‘సారా’ హుషార్‌!

ABN , First Publish Date - 2020-12-29T05:03:02+05:30 IST

జిల్లాలో సారా ఏరులై పారుతోంది. పల్లెలు... పట్టణాలు అన్న తేడా లేకుండా జోరుగా కల్తీ సారా విక్రయాలు సాగుతున్నాయి. మద్యం ధరలు పెరగడం... నాసిరకం బ్రాండ్లు విక్రయిస్తుండడంతో మందుబాబులు సారాను ఆశ్రయిస్తున్నారు. ఆపై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోంపేట మండలం సిరిమామిడిలో కల్తీసారా కాటుకు 25 మంది అస్వస్థతకు గురికావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలోనైనా అధికారులు స్పందించి సారా నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

‘సారా’ హుషార్‌!
ఏజెన్సీలో తయారు చేస్తున్న సారా

శ్రీకాకుళం జిల్లాలో జోరుగా కల్తీ సారా విక్రయాలు

అనారోగ్యం బారిన పడుతున్న ప్రజలు

పట్టించుకోని ఎస్‌ఈబీ అధికారులు

(సోంపేట రూరల్‌)

జిల్లాలో సారా ఏరులై పారుతోంది. పల్లెలు... పట్టణాలు అన్న తేడా లేకుండా జోరుగా కల్తీ సారా విక్రయాలు సాగుతున్నాయి. మద్యం ధరలు పెరగడం... నాసిరకం బ్రాండ్లు విక్రయిస్తుండడంతో మందుబాబులు సారాను ఆశ్రయిస్తున్నారు. ఆపై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోంపేట మండలం సిరిమామిడిలో కల్తీసారా కాటుకు 25 మంది అస్వస్థతకు గురికావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలోనైనా అధికారులు స్పందించి సారా నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. 

------------------

మద్య నిషేధంలో భాగంగా ధరలు పెంచడంతో పాటు షాపులు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏటా 25 శాతం షాపులను తగ్గించడం ద్వారా ఐదేళ్లలో పూర్తిగా మద్య నిషేధం సాధ్యమని స్పష్టం చేసింది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ విధానాల పుణ్యమా అని సారా తయారీ, రవాణా, విక్రయాలు జోరందుకున్నాయి. అటు ఏజెన్సీ, ఇటు మైదానం, మరోవైపు తీర ప్రాంతాల్లో సైతం సారా ఇష్టారాజ్యంగా లభిస్తోంది. డిమాండ్‌ పెరగడంతో తయారీదారులు కల్తీ సారా విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సారా తయారీలో నిషేధిత రసాయనాలు, మత్తు పెంచేందుకు ఉత్ర్పేరకాలను వినియోగిస్తున్నారు. ఇవేవీ తెలియని మందుబాబులు కల్తీ సారా తాగి చేజేతులా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. సోంపేట మండలం సిరిమామిడిలో శనివారం రాత్రి కల్తీ సారా తాగి 25 మంది అస్వస్థతకు గురికావడం జిల్లా అంతటా చర్చనీయాంశమైంది.  


ఒడిశా నుంచి యథేచ్ఛగా..


జిల్లాలో ఒడిశా సరిహద్దు ప్రాంతాలు అధికం. ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, మందస, పలాస, మెళియాపుట్టి, పాతపట్నం, కొత్తూరు, సీతంపేట, భామిని మండలాలు ఒడిశా సరిహద్దులో ఉన్నాయి. ఈ ప్రాంతాలకు ఒడిశా నుంచి సారా దిగుమతి అవుతోంది. అక్కడి నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చేరుతోంది. మందస, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు, సీతంపేట, భామిని మండలాల్లోని కొండ ప్రాంతాల్లో సారాను తయారుచేసి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది మాఫియాగా ఏర్పడి సారా అమ్మకాలకు అలవాటు చేస్తున్నారు. కొందరు గిరిజనులకు డబ్బు ఆశచూపి వారితో అమ్మకాలు, రవాణా సాగిస్తున్నారు. ఇటీవల సోంపేట, మందస, కంచిలి మండలాల్లో కావిడితో సారా ప్యాకెట్లు రవాణా చేసిన ఘటనలు వెలుగుచూశాయి. 


నేతలు, వలంటీర్ల సహకారంతో...


కొన్ని ప్రాంతాల్లో నాయకులు, వలంటీర్ల సహకారంతో సారా విక్రయాలు సాగుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల కిందట వజ్రపుకొత్తూరు మండలంలో సారా తయారీలో ఓ వలంటీరు పట్టుబడడమే ఇందుకు ఉదాహరణ. మరికొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి పేరిట సారా విక్రయాలకు తెరతీస్తున్నారు. వేలం పాట నిర్వహిస్తున్నారు. అధిక మొత్తంలో పాడిన వారికి మద్యం, సారా విక్రయించేందుకు అనుమతిస్తున్నారు. స్థానిక నాయకుల అండతో ఈ దందా సాగుతోంది. ప్రభుత్వం మద్యం, సారా, ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను నియమించింది. ఎక్సైజ్‌ శాఖ సిబ్బందిని బదలాయించింది. కానీ వీరు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రజారోగ్యానికి భంగం వాటిల్లుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సారా నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. 


ఇద్దరి అరెస్టు 


సిరిమామిడిలో కల్తీ సారా ఘటనకు సంబంధించి సోమవారం ఇద్దరిని అరెస్టు చేశామని బారువ ఎస్‌ఐ జి.నారాయణస్వామి తెలిపారు. సారా తెచ్చారన్న సమాచారం మేరకు రాణిగాం జంక్షన్‌ వద్ద మల్లెన దుర్యోధన, ధర్మాన జోగారావులను అదుపులోకి తీసుకున్నామన్నారు. జిల్లాలో ఇంకా ఎక్కడైనా సారా తయారీ, విక్రయాల విషయం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సారా నియంత్రణకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.  


చర్యలు చేపట్టాలి

గ్రామాల్లో సారా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సారా నియంత్రణకు చర్యలు చేపట్టాలి. 

- లబ్బ రుద్రయ్య, దున్నూరు, మందస మండలం


ప్రత్యేక దృష్టి సారించాం 

గ్రామాల్లో  సారా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. సారా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. పోలీసు శాఖతో కలిసి దాడులు నిర్వహించడమే కాకుండా...ముందస్తుగా బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నాం. ఒడిశా నుంచి దిగుమతులపై నిఘా పెంచాం.

ఎస్‌.ధర్మారావు, ఎక్సైజ్‌ సీఐ

Updated Date - 2020-12-29T05:03:02+05:30 IST