లక్‌ ఉంటేనే.. సీటు!

ABN , First Publish Date - 2020-06-22T11:33:12+05:30 IST

ఏపీ రెసిడెన్షియల్‌(గురుకుల) పాఠశాలల్లోని అడ్మిషన్ల ప్రక్రియలో భారీ మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి

లక్‌ ఉంటేనే.. సీటు!

లాటరీ పద్ధతిలో.. ‘గురుకుల’ అడ్మిషన్లు 
ప్రవేశ పరీక్షకు బ్రేక్‌ 

ఎచ్చెర్ల, జూన్‌ 21: ఏపీ రెసిడెన్షియల్‌(గురుకుల) పాఠశాలల్లోని అడ్మిషన్ల ప్రక్రియలో భారీ మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 5, 6, 7 తరగతుల అడ్మిషన్లలో అర్హత పరీక్ష(ఎంట్రన్స్‌)కు బదులుగా దరఖాస్తుల నుంచి లాటరీ విధానంలో సీట్లు కేటాయించనుంది. గత ఏడాది వరకు జిల్లాస్థాయిలో  ప్రవేశ పరీక్ష నిర్వహించి.. విద్యార్థులను చేర్చుకునే వారు.  ఈ ఏడాది నుంచి అడ్మిషన్లను లాటరీ పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జీవో ఆర్టీ నెంబర్‌ 121ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. 
దివంగత నేత.. మాజీ ముఖ్యమంత్రి పీవీ నర్సింహారావు హయాంలో 1972లో ఏపీ గురుకుల పాఠశాలలు ఏర్పడ్డాయి.

అప్పటి నుంచి నిరాటంకంగా ఈ పాఠశాలలు కొనసాగుతున్నాయి. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాయి. గతంలో ఐదో తరగతిలో విద్యార్థుల ప్రవేశాలు లాటరీ పద్ధతిలో నాలుగేళ్లు కొనసాగాయి. విద్యా హక్కు చట్టం నిబంధన ప్రకారం 8వ తరగతి లోపు ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండానే అడ్మిషన్లు చేపట్టాలి, ఈ క్రమంలో గతంలో వరుసగా నాలుగేళ్లపాటు లాటరీ పద్ధతిలో ప్రవేశాలు జరిగాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు,  సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో తిరిగి ప్రవే శ పరీక్షల ద్వారానే అడ్మిషన్లు ఇచ్చారు. లాటరీ పద్ధతిని రద్దు చేసి గత ఏడాది వరకు ఐదేళ్లపాటు ఎంట్రన్స్‌ ద్వారానే ఐదో తరగతిలో ప్రవేశాలు నిర్వహించారు.

తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరం(2020-21)లో లాటరీ పద్ధతిలో ప్రవేశాలు జరగనున్నాయి. జిల్లాలో ఎస్‌.ఎం.పురం (బాలురు), వమరవల్లి (బాలికలు) ఏపీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో ఐదో తరగతిలో 80 సీట్లు చొప్పున ఉన్నాయి. లాటరీ పద్ధతిలో ఈ సీట్లు భర్తీ చేయనున్నారు. 6,7 తరగతుల బ్యాక్‌లాగ్‌ అడ్మిషన్లు కూడా లాటరీ పద్ధతిలోనే నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉందని ఎస్‌.ఎం.పురం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌, కన్వీనర్‌ కిమిడి జగన్మోహన్‌రావు తెలిపారు. 

Updated Date - 2020-06-22T11:33:12+05:30 IST