పశు బీమా.. ఎందుకంత ధీమా!
ABN , First Publish Date - 2020-10-19T10:12:25+05:30 IST
పశు బీమా.. ఎందుకంత ధీమా!

పరిహారం చెల్లింపులో జాప్యం
జిల్లావ్యాప్తంగా రూ.1.14 కోట్ల బకాయిలు
ఏడాదిగా ఎదురుచూస్తున్న బాధిత రైతులు
సాంకేతిక కారణాలు చూపుతున్న అధికారులు
(రాజాం)
పశు బీమా పరిహారం చెల్లింపుల్లో ఎడతెగని జాప్యమవుతోంది. ఏడాదిగా చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లావ్యాప్తంగా రూ.1.14 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో బాధిత రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అధికారులు మాత్రం కుంటిసాకులు చెబుతున్నారు. పశు బీమా పథకంలో భాగంగా పశుసంవర్థక శాఖ అధికారులు ‘పశు గణన’కు శ్రీకారం చుట్టారు. రైతుల వద్ద ఉన్న పాడి పశువులు, గొర్రెలు, మేకలను గుర్తించారు. వాటికి ప్రత్యేక ట్యాగులు సైతం ఏర్పాటు చేశారు. ఏటా ఈ ప్రక్రియ కొనసాగింది. పాడి ఆవులు, గేదెలు మృత్యువాత పడితే రూ.30వేలు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6 వేల చొప్పున పరిహారం అందిస్తామని అధికారులు ప్రకటించారు. గత ఏడాదిగా వివిధ కారణాలతో చనిపోయిన పశువులకు బీమా పరిహారం మాత్రం చెల్లించలేదు. రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని.. సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతూ వస్తున్న ప్రభుత్వం పశు బీమా పరిహారం చెల్లింపుల్లో జాప్యం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో ఇంతవరకూ వివిధ కారణాలతో 3,466 పశువులు మృత్యువాత పడ్డాయి. 203 ఆవులు, గేదెలకు రూ.61.49 లక్షలు పరిహారం రూపంలో చెల్లించారు. గొర్రెలు, మేకలకు సంబంధించి రూ.14లక్షల పరిహారం చెల్లించినట్టు పశుసంవర్థక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా 3,200 ఆవులు, గేదెలు, 63 గొర్రెలు, మేకలకు సంబంధించి సుమారు రూ.1.14 కోట్ల మేర పరిహారం చెల్లించాల్సి ఉంది. బాధిత రైతులు అధికారులను అడగ్గా.. బిల్లులు ఆర్బీఐలో పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత మంత్రి జిల్లాకు చెందినవారైనా న్యాయం జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పరిహారం త్వరితగతిన అందించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నా..
ఆరు నెలల కిందట రెండు ఆవులు మృతి చెందాయి. పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అందించడం లేదు. ఆవులే మా కుటుంబానికి అండ. పశుబీమా ఉండడంతో పరిహారం వస్తుందని ఆశించాం. కానీ జాప్యమవుతుండడంతో అసలు పరిహారం వస్తుందా? అన్న అనుమానం కలుగుతోంది.
-ఎస్.సత్తిబాబు, పొనుగుటివలస, రాజాం మండలం