శ్రీకాకుళం జిల్లాలో అసలేం జరుగుతోంది.. ఆరా తీస్తున్న కేంద్రం

ABN , First Publish Date - 2020-04-10T22:54:36+05:30 IST

కరోనా వైరస్‌కు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీనికి గల కారణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడం

శ్రీకాకుళం జిల్లాలో అసలేం జరుగుతోంది.. ఆరా తీస్తున్న కేంద్రం

శ్రీకాకుళం జిల్లాలో కనిపించని కరోనా పాజిటివ్‌

కారణాలపై కేంద్రం ఆరా.. వివరాలు సేకరించాలని ఆదేశం

ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం నియామకం


శ్రీకాకుళం (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌కు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.  దీనికి గల కారణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడం సంతోషకరమే. అయితే.. ఎక్కడైనా ఇంతవరకు గుర్తించని పరిస్థితులు ఉన్నాయా? అనే కోణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అటువంటి కేసులను గుర్తించేందుకు జిల్లా అంతటా జల్లెడ పట్టాల్సిందేనని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులను గురువారం ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఎవరైనా...ఏవైనా అనారోగ్య కారణాలతో చేరితే... అటువంటి వారిని మరోసారి పరిశీలించాలని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించిన పరీక్షలు చేయాలని సూచించింది. దీని కోసం ప్రత్యేకంగా ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం (ఆర్‌ఆర్‌టీ)ను నియమించారు.


ఆర్‌ఆర్‌టీ బృందంలో అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.బగాది జగన్నాథరావు, సోషల్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఎస్‌పీఎం) వైద్యుడు డా.శరత్‌, పల్మనాలజిస్టు డా. ఎస్‌.చలపతిరావు తదితరులు ఈ బృందంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా కేసులను గుర్తించేందుకు జల్లెడ పట్టే కార్యక్రమానికి ఈ బృందం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కిమ్స్‌ ఆసుపత్రి, రాగోలులోని జెమ్స్‌, గుజరాతీపేటలో గల ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను సందర్శించింది. అక్కడి వైద్యులు, సిబ్బందితో పాటు రోగులతో చర్చించి... వివరాలు సేకరించింది. వాస్తవంగా కరోనా కేసులు లేకపోవడానికి కారణాలను కూడా బృంద సభ్యులు సేకరించనున్నారు. తీవ్ర శ్వాసకోశ వ్యాధులు( సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌-ఎస్‌ఏఆర్‌ఐ), ఫ్లూజ్వరాలు (ఇన్‌ఫ్లూంజా లైక్‌ ఇల్‌నెస్‌- ఐఎల్‌ఐ) వంటి కేసులను కూడా ఆర్‌ఆర్‌టీ బృందం ప్రత్యేకించి పరిశీలించనుంది.

Updated Date - 2020-04-10T22:54:36+05:30 IST