కరోనా...కరోనా!

ABN , First Publish Date - 2020-03-18T10:32:14+05:30 IST

కరోనా... ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ వైరస్‌... జిల్లా ప్రజలనూ వణికిస్తోంది. ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం భయానికి

కరోనా...కరోనా!

కొవిడ్‌-19పై పెరుగుతున్న భయం

విదేశాల నుంచి వారిలో 85 మంది ఆచూకీ దొరకని వైనం

వైద్యుల పర్యవేక్షణలోని వారు ఇళ్లు కదలొద్దు : అధికారుల హెచ్చరిక


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/కవిటి/మెళియాపుట్టి) 

కరోనా... ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ వైరస్‌... జిల్లా ప్రజలనూ వణికిస్తోంది. ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం భయానికి కారణంగా తెలుస్తోంది. ఓవైపు వైద్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెబుతున్నా.. ప్రజల్లో అపోహలు తొలగించే దిశగా అడుగులు పడడం లేదు. విదేశాల నుంచి వస్తున్న వారికి ఈ వైరస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని వదంతులు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశాల నుంచి మన జిల్లాకు వచ్చిన 85 మంది ఆచూకీ అధికారులకు తెలియకపోవడం అనుమానాలకు తావిస్తోంది.


ఇప్పటికే వైద్యుల పర్యవేక్షణలో ఉన్న వారు బయట సంచరిస్తే అరెస్ట్‌ చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేయడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. ఇంకోవైపు ప్రజల్లోని భయం వ్యాపారులకు వరంగా మారింది. మాస్క్‌లు... శానిటైజర్ల ధరలు అమాంతంగా పెంచేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై తక్షణం అధికారులు స్పందించాల్సిన  అవసరం ఉంది. కరోనా భయం పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ప్రత్యేకంగా బెడ్లు కేటాయించాలని డీఎంహెచ్‌ఓ చెంచయ్య  ఆదేశించడం కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం.


కరోనా వైరస్‌ ప్రపంచాన్నే గడగడలాడించేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే ‘కొవిడ్‌-19’ ప్రబలుతోందన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం.. ‘కరోనా’ను జాతీయ విపత్తుగా పరిగణించింది. విదేశాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారిపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించింది. వారిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచుతూ సేవలు అందజేయాలని స్పష్టం చేసింది. కానీ జిల్లాలో అధికారులు మాత్రం దీనిపై నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలంటూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కానీ, విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించడంలో విఫలమవుతున్నారు.


విదేశాల నుంచి వచ్చిన వారు ఎందరు? ఎంత మందిని గుర్తించి.. ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు? అనే విషయమై పొంతనలేని నివేదికలు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి మార్చి 16 వరకు విదేశాల నుంచి జిల్లాకు 425 మంది వచ్చినట్టు జిల్లా లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఇళ్లలోనే ఐసోలేటడ్‌ చికిత్స పొందినవారు 340 మంది. ఇంకా 85 మంది ఆచూకీని అధికారులు కనుగొనలేకపోయారు.


ఈ విషయాన్ని స్వయంగా జిల్లా ఐడీఎస్‌పీ (ఇంటిగ్రేటెడ్‌ డిసీజెస్‌ సర్వయిలెన్స్‌ ప్రోగ్రాం) స్పష్టం చేసింది. ఇందుకు కారణం.. విదేశాల నుంచి జిల్లాకు వచ్చినవారిలో పొందుపరిచిన ఫోన్‌ నంబర్లు పని చేయకపోవడం, మరికొన్ని నంబర్లు తొమ్మిది సంఖ్యలు మాత్రమే ఉండడం.. మరికొందరు జిల్లాకు వచ్చేసినట్లు చెబుతున్నా.. ముంబయి ప్రాంతాల్లో ఉంటున్నారని.. ఇలా  వివిధ కారణాలతో వారి ఆచూకీ కనుగొనలేకపోయారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు మొత్తం 85 మంది ఆచూకీ కనుగొనలేకపోవడం   విమర్శలకు తావిస్తోంది. వారి పరిస్థితి ఎలా ఉందో? ఆరోగ్యంగా ఉన్నారో.. లేదో? అందులో ఎవరికైనా ‘కొవిడ్‌ 19’ సోకిందేమో? తదితర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


అసలు వారు ఏ దేశం నుంచి వచ్చారన్న వివరాలు కూడా లభ్యం కాకపోవడం చర్చనీయాంశమవుతోంది. వాస్తవంగా విదేశాల నుంచి వచ్చిన వారిని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 14రోజులు... 28రోజులు క్వారంటైన్‌లో ఉంచాల్సిందే. వారు  కోలుకున్నంత వరకు వైద్యులు పర్యవేక్షించాలి. ఇటువంటి విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పొంచి ఉన్నట్లే. కానీ, ఇంతమంది అధికారులు ఉన్నా.. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి వివరాలు పూర్తిస్థాయిలో తెలుసుకోలేకపోవడం విమర్శలు తావిస్తోంది. 


బయట సంచరిస్తే అరెస్టులే

విదేశాల నుంచి జిల్లాకు వస్తున్న వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి.. విదేశాల నుంచి ఎవరైనా వచ్చారెమోనని ఆరా తీస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచుతూ సేవలు అందిస్తున్నారు. కొద్దిరోజులపాటు బయట సంచరించవద్దని వారిని సూచిస్తున్నారు. ఒకవేళ బయట సంచరిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మంగళవారం కవిటి మండలంలోని సీహెచ్‌ కపాసుకుద్ది, కపాసుకుద్ది గ్రామాల్లో డిప్యూటీ తహసీల్దార్‌ రమేష్‌కుమార్‌ పర్యటించారు. అబుదాబి, కువైట్‌, దుబాయ్‌ నుంచి ఇటీవల ఆరుగురు స్వగ్రామాలకు చేరుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారితో డిప్యూటీ తహసీల్దార్‌ మాట్లాడారు.


బయట ప్రదేశాల్లో సంచరించరాదని, ఇంట్లో 18 రోజులు ఉండాలని సూచించారు. వారికి జలుబు, దగ్గు, జ్వరం వచ్చినట్లయితే వెంటనే వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం అందజేయాలని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా బయట సంచరిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించారు.  మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన ఒకరు ఈ నెల 9న న్యూయార్క్‌ నుంచి హైదరాబాద్‌లో దిగారు. అక్కడి నుంచి చాపర వచ్చారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు మంగళవారం చాపర వెళ్లి.. ఆయనతో మాట్లాడారు.  హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే కరోనా వైద్య పరీక్షలు చేశారని.. అటువంటి లక్షణాలు ఏమీ తనకు లేకపోవడంతో విడిచిపెట్టేశారని ఆయన వివరించారు.  ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని ఆర్‌ఐ వైకుంఠరావు, వీఆర్వో నీలకంఠం, వైద్యసిబ్బంది సూచించారు.  


ఎలాగైనా పట్టుకుంటాం ..డా.జగన్నాథరావు, జిల్లా నోడల్‌ అధికారి

విదేశాల నుంచి జిల్లాకు  425 మందివరకు వచ్చారు. ఇందులో 85శాతం వరకు చిరునామాలను సేకరించి హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచాం. కొంతమంది ఫోన్‌ నంబర్లు ట్రేస్‌ అవ్వక, కొన్ని ఫోన్‌ నంబర్లు కేవలం తొమ్మిది మాత్రమే ఉండడం.. మరో ప్రాంతాల్లో ఉంటున్నట్లుగా చెబుతుండడం వల్ల కనుగొనలేకపోయాం. ఎలాగైనా అందరినీ పట్టుకుంటాం. వాళ్లందరికీ ఇళ్లవద్దనే ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తాం.  ఇంతవరకు జిల్లాలో ఎక్కడా కరోనా ప్రభావం కనిపించలేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు. అనవసరంగా ముక్కు, చెవులు, నోరును తాకవద్దు. చేతులను శుభ్రంగా ఉంచుకోవాల్సిందే.

Updated Date - 2020-03-18T10:32:14+05:30 IST