స్పీకర్‌ ఎదుటే బాహాబాహీ

ABN , First Publish Date - 2020-06-26T11:47:21+05:30 IST

పొందూరు మండల వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. సాక్షాత్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సమక్షంలో రెండువర్గాలు బాహాబాహీకి దిగాయి.

స్పీకర్‌ ఎదుటే బాహాబాహీ

పొందూరు వైసీపీలో బయటపడిన విభేదాలు

వివాదానికి దారితీసిన పార్టీ కార్యవర్గాల నియామకం 


(పొందూరు, జూన్‌ 25): పొందూరు మండల వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. సాక్షాత్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సమక్షంలో రెండువర్గాలు బాహాబాహీకి దిగాయి. పార్టీ కార్యవర్గాల నియామకంలో ఓ వర్గానికి ప్రాధాన్యమిచ్చారంటూ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడమే వివాదానికి కారణం. గురువారం పొందూరు ఏఎంసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. కార్యక్రమానికి స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఆయన తనయుడు చిరంజీవినాగ్‌ హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం స్పీకర్‌ వేదిక కిందకు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన నాయకుడు మరో నేతపై విమర్శలకు దిగారు.


పార్టీ కార్యవర్గాల నియామకంలో బయటి నుంచి వచ్చిన వారి పెత్తనమేమిటని ప్రశ్నించారు. దీంతో మాటా మాటా పెరిగి ఒకరికొకరు నెట్టుకున్నారు. పురుష పదజాలంతో తిట్టుకున్నారు. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. స్పీకర్‌ సమక్షంలో ఘటన జరుగగా..ఆయన అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్పీకర్‌ తనయుడు ఇరువర్గాలను శాంతింపజేశారు. పోలీసులు కలుగజేసుకొని వారిని అక్కడి నుంచి పంపించారు. కొంతసేపటి తరువాత చిరంజీవినాగ్‌ ఏఎంసీ కార్యాలయంలో ఇరువర్గాలను వేర్వేరుగా పిలిచి చర్చించారు. ఆ సమయంలో ఒక వర్గం లోపల ఉండగా..మరో వర్గం బయట హడావుడి సృష్టించింది.


బయటకు రండి అమీతుమీ తేల్చుకుందామని హెచ్చరించడం ఉద్రిక్తతకు దారితీసింది. చిరంజీవి నాగ్‌ వచ్చి సముదాయించినా వారు బెట్టు వీడలేదు. సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐ రామకృష్ణలు సిబ్బందితో అక్కడకు చేరుకోవడంతో వివాదం సద్దుమణిగింది. చివరకు ఇరువర్గాలతో స్పీకర్‌ తనయుడు చర్చించారు.   ఈ ఘటన ఎటు దారితీస్తుందోనని వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


Updated Date - 2020-06-26T11:47:21+05:30 IST