కరోనా బాధితులను పర్యవేక్షించాలి
ABN , First Publish Date - 2020-09-01T09:15:54+05:30 IST
‘కరోనా లక్షణాలు కనిపించగానే వైద్యాధికారులు బాధితులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అంచనా వేయాలి. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిని పర్యవేక్షించాలి’ అని కలెక్టర్ నివాస్

కలెక్టర్ నివాస్
(గుజరాతీపేట, ఆగస్టు 31)
‘కరోనా లక్షణాలు కనిపించగానే వైద్యాధికారులు బాధితులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అంచనా వేయాలి. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిని పర్యవేక్షించాలి’ అని కలెక్టర్ నివాస్ సూచించారు. సోమవారం ఐసీడీఎస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘జిల్లాలో కొవిడ్ వైద్య సౌకర్యాలను మెరుగుపర్చాం. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా హోం ఐసోలేషన్ కీలకం. చిన్నపాటి ‘కరోనా’ లక్షణాలు ఉన్నవారిని హోం ఐసోలేషన్‌లో పెడుతున్నాం.
వీరిని పక్కాగా పర్యవేక్షించాలి. ఒక్క మరణం కూడా సంభవించకూడదు. 50 ఏళ్లు దాటిన ‘పాజిటివ్’ బాధితులను కొవిడ్ కేర్ కేంద్రాలకు తరలించాలి. కొవిడ్ కేర్ సెంటర్లలో 800 పడకలు ఖాళీగా ఉన్నాయి. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలల్లో కూడా కొవిడ్ కేర్ సెంటర్లను నెలకొల్పాం. పొందూరు, రాజాం, పలాస, టెక్కలి, మెళియాపుట్టి ప్రాంతాల నుంచి ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి.
ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఆయాసం, 94 శాతం కంటే తక్కువ ఆక్సిజన్, వరుసగా మూడు రోజులు జ్వరం ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. గ్రామ సచివాలయ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలి. అక్కడి నుంచి మండల కంట్రోల్ రూంకు సమాచారం అందించి అంబులెన్స్ పంపిస్తారు.
సీహెచ్‌సీలకు బాధితులను తరలించి అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తారు. సీహెచ్‌సీలలో కూడా కరోనా మందులను అందుబాటులో ఉంచాం. కొవిడ్ నియంత్రణలో ఐసీడీఎస్ చక్కని పర్యవేక్షణ చేస్తోంది. ఇదేస్ఫూర్తిని అందరూ కొనసాగించి.. కరోనా నియంత్రణలో భాగస్వామ్యం కావాలి’ అని తెలిపారు.