దేవుడా!.. ఆలయాలపైనా కరోనా ప్రభావం

ABN , First Publish Date - 2020-03-21T09:29:23+05:30 IST

కరోనా..కరోనా...కరోనా.... ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఇదే భయాందోళన. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్‌ ప్రభావం

దేవుడా!.. ఆలయాలపైనా కరోనా ప్రభావం

తొలిసారిగా ఆదిత్యుడి దర్శనానికి బ్రేక్‌

నేటి నుంచి ఈ నెల 31 వరకూ దర్శనాలు నిషేధం

జిల్లాలో అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ ఆర్జిత సేవలు రద్దు


(అరసవల్లి, మార్చి 20)

కరోనా..కరోనా...కరోనా.... ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఇదే భయాందోళన. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్‌ ప్రభావం ప్రజలపైనే కాదు.. చివరకు దేవుడిపైనా కూడా పడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భక్తుల భద్రతా దృష్ట్యా శనివారం నుంచి ఆలయాలన్నీ తాత్కాలికంగా మూసివేయాలని దేవదాయశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అరసవల్లి, శ్రీకూర్మంతో పాటు పలు ఆలయాల్లో శనివారం నుంచి ఈ నెల 31 వరకు ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఈ పదిరోజులూ భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. తొలిసారిగా దైవ దర్శనాలకు సైతం బ్రేక్‌ పడుతోందని భక్తులు నిరాశ చెందుతున్నారు. 


జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకూ కరోనా ఎఫెక్ట్‌ తగిలింది.  ప్రత్యక్ష దైవం.. వెలుగులరేడు అరసవల్లి ఆదిత్యుడ్ని కూడా ఈ ప్రభావం తాకింది. కరోనా వైరస్‌ ప్రపంచాన్నే వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్‌ నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జనసందోహాలు బయట పెద్దగా సంచరించకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేసింది. థియేటర్లను సైతం మూసివేయించింది. తాజాగా శనివారం నుంచి ఆలయాలను సైతం తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 31 వరకు ఆలయాల్లో ఆర్జిత సేవలు రద్దు నిలిపివేయాలని, భక్తులకు ప్రవేశాన్ని నిషేధించాలని రాష్ట్ర దేవదాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగంతో పాటు వివిధ ఆలయాల్లో భక్తుల ప్రవేశాన్ని నిషేధించనున్నారు. 


తొలిసారిగా ఆదిత్యుడి దర్శనానికి బ్రేక్‌

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం.. జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. సుమారు 300 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.  ప్రత్యక్షదైవమైన ఆదిత్యుడ్ని దర్శించుకునేందుకు నిత్యం విదేశాల నుంచి సైతం భక్తులు తరలివస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం కల్గిన ఈ ఆలయానికి సైతం కరోనా ప్రభావం తాకింది. వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే ప్రచారం నేపథ్యంలో  దేవదాయశాఖ తొలిసారిగా భక్తుల ప్రవేశానికి బ్రేక్‌ వేసింది. ఈ నెల 31 వరకు భక్తుల ప్రవేశాన్ని నిషేధించింది. అయితే.. ఆలయంలో అర్చకుల ద్వారా స్వామివారికి సుప్రభాతసేవ, త్రికాల అర్చనలు, హారతి, అరుణహోమం తదితర సేవలు మాత్రం కొనసాగనున్నాయి.


1990లో ఆలయాన్ని పునఃనిర్మించిన సమయంలో కూడా భక్తులకు స్వామి వారి దర్శనాన్ని నిలిపివేయలేదు. కరోనా ప్రభావంతో తొలిసారిగా ఆదిత్యుడి దర్శనానికి బ్రేక్‌ పడిందని భక్తులు అసంతృప్తి చెందుతున్నారు.  ఇదిలా ఉండగా, కరోనా ప్రభావం కారణంగా  శుక్రవారం నుంచే కేశఖండనశాల, నిత్యన్నదాన కేంద్రాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. మొక్కులు చెల్లించడంలో భాగంగా తలనీలాలు సమర్పిస్తుంటారు. అలాగే అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. కరోనా ప్రభావంతో నేటి నుంచి ఈ నెల 31 వరకూ ఈ సేవలూ నిలిచిపోనున్నాయి.  శుక్రవారం ఒక్కరోజు మాత్రమే భక్తులకు దద్దోజనం, పెరుగు, సాంబారు అన్నాన్ని ప్రత్యేక ప్యాకెట్ల ద్వారా అధికారులు పంపిణీ చేశారు. 


వైరస్‌ నివారణకు ప్రత్యేక చర్యలు

ఆలయంలో కరోనా వైరస్‌ నివారణకు ఆలయ అధికారులు శుక్రవారం నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైపోక్లోరైడ్‌ సొల్యూషన్‌ అనే ద్రావణాన్ని పిచికారీ చేయించారు.  శుక్రవారం ఆదిత్యుడి దర్శనానికి వచ్చే భక్తుల దుస్తులపై ఈ ద్రావణం చల్లారు. ఆయూష్‌ శాఖ ద్వారా హోమియోపతి మందులను అందజేశారు. 


ఇదే ప్రథమం

300 ఏళ్ల పురాణ చరిత్ర కల్గిన ఆలయంలో కరోనా మహమ్మారి కారణంగా భక్తుల దర్శనాన్ని నిలిపివేయడం ఇదే ప్రథమం. స్వామివారికి నిత్యపూజలు ఆగవు. సుప్రభాత సేవ నుంచి పవళింపుసేవ వరకు అన్ని సేవలు కొనసాగుతాయి. 

- ఇప్పిలి శంకరశర్మ, ప్రధాన అర్చకులు, అరసవల్లి.


భక్తుల క్షేమం కోసమే...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో కూడా కరోనా బాఽధితులు పెరుగుతున్నారు. భక్తుల క్షేమం కోసమే ఆలయంలో ప్రవేశాన్ని తాత్కాలికంగా నిషేధించాం. 

-ఆలయ ఈవో, వి.హరిసూర్యప్రకాష్‌

Updated Date - 2020-03-21T09:29:23+05:30 IST