వాసుదేవుని బ్రహ్మోత్సవాలు చూతము రారండి

ABN , First Publish Date - 2020-02-12T09:51:53+05:30 IST

మండల కేంద్రం మందసలోని వాసుదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ వరకూ

వాసుదేవుని బ్రహ్మోత్సవాలు చూతము రారండి

రేపటి నుంచి నిర్వహణ

చురుగ్గా ఏర్పాట్లు


మందస, ఫిబ్రవరి 11: మండల కేంద్రం మందసలోని వాసుదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ వరకూ 20వ తేదీ వరకూ ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈసందర్భంగా రోజూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్వామీజీల ప్రవచనాలు ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రోజూ నిర్వహించనున్నారు.


ఇదీ చరిత్ర

 రాజుల కాలంలో ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించేవారని పేరుంది. ఇందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. 14వ శతాబ్దం నాటి ఈ వాసుదేవాలయాన్ని మందస రాజులు ఎంతో అభివృద్ధి చేశారు. తమ ఇష్టదైవంగా కొలిచేవారు. 17వ శతాబ్దం వరకూ మంజూష(మందస) సంస్థానాధీశులు ఆలయాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశారు. 1779-1823 మఽధ్యకాలంలో 45వ రాజు లక్ష్మణ్‌రాజమణిరాజ్‌దేవ్‌ ఆలయ వైభవాన్ని మరింత పెంచుతూ ఏటా తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాల నిర్వహణను ప్రారంభించారు. ఈ సంప్రదాయాన్ని 1956లో సంస్థానాల విలీనం వరకూ నిరాటంకంగా కొనసాగించేవారు. అనంతర కాలంలో నిర్లక్ష్యానికి గురైంది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలోకి వెళ్లిన అనంతరం ఆలయం అభివృద్ధిని పట్టించుకోలేదు. ఆలయం కూడా జీర్ణావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి శ్రీకూర్మం నుంచి పూరీ వరకు పాదయాత్ర నిర్వహించిన సందర్భంలో ఆలయాన్ని చూసి చలించిపోయారు. ఆలయ చరిత్రను తెలుసుకున్నారు. ఒడిశాకు చెందిన శిల్ప కళాకారులను రప్పించి రూ.2 కోల్లు వెచ్చించి ఆలయాన్ని పునర్నిర్మింపజేశారు. రాజుల కాలం అనంతరం నిలిచిపోయిన బ్రహ్మోత్సవాలు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో మళ్లీ నిర్వహించడం ప్రారంభించారు. పునర్నిర్మించిన ఆలయాన్ని 2010 ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభించారు. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలను మళ్లీ నిర్వహించడం ప్రారంభించారు. ఈ ఏడాది ఉత్సవాలను ఈ నెల 13 నుంచి 20వ తేదీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


ఇవీ కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకని 13వ తేదీ ఉదయం 9 గంటలకు ఆంజనేయస్వామి అభిషేకం, అలంకారం, అర్చన, సుందరాకాండ పారాయణం, సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 14న ఉదయం 9 గంటలకు స్వామివారికి అభిషేకం, అలంకారం, అర్చనలు, జీయర్‌స్వామి అనుగ్రహభాషణం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు సంగీత విభావరిలో భాగంగా ఆరంగి వెంకట్రావు గానామృతం, విష్ణుసహస్రనామ పారాయణం, పండితుల ప్రవచనాలు, 5 గంటలకు విశ్వక్షేణుడి ఆరాధన, వైనతేయ పటాధివాసం, శిల్లా అరుణ నృత్యప్రదర్శన ఉంటుంది. 15న ఉదయం యాగశాలలో అగ్నిప్రతిష్ట, హోమాలు, పారాయణాలు, విశేష గరుడపూజ, 11 గంటలకు హనుమంతుసేవలో వాసుదేవస్వామి వేదిక, రామపూజ ఉంటాయి. 16వ తేదీన ఉదయం హోమం, జీయరుస్వామి ప్రవచనం, లక్ష్మీపూజ నిర్వహిస్తారు. 17వ తేదీ ఉదయం హోమం, 11 గంటలకు భూసమేత వాసుదేవుని కల్యాణ మహోత్సవం, 18వ తేదీన విశేష హోమాలు, పొన్నవాహనసేవ ఉంటుంది. 19వ తేదీన ఉదయం రథోత్సవం, గోపాలసాగరంలో చక్రతీర్థస్నానం, చిన్నజీయర్‌స్వామి ప్రవచనాలు ఉంటాయి. 20వ తేదీన ఉదయం వాసుదేవస్వామి అభిషేకం, పండితుల ప్రవచనాలు, జీయర్‌స్వామి అభిభాషణం ఉంటాయి.

Updated Date - 2020-02-12T09:51:53+05:30 IST