే.. కేశుపురం గ్రామం వర్షాకాలంలో ముంపునకు గురయ్యేది. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన  ఆవాసాలు కల్పించేందుకు ఉదారంగా ఈ స్థలాన్ని ఇచ్చారు. ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా.. ప్రభుత్వం అదే భూమిని ప్రజలకు ఇచ్చేందుకు నిర్ణయించింది.


దీనిపై ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా.. సమీపంలోని బ్రాహ్మణతర్లాలోని పేదలకు కూడా ఇదే స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించడంతో ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. తమ పంచాయతీకి చెందిన స్థలాలు వేరే పంచాయతీకి ఇవ్వడం ఏమిటని కేశుపురం వాసులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల స్థలాలు వారికి అందిస్తే ప్రతిఘటిస్తామని చెప్పడంతో అధికారులు మౌనం దాల్చారు. ఈ వ్యవహారంలో వీఆర్‌వో, కొంతమంది వైసీపీ నాయకులు జోక్యం చేసుకోవడంతో వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో అధికారులు సైతం చేతులెత్తేశారు.


ముంపునకు గురవుతుందని తెలిసినా.... 

  పలాస మండలం బ్రాహ్మణతర్లా వరహాలగెడ్డ ఉండే పోరంబోకు స్థలం... చిన్నపాటి వర్షం పడినా గెడ్డ పొంగి ఈ ప్రాంతమంతా మునిగిపోతుంది. ప్రజలకు ఇచ్చేందుకు ఇటువంటి స్థలాన్ని అధికారులు గుర్తించి.. చదును చేయడం వివాదాలకు దారి తీస్తోంది. బ్రాహ్మణతర్లాలో శివాలయం వద్ద ప్రభుత్వ పోరంబోకు భూమి ఉన్నా, దానిని ఎందుకు సేకరించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గెడ్డ పోరంబోకు స్థలాలు ఇళ్లకు అనువైనవి కాదని తెలిసినా.. అధికారులు  అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రాంతంలో ఇళ్లు నిర్మించినా.. వర్షాకాలంలో ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనిపై అధికారులు మరోసారి పునరాలోచించాల్సి ఉంది. 


శ్మశానం భూములు.. ఇళ్ల స్థలాలా?

 పలాస మండలం లక్ష్మీపురంలోని శ్మశానం స్థలాన్ని..  లక్ష్మీపురంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు   గుర్తించారు. దీనిపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా... ఈ స్థలాలు మావే అని చెబుతున్నా అధికారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు భయపడి ఈ స్థలాన్నే ఇళ్ల కోసం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 


ఈ స్థలాన్ని కొనుక్కున్నా.. : సావిత్రి, లక్ష్మీపురం

ఈ స్థలాన్ని గతంలో నేను కొనుగోలు చేశాను. దీనికి పట్టా కూడా ఉంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం శ్మశానం అని చూడకుండా..  దీంతో పాటు నా స్థలాన్ని కూడా చదును చేసి.. పట్టాలివ్వడానికి సిద్ధం చేయడం దారుణం. న్యాయం చేయాలని దీనిపై అధికారులకు విన్నవించాను. 


అధికారులే బాధ్యత వహించాలి :బత్తుల సుభాష్‌బాబు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు, బ్రాహ్మణతర్లా

వరహాలుగెడ్డ పరివాహక ప్రాంతంలో నిత్యం వర్షాకాలంలో పొలాలు ముంపునకు గురవుతూనే ఉంటాయి. అటువంటి ప్రాంతాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించడం దారుణం. వర్షాకాలలో ప్రజలకు ఇబ్బందులు వస్తే అధికారులే బాధ్యత వహించాలి. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నాం.

Updated Date - 2020-06-06T09:50:20+05:30 IST