సీఎం ఆదేశాలతో శ్రీకాకుళం వచ్చా..: మంత్రి నాని

ABN , First Publish Date - 2020-04-26T18:00:20+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయినప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం..

సీఎం ఆదేశాలతో శ్రీకాకుళం వచ్చా..: మంత్రి నాని

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయినప్పటికీ శ్రీకాకుళం, విజయనగరంలో మాత్రం మొదట కేసులు నమోదు కాలేదు. రెండ్రోజుల క్రితం వరకూ కూడా నమోదు కాలేదు.. అయితే ఒక్కసారిగా శ్రీకాకుళంలో మూడు పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ అలియాస్ నానిని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం నాడు శ్రీకాకుళం చేరుకున్న ఆయన.. పరిస్థితిని పర్యవేక్షించారు.


దురదృష్టవశాత్తు శ్రీకాకుళంకు..

పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం ఆదేశాల ప్రకారం తాను జిల్లాకు వచ్చానన్నారు. అందరూ జాగ్రత్త వహించాల్సిన సమయం ఇదని.. దురదృష్టవశాత్తు శ్రీకాకుళం జిల్లాకు కూడా సోకిందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని మంత్రి తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలు అందరూ పాటించాలని జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేశారు. కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు టోల్ ఫ్రీ నంబరు అందరికీ తెలియజేయాలని అధికారులు, జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే ప్రజలు స్వయంగా తెలియజేయాలని పిలుపునిచ్చారు. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు.


ప్రతి ఒక్కరికీ క్యూ ఆర్ కోడ్..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ.. మార్చి 10 నుంచి 22 వరకూ ఢిల్లీ వెళ్లొచ్చిన వారి వివరాలు తీసుకున్నామని తెలిపారు. వారందరినీ క్వారంటైన్‌లో పెట్టామని.. క్వారంటైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు. అంతేకాకుండా.. పది మందికి ఒక వైద్య అధికారి నియమించామన్నారు. జిల్లాలో 15,483 మందిని క్వారంటైన్‌లో పెట్టినట్లు కలెక్టర్ మీడియాకు తెలిపారు.

Updated Date - 2020-04-26T18:00:20+05:30 IST