వైరస్‌ నియంత్రణే లక్ష్యం

ABN , First Publish Date - 2020-07-28T10:21:21+05:30 IST

‘కరోనా నియంత్రణే లక్ష్యం. ఈ దిశగా.. అన్ని చర్యలు చేపడుతున్నాం.

వైరస్‌ నియంత్రణే లక్ష్యం

 ఫలితాల వేగవంతానికి చర్యలు

వివాహాలు..వేడుకలు నిర్వహించొద్దు

కలెక్టర్‌ జె. నివాస్‌ 


(కలెక్టరేట్‌, జూలై 27): ‘కరోనా నియంత్రణే లక్ష్యం. ఈ దిశగా.. అన్ని చర్యలు చేపడుతున్నాం. కరోనా పరీక్షల ఫలితాలు 24 గంటల్లోనే వెల్లడించేలా ఏర్పాట్లు చేశా’మని కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. స్వచ్ఛందంగా కరోనా పరీక్షలకు వచ్చేవారి  కోసం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే.. ‘కరోనా వ్యాప్తిపై ప్రజలు భయాందోళనకు గురి కావద్దు. శ్వాబ్‌లు సేకరించిన 24 గంటల్లోనే కరోనా ఫలితాలు వెల్లడిస్తాం.  జిల్లాలో 4802 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. సోమవారం నుంచి రోజుకు నాలుగు వేల నమూనాలను పరీక్షించేలా ఏర్పాట్లు చేశాం.


ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పీపుల్స్‌ ల్యాబ్‌ ద్వారా అదనంగా 2వేల పరీక్షలు నిర్వహిస్తాం. నమూనాలు  ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఫలితాలు వచ్చే వరకు ఇంట్లోనే ఉండాలి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. వివాహాలు, వేడుకలు ఎవరూ నిర్వహించరాదు. బంధువులు, స్నేహితుల ఇళ్లకు రాకపోకలు సాగించవద్దు. అందరూ దాదాపు ఇళ్లకే పరిమితమవ్వాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలి. కంటైన్మెంట్‌ జోన్లలో 60 శాతం మందికి పాజిటివ్‌ లక్షణాలు నిర్ధారణ అవుతున్నాయి. కరోనా లక్షణాలు ఉన్నవారంతా ఆస్పత్రిలో చికిత్స పొందండి. బాధితులు డిశ్చార్జ్‌ అయినప్పుడు ప్రభుత్వ రూ.2వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. సప్తవార ప్రక్రియలో భాగంగా ఆరోగ్య బృందాలు చేపడుతున్న సర్వేకు.. పక్కా సమాచారం అందజేయండి’ అని కలెక్టర్‌ సూచించారు. 


మండలానికి ఒక అంబులెన్స్‌

కరోనా బాధితులను ఆసుపత్రులకు తరలించేందుకు ప్రతి మండల కేంద్రంలో ఒక అంబులెన్స్‌ ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు. ‘ఈ వాహనం తహసీల్దార్‌ ఆధీనంలో ఉంటుంది. ఎక్కడైనా కేసుల సమాచారం అందితే వెంటనే ఆసుపత్రులకు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు అంబులెన్సులో తరలిస్తాం. కరోనా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందజేసేందుకు వైద్యులు, సిబ్బందిని నియమిస్తాం. ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీచేసి.. కొన్ని పోస్టులు భర్తీ చేశాం. కరోనా బాధితులపై వివక్ష చూపితే.. కఠిన చర్యలు తీసుకుంటా’మని హెచ్చరించారు. 

Updated Date - 2020-07-28T10:21:21+05:30 IST