ముదురుతున్న వివాదం

ABN , First Publish Date - 2020-09-16T10:31:40+05:30 IST

శ్రీకాకుళం నగరంలో మార్కెట్‌ నిర్వహణ విషయంలో హోల్‌సేల్‌ కూరగాయల వ్యాపారులు, నగరపాలక సంస్థ అధికారుల మధ్య

ముదురుతున్న వివాదం

కార్పొరేషన్‌ అధికారుల తీరుపై హోల్‌సేల్‌ కూరగాయల వ్యాపారుల ఆగ్రహం

నేడు మార్కెట్‌ బంద్‌


 గుజరాతీపేట, సెప్టెంబరు 15: శ్రీకాకుళం నగరంలో మార్కెట్‌ నిర్వహణ విషయంలో హోల్‌సేల్‌ కూరగాయల వ్యాపారులు, నగరపాలక సంస్థ అధికారుల మధ్య వివాదం నెలకొంది. కొవిడ్‌ నిబంధనలను పాటించలేదని కూరగాయల వ్యాపారులకు రూ.25 వేల జరిమానాను కార్పొరేషన్‌ అధికారులు విధించారు. దీంతో  వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. బుధవారం సామూహిక బంద్‌కు పిలుపునిచ్చారు.


ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలో హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ లక్ష్మీ థియేటర్‌ ప్రాంతంలో ఉండేది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు అనంతరం మార్కెట్‌ను కోడి రామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలోకి మార్చారు. వర్షాలకు మైదానం అస్తవ్యస్తంగా మారింది. భారీ వాహనాల రాకపోకలతో బురదమయంగా మారింది. దీంతో వ్యాపారులు సోమవారం లక్ష్మీ థియేటర్‌ ప్రాంతంలో క్రయవిక్రయాలు చేసుకున్నారు. దీనిపై నగరపాలక సంస్థ అధికారులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.


కలెక్టర్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తారా అంటూ ఐదుగురు వ్యాపారులకు రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. దీనిపై వ్యాపారవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కోడి రామ్మూర్తి స్టేడియంలో కనీస వసతులు లేకుండా వ్యాపారాలు ఎలా చేస్తామని..కనీసం మైదానం చిత్తడి గా మారిందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే వ్యాపారాలు చేసుకోలేమని చెప్పారు. అందుకే బుధవారం సామూహిక బంద్‌ చేపట్టనున్నట్టు ముత్యాలమ్మ వెజిటబుల్‌ హోల్‌సేల్‌ మార్క్‌ట్‌ వ్యాపారుల సంఘం ప్రతినిధులు ప్రకటించారు.


దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్‌ పల్లి నల్లనయ్య ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ కోడి రామ్మూర్తి స్టేడియంలో మార్కెట్‌ నిర్వహణకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామన్నారు. గోతుల్లో క్రషర్‌ బుగ్గి వేయించి మైదానాన్ని చదును చేస్తున్నట్టు చెప్పారు. కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు చేసినందుకే జరిమానా విధించామన్నారు. మార్కెట్‌ దుస్థితిని తమ దృష్టికి తీసుకురాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని వివరించారు.

Updated Date - 2020-09-16T10:31:40+05:30 IST