ఆ ట్రక్కు.. మాకొద్దు..!

ABN , First Publish Date - 2020-12-31T05:26:00+05:30 IST

ప్రత్యేక వాహనాల(మినీ ట్రక్కులు) ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి బ్రేక్‌ పడింది. ట్రక్కుల కోసం దరఖాస్తు సమయంలో పోటీపడిన అభ్యర్థులు.. ఇప్పుడు వాహనాలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. తొలుత ప్రతి నెలా అద్దె మొత్తాన్ని లబ్ధిదారుడి ఖాతాలో వేస్తామని అధికారులు చెప్పారు. కానీ... ట్రక్కుల ఈఎంఐ కింద వాటిని జమ చేసుకుంటామని బ్యాంకర్లు మెలిక పెట్టడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ట్రక్కులు తీసుకోవాలా? వద్దా? అని సతమతమవుతున్నారు.

ఆ ట్రక్కు.. మాకొద్దు..!

 వాహనాలు పొందేందుకు లబ్ధిదారులు వెనకడుగు

 ఇంటింటికీ రేషన్‌ పంపిణీకి బ్రేక్‌ 

 ఈఎంఐ కింద అద్దె నగదు జమకు బ్యాంకర్ల యోచన

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రత్యేక వాహనాల(మినీ ట్రక్కులు) ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి బ్రేక్‌ పడింది. ట్రక్కుల కోసం దరఖాస్తు సమయంలో పోటీపడిన అభ్యర్థులు.. ఇప్పుడు వాహనాలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. తొలుత ప్రతి నెలా అద్దె మొత్తాన్ని లబ్ధిదారుడి ఖాతాలో వేస్తామని అధికారులు చెప్పారు. కానీ... ట్రక్కుల ఈఎంఐ కింద వాటిని జమ చేసుకుంటామని బ్యాంకర్లు మెలిక పెట్టడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ట్రక్కులు తీసుకోవాలా? వద్దా? అని సతమతమవుతున్నారు. 

-----------------

ఇంటింటా రేషన్‌ సరుకుల సరఫరాకు ప్రభుత్వం రాయితీపై అందజేయనున్న మినీట్రక్కులపై(రవాణా వాహనాలు) లబ్ధిదారుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికీ మినీ ట్రక్కుల ద్వారా రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కార్పొరేషన్‌ల ద్వారా రాయితీపై వీటిని అందజేయాలని భావించింది. ప్రభుత్వం సబ్సిడీ 60 శాతం ఇవ్వగా.. బ్యాంకులు 30 శాతం రుణం అందిస్తాయి. లబ్ధిదారుడు కేవలం పది శాతం వాటా చెల్లిస్తే చాలని అధికారులు ప్రకటించారు. అంటే యూనిట్‌ ధర రూ.6 లక్షలు నిర్ణయిస్తే.. లబ్ధిదారుడి వాటాగా రూ.10వేలు చెల్లిస్తే చాలు.. ట్రక్కు సొంతమవుతుంది. దీంతో చాలా మంది ఈ వాహనాల కోసం పోటీ పడ్డారు. జిల్లాలో 526 వాహనాల పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానించగా.. 4,701 మంది దరఖాస్తు చేశారు. వీందరికీ ఈ నెల 4, 5 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ పైరవీలు సాగాయి. పెద్దఎత్తున లంచాలు చేతులు మారాయనే విమర్శలు వినిపించాయి. అప్పుడు వాహనాల కోసం పోటీ పడిన అభ్యర్థులంతా.. ప్రస్తుతం బ్యాంకర్ల తీరుతో వాటిని తీసుకునేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు.  


ఈఎంఐ మెలిక


ట్రక్కుల్లో రేషన్‌ సరుకులు ఇంటింటికీ సరఫరా చేసినందుకు పౌర సరఫరాల సంస్థ ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి ప్రతి నెలా రూ.16 వేల చొప్పున చెల్లించనుంది. ఇందులో వాహనం అద్దె రూ.10వేలు, వాహన మెయింటెనెన్స్‌ రూ.3వేలు, ఇంధన ఖర్చుల కోసం మరో రూ.3వేలు కేటాయించనున్నట్టు వెల్లడించింది. వాహనం అద్దె రూ.10వేలను లబ్ధిదారులకు ఇవ్వకుండా.. ఈఎంఐ కింద జమ చేసుకుంటామని బ్యాంకర్లు చెబుతున్నారు. అలా అయితే తమకేమీ మిగలదనే ఉద్దేశంతో ట్రక్కులు తీసుకునేందుకు లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారు. రాయితీ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని తొలుత ప్రచారం చేయడంతో ట్రక్కులు పొందేందుకు చాలా మంది ఎగబడ్డారు. కానీ అగ్రిమెంట్‌ సమయంలో నిర్వహణ మొత్తాన్ని ఈఎంఐ కింద జమ చేసుకుంటామని బ్యాంకర్లు చెబుతుండడంతో ట్రక్కులు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. 526 మందిలో ఒక్కరు కూడా బ్యాంకుతో అగ్రిమెంట్‌ చేసుకోలేదని తెలిసింది. దీంతో చేసేది లేక ట్రక్కుల ద్వారా ఇంటింటికీ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. జేసీ నేతృత్వంలో మరోసారి కార్పొరేషన్‌ చైర్మన్లు, బ్యాంకర్లు సమావేశమయ్యారు. ఈ విషయమై చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తమకు చెల్లించాల్సిన అద్దె  మొత్తాన్ని బ్యాంకర్లు ఈఎంఐ కింద జమ చేసుకోకుండా చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ దిశగా అధికారులపై ఒత్తిడి తేవాలని.. నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2020-12-31T05:26:00+05:30 IST