అందరూ పాసైనట్టే

ABN , First Publish Date - 2020-06-21T10:51:37+05:30 IST

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షలు రాయకుండానే విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించినట్టు ప్రకటించింది. కరోనా

అందరూ పాసైనట్టే

పదో తరగతి పరీక్షలు రద్దు

విద్యార్థులంతా ఉత్తీర్ణత పొందినట్టే

కరోనా ఉధృతి వేళ ప్రభుత్వ కీలక నిర్ణయం

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో హర్షం


గుజరాతీపేట, జూన్‌ 20:ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షలు రాయకుండానే విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించినట్టు ప్రకటించింది. కరోనా వైరస్‌ ఉధృతి దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 38,282 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందినట్టే. తొలుత మార్చి 23 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలైంది. కానీ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో అప్పట్లో పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంతలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి పదో తరగతి పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి.


ఇటీవల ప్రభుత్వం జూలై 10 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించేలా జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అప్పటివరకూ ఉన్న 189 పరీక్ష కేంద్రాలను 289కి పెంచారు. ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, స్క్వాడ్‌, కస్టోడియన్స్‌, చీఫ్‌ సూపరింటెండెంట్ల నియామకంలో డీఈవో చంద్రకళ నిమగ్నమయ్యారు. ఇంతలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. కరోనా ఉధృతి వేళ ప్రభుత్వ నిర్ణయంపై అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పది పరీక్షలు రద్దుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉందని డీఈవో చంద్రకళ తెలిపారు. 


ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు కూడా

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను సైతం ఇంటర్‌ బోర్డు రద్దు చేసింది. ఇటీవల ఇంటర్‌ ఫలితాలు వెల్లడికాగా..  జూలై 11 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో రద్దుచేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఈ నెల 22 వరకూ నిర్ణయించారు. పరీక్షలు రద్దు కావడంతో పరీక్ష ఫీజు చెల్లింపులు నిలిచిపోనున్నాయి. ఇంటర్‌ ప్రశ్నపత్రాలు, మార్కుల పున పరిశీలన ప్రక్రియ యథాతధంగా కొనసాగుతుందని ఆర్‌ఐవో రుక్మాంగధరావు తెలిపారు.

Updated Date - 2020-06-21T10:51:37+05:30 IST