ప్రజా భాగస్వామ్యంతోనే కరోనాకు చెక్‌

ABN , First Publish Date - 2020-03-25T11:12:41+05:30 IST

ప్రజా భాగస్వామ్యంతోనే కరోనా వైరస్‌ నియంత్రణ సాధ్యమని.. ప్రజలు స్వీయ గృహ నిర్బంధం పాటించాలని ఎస్పీ అమ్మిరెడ్డి

ప్రజా భాగస్వామ్యంతోనే కరోనాకు చెక్‌

ప్రజలు స్వీయ గృహ నిర్బంధం పాటించాలి

ఎస్పీ అమ్మిరెడ్డి సూచన

జిల్లాలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌, 144 సెక్షన్‌

52 వాహనాలు సీజ్‌


శ్రీకాకుళం క్రైం, మార్చి 24 : ప్రజా భాగస్వామ్యంతోనే కరోనా వైరస్‌ నియంత్రణ సాధ్యమని.. ప్రజలు స్వీయ గృహ నిర్బంధం  పాటించాలని ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు. జిల్లాలో 144 సెక్షన్‌ అమలు చేసిన నేపథ్యంలో మంగళవారం శ్రీకాకుళం నగరంలో పరిస్థితిని పర్యవేక్షించారు. ఏడు రోడ్ల కూడలి, చౌకబజార్‌, సూర్యమహల్‌ కూడలి ప్రాంతాలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోందన్నారు. నిర్లక్ష్యంతో చాలా దేశాలు మూల్యం చెల్లించుకున్నాయని..అందుకే స్వీయ గృహ నిర్బంధంతో ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసరమైతే తప్పించి బయటకు రాకూడదన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నట్టు తెలిపారు.


ఇప్పటికే ఇచ్ఛాపురం, పైడిభీమవరంలో హైవేపై ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్టీసీ, ప్రైవేట్‌ వాహనాలు, ఆటోలు, టాక్సీలు ఇప్పటికే నిలిపివేశామన్నారు. 144 సెక్షన్‌ ప్రకారం ద్విచక్ర వాహనాలను కూడా అడ్డుకుంటున్నామని... అత్యవసర సేవలు మినహా మిగిలిన వారిని ఇంటికి పంపిస్తున్నామని తెలిపారు. సోమవారం ఒక్కరోజే 52 కేసులు నమోదుచేసి వాహనాలను సీజ్‌ చేశామన్నారు. వీటిని 144 సెక్షన్‌ ఎత్తివేసిన తరువాత అప్పగించనున్నట్టు తెలిపారు. విదేశాల నుంచి వచ్చేవారి వివరాలను పూర్తిగా సేకరిస్తున్నామని వెల్లడించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో కూడా ఒక ప్రత్యేక బృందాన్ని నియమించామని వివరించారు. 


వృద్దురాలికి మాస్కు అందించిన ఎస్పీ

జిల్లాలో 144 సెక్షన్‌ అమలుపై పర్యవేక్షిస్తున్న ఎస్పీకి ఓ వృద్దురాలు మాస్కు లేకుండా రోడ్డుపైకి వచ్చిన వైనం కంటపడింది. దీనిపై ఎస్పీ స్పందిస్తూ కరోనా వైరస్‌ ముఖ్యంగా పెద్దవారితో పాటు చిన్నారులకు సోకే ప్రమాదముందని సూచిస్తూ తన వాహనంలో ఉన్న మాస్కును తీసి ఆమె ముఖానికి తగిలించారు.


ఆమెను తీసుకొచ్చిన వ్యక్తిని ఎస్పీ మందలించి పెద్దల ప్రాణాలతో చెలగాటం సరికాదని, తక్షణం ఇంటికి తీసుకువెళ్లాలని ఆదేశించారు. కొంతమంది యువత కరోనా వైరస్‌ తీవ్రతను పట్టించుకోకుండా వాహనాలపై తిరగటం పట్ల ఎస్పీ మండిపడ్డారు. సుమారు 50 మంది యువతను వాహనాలతో సహా పట్టుకుని వారికి కరోనా పట్ల ఎస్పీ అవగాహన కల్పించారు. 144 సెక్షన్‌ ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. 


Updated Date - 2020-03-25T11:12:41+05:30 IST