నేరాలు పెరిగాయ్‌ !

ABN , First Publish Date - 2020-12-26T05:30:00+05:30 IST

సిక్కోలులో నేరాల రేటు పెరుగుతోంది. కరోనా సమయంలో సైతం నేరాలు.. ఘోరాలు చోటుచేసుకోవడం జిల్లావాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. మరికొద్ది రోజుల్లో 2020 కాలచరిత్రలో కలిసిపోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఏడాది చోటుచేసుకున్న నేర నివేదికను డీజీపీ ఇటీవల విడుదల చేశారు. అందులో జిల్లాలో నివేదికకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే.. నేరాలు కాస్త పెరిగినట్టు తేలింది.

నేరాలు పెరిగాయ్‌ !

జిల్లాలో ఈ ఏడాది 4,071 కేసుల నమోదు

గతం కన్నా ఆరు శాతం అధికం

నేర నివేదికలో వెల్లడి

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

కాలగమనంలో మరో ఏడాది కలసిపోతోంది. ప్రపంచ చరిత్రలోనే ఈ ఏడాదికి ప్రత్యేక స్థానం ఉండబోతోంది. దీనికి కారణం కరోనా. అత్యధిక శాతం ప్రజలకు సంవత్సరంలో దాదాపు సగానికి పైగా కాలం ఇళ్లలోనే గడచిపోయింది. ఏ పనులూ ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ఎన్నో జీవితాలు తలకిందులయ్యాయి. ఎందరో ప్రముఖులు... సామాన్యులు మన నుంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆర్థిక పరిస్థితులూ మారిపోయాయి. ఏడాది చివరిలో పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది వివిధ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలు... వివిధ సంఘటనలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం.

------------

సిక్కోలులో నేరాల రేటు పెరుగుతోంది. కరోనా సమయంలో సైతం నేరాలు.. ఘోరాలు చోటుచేసుకోవడం జిల్లావాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. మరికొద్ది రోజుల్లో 2020 కాలచరిత్రలో కలిసిపోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఏడాది చోటుచేసుకున్న నేర నివేదికను డీజీపీ ఇటీవల విడుదల చేశారు. అందులో జిల్లాలో నివేదికకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే.. నేరాలు కాస్త పెరిగినట్టు తేలింది. రాష్ట్రంలో ఈ ఏడాది 15శాతం కేసులు తగ్గగా.. జిల్లాలో మాత్రం గత ఏడాది కంటే 6 శాతం నేరాల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో ఈ ఏడాది కేసులు పెరిగాయి. అందులో మొదటి స్థానంలో నెల్లూరు, రెండోస్థానంలో అనంతపురం, మూడో స్థానంలో సిక్కోలు, నాలుగో స్థానంలో చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో గత ఏడాది మొత్తం 3,854 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు 4,071 కేసులు నమోదయ్యాయి. అంటే గత ఏడాది కంటే  217 కేసులు అదనంగా పెరిగాయి. 


గుట్కా కేసుల్లో మూడోస్థానం


ఇటు సరిహద్దు రాష్ట్రాలు.. అటు ఇతర జిల్లాల నుంచి సిక్కోలు మీదుగా గుట్కా అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో గుట్కా కేసుల పట్టివేతలో కూడా మన జిల్లా టాప్‌-3లో నిలిచింది. ప్రథమస్థానంలో కృష్ణా, ద్వితీయస్థానంలో అనంతపురం జిల్లాలు ఉన్నాయి. పెద్దఎత్తున దాడులు చేస్తున్నా, గుట్కా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు.


9 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు...


మద్యం, ఇసుక అక్రమ రవాణా నియంత్రణపైనా పోలీసులు, అధికారులు నిఘా పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డినట్టు తేలింది. అక్రమాలకు పాల్పడిన వారిపై ఆరు కేసులు నమోదు చేశారు. ఇందులో 9 మంది ప్రభుత్వ ఉద్యోగులపైనా వేటు పడింది. ఇదిలా ఉండగా.. మోసాలు, మహిళలపై అఘాయిత్యాల విషయంలో మాత్రం జిల్లా అట్టడుగున ఉంది. అలాగే యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌లోనూ సిక్కోలు చివరి స్థానంలో ఉండడం కొంతలో కొంత ఊరట.

Updated Date - 2020-12-26T05:30:00+05:30 IST