మా‘స్టారు’ తిరిగింది!
ABN , First Publish Date - 2020-05-17T10:24:33+05:30 IST
డీఎస్సీ-2008లో నష్టపోయిన అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలిచ్చేందుకు రంగం సిద్ధమైంది

ఫలించిన నిరీక్షణ
డీఎస్సీ-2008లో నష్టపోయిన వారికి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు
260 మందికి చాన్స్
నేడు అభ్యర్థుల నుంచి అంగీకార పత్రాల సేకరణ
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/నరసన్నపేట, మే 16)
డీఎస్సీ-2008లో నష్టపోయిన అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలిచ్చేందుకు రంగం సిద్ధమైంది. బీఈడీ అర్హతతో ఎస్జీటీలుగా ఎంపికైన వారికి ఎట్టకేలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మినిమం బేసిక్ పేతో వీరికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఈ క్రమంలో అభ్యర్థుల నుంచి ముందుగా అంగీకారపత్రాలు, గుర్తింపు కార్డులు తీసుకుని విద్యాశాఖ పరిశీలించనుంది. డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ) పోస్టులకు బీఈడీతో పాటు డీఈడీ అభ్యర్థులు పోటీ పడుతూ వస్తున్నారు. డీఎస్సీ-2008లో డీఈడీలకు ఈ పోస్టుల్లో 30 శాతం ప్రత్యేక కోటాను అమలు చేయడంతో బీఈడీ అభ్యర్థులు నష్టపోయారు. ఎస్జీటీ పరీక్ష రాసిన బీఈడీ అభ్యర్థులను అప్పట్లో మొదటి జాబితాల్లో ఉపాధ్యాయ పోస్టింగ్‌లకు ఎంపిక చేశారు.
డీఈడీ చేసినవారిని మాత్రమే సెకండరీ గ్రేడ్ టీచర్స్‌గా పనిచేయాలని అప్పట్లో ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 4,657 మంది బీఈడీ చేసి ఎస్జీటీలుగా ఎంపికైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని కోల్పోయారు. జిల్లాకు సంబంధించి 260 మంది అభ్యర్థులకు అవకాశం చేజారింది. దీంతో తమకు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేయాలని వీరంతా విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కోర్టును సైతం ఆశ్రయించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలతో కమిటీ ఏర్పాటు.. ఆ కమిటీ సిఫారసుతో కాంట్రాక్టు ఉద్యోగాలిచ్చేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలో ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిపై ఎస్జీటీలను నియమించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ-2008లో కామన్ మెరిట్ లిస్టులో ఉండి.. సెలెక్షన్ పద్ధతి మారడంతో గత 12 ఏళ్లుగా ఉద్యోగం పొందలేకపోయిన 4,657 మంది అభ్యర్థులకు ఊరట కల్పించింది. అభ్యర్థులు అంగీకరించినట్టయితే.. వీరికి కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎ్‌సజీటీ) ఉద్యోగం ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సంబంధిత అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ఈ నెల 18లోగా అంగీకారం తీసుకుని మెయిల్ చేయాలని డీఈవోలను ఆదేశించింది. దీంతో జిల్లాలో 260 మంది అభ్యర్థులకు ఈ అవకాశం లభించనుంది. వీరిలో ఇప్పటికే సుమారు 40 శాతం మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
70:30 నిష్పత్తితో అభ్యర్థులకు అవకాశం...
డీఎస్సీ 2008లో నూరుశాతం డీఈడీ, బీఈడీ అభ్యర్థుల ఎంపికకూ, అలాగే 70:30 నిష్పత్తితో ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో నెలకు రూ.21,230 మినిమం బేసిక్ పే పై వీరిని నియమిస్తారు. ఇలా నియమితులయ్యేందుకు అంగీకారం తెలియజేస్తూ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో గుర్తింపు పత్రాలను అందజేయాలి. ‘హెచ్‌టీటీపీఎస్://సైట్స్.గూగుల్.కామ్/ సైట్/ డీఈఓఎస్‌కేఎల్‌ఓఆర్‌జీ’ సైట్‌లో అంగీకార పత్రాల నమూనాలు ఉంచారు. అంగీకార పత్రంతోపాటు హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, ఆధార్‌కార్డులు ఆన్‌లైన్‌లోనే ఈ నెల 17లోగా ‘‘హెచ్‌టీటీపీఎస్://సైట్స్.గూగుల్.కామ్/సైట్/డీఈఓ ఎస్‌కేఎల్ ఓఆర్‌జీ’కు పంపించాలి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి నేరుగా సంప్రదించవద్దని, ఆన్‌లైన్ ద్వారానే అంగీకార పత్రాలను మెయిల్ చేసుకోవాలని డీఈఓ కె.చంద్రకళ స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 8341093000, 7995569112 నంబర్లను సంప్రదించాలని సూచించారు.