-
-
Home » Andhra Pradesh » Srikakulam » Curfew is bound
-
కర్ఫ్యూ కట్టుదిట్టం
ABN , First Publish Date - 2020-03-24T07:36:39+05:30 IST
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు జిల్లా

జిల్లాలో 31 వరకు 144 సెక్షన్ అమలు
ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి
(శ్రీకాకుళం క్రైం, మార్చి 23)
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. జిల్లాలో పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర సరుకుల దుకాణాలు మినహాయించి ఇతర షాపులన్నింటినీ సోమవారం మధ్యాహ్నం మూసివేయించారు. ఆదివారం జనతా కర్ఫ్యూలో తమదైన పాత్ర పోషించిన పోలీసులు సోమవారం కూడా అదే తరహాలో అడుగడుగునా కర్ఫ్యూ విధించారు. కరోనా వైరస్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇళ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్, ఏడురోడ్ల కూడలి, పాతబస్టాండ్, మిల్లు జంక్షన్, జీటీరోడ్, డేఅండ్‌నైట్ కూడలిలో పోలీసులు పెద్దఎత్తున మోహరించి వాహనాల రాకపోకలను అరికట్టారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను ఆటోల ద్వారా తరలిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి ఇళ్ల వద్ద పోలీసులు కాపలా కాశారు.
పకడ్బందీగా 144 సెక్షన్
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ నెల 31 వరకు 144 సెక్షన్‌ను అమలు చేస్తునట్లు ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఏడురోడ్ల జంక్షన్, సూర్యమహల్, రామలక్ష్మణ్ కూడలి ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కరోనా వ్యాధి నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సెక్షన్ 144 అమలులో భాగంగా నేటి నుంచి ప్రజలు గుంపులుగా ఒకచోట ఉన్నా, ప్రయాణించినా అదుపులోకి తీసుకుంటాం. సెక్షన్ 188 ఐపీసీ ప్రకారం అరెస్టు చేసి వారిని రిమాండ్‌కు తరలిస్తాం. కరోనా వ్యాధి నివారణకు ఇచ్ఛాపురం ప్రాంతంలో ప్రత్యేక చెక్ పోస్టు ఏర్పాటు చేశాం. ప్రజలు ప్రయాణించే అన్ని రంగాల రవాణా సంస్థలను నిలిపివేశాం.
గూడ్సు రైళ్లు మినహా అన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేశాం. గూడ్సు రైలులోని పబ్లిక్ కేబిన్‌లో ఇద్దరి కంటే ఎక్కువమంది ఉన్నట్లయితే గూడ్సు రైళ్లను కూడా ఆపివేస్తున్నాం. విదేశాల నుంచి వచ్చిన కొంతమంది గృహ నిర్బంధంలో ఉండకుండా జన సమూహంలోకి వస్తున్నారు. దీనిని కట్టడి చేసేందుకు విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని అంబేద్కర్ యూనివర్సిటీ, ట్రిబుల్ ఐటీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ గదులకు తరలిస్తున్నాం. ఒకవేళ పాజిటివ్ కేసులు నమోదైతే వారిని ప్రత్యేక వార్డులకు తరలించేలా ఏర్పాటు చేస్తున్నాం. కరోనా నివారణ ప్రజల సహకారంతోనే సాధ్యపడుతుంది. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గృహ నిర్భందంలో ఉండాలి’ అని ఎస్పీ పిలుపునిచ్చారు.
31వరకు వాహనాల రాకపోకలు నిషేధం
కరోనా వైరస్ నుంచి ప్రజలకు రక్షణ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు నగరంలోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రాకపోకలను నిషేధిస్తునట్లు ట్రాఫిక్ డీఎస్పీ సీహెచ్‌జీవి ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు, ఆటోలు, ట్యాక్సీల రాకపోకలను నిలిపివేస్తునట్లు తెలిపారు. నగరంలోని ఆటో, ట్యాక్సీ స్టాండులకు సంబంధించి రెండు వాహనాలు మాత్రమే స్టాండ్‌లో ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలను ఆసుపత్రికి తరలించేందుకు వారి సేవలను అందించాలన్నారు. ఈ విషయాన్ని యూనియన్ నాయకులు గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.